Yuvraj Singh: నాణ్యత లేని అపార్ట్‌మెంట్.. రియల్‌ ఎస్టేట్ సంస్థలకు యువరాజ్ సింగ్ నోటీసులు

సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా అపార్ట్‌మెంట్‌ను నిర్మించి ఇచ్చారని భారత మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్ దిల్లీలోని పలు నిర్మాణ సంస్థలకు నోటీసులు పంపారు. 

Published : 28 May 2024 00:04 IST

దిల్లీ: భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్‌ సింగ్ (Yuvraj Singh) దిల్లీకి చెందిన మూడు రియల్ ఎస్టేట్ సంస్థలకు వేర్వేరుగా రెండు లీగల్‌ నోటీసులు పంపారు. దిల్లీలో తనకు నిర్ణీత గడువులోగా అపార్ట్‌మెంట్‌ను అప్పగించలేదని రెండు సంస్థలకు, ఓ నిర్మాణ ప్రాజెక్టుల ప్రచారంలో తన గోప్యతా హక్కులను ఉల్లంఘించారని ఒక సంస్థకు వేర్వేరుగా నోటీసులు పంపారు. 2020లో దిల్లీలో రెండు రియల్ ఎస్టేట్ సంస్థలకు చెందిన ఒక హౌసింగ్‌ ప్రాజెక్ట్‌లో యువరాజ్‌ సింగ్‌ ఒక అపార్ట్‌మెంట్‌ను బుక్ చేసుకున్నారు. అయితే.. నిర్మాణాన్ని నిర్ణీత గడువు లోపు పూర్తి చేయడంలో, అప్పగించడంలో ఆలస్యం జరిగింది. పైగా అందుకు సహేతుకమైన కారణాలూ ఆ సంస్థలు వెల్లడించలేదని ఆయన నోటీసుల్లో పేర్కొన్నారు. అంతేకాకుండా నాసిరకం పనులతో చేపట్టిన అపార్ట్‌మెంట్‌ను అప్పగించారని యూవీ ఆరోపించారు. ఈ క్రమంలోనే నాణ్యతా ప్రమాణాలతో కూడిన అపార్ట్‌మెంట్‌ను అందించాలని డిమాండ్‌ చేస్తూ సదరు సంస్థలకు లీగల్‌ నోటీసులు పంపారు.

అలాగే, ఓ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు ప్రచారం కోసం తనతో రూపొందించిన ప్రకటన విషయంలో నిబంధనలు ఉల్లంఘించిందని ఆరోపించారు. ఇది తన గోప్యతా హక్కుకు భంగంకలిగించడమేనంటూ.. ఆ రియల్ ఎస్టేట్ సంస్థకు నోటీసులు పంపారు. సదరు సంస్థతో ప్రచారానికి సంబంధించిన ఒప్పందం 2023 నవంబర్‌లోనే ముగిసినప్పటికీ ఇంకా తన పేరును, ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో వాడుకోవడంపై అభ్యంతరం తెలిపారు. ఇవి ప్రముఖుల బ్రాండ్ విలువను దుర్వినియోగం చేయడంతో పాటు వ్యక్తిగత హక్కులు, కాపీ రైట్ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తాయని నోటీసులో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు