Chahal: వేలంలో తీసుకుంటామని హామీ ఇచ్చారు.. ఒక్క బిడ్‌ కూడా వేయలేదు: చాహల్‌

టీమ్‌ఇండియా స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌ (Yuzvendra Chahal) టీ20 క్రికెట్‌లో అద్భుత ఆటతీరున ప్రదర్శిస్తున్నాడు. అయితే, రెండేళ్ల కిందట ఆర్‌సీబీ తరఫున ఆడిన చాహల్‌ను ఆ జట్టు రిటెయిన్‌ చేసుకోకపోవడంతో వేలంలోకి వచ్చాడు. అక్కడ రాజస్థాన్‌ కొనుగోలు చేసింది.

Published : 16 Jul 2023 10:30 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2021 (IPL) సీజన్‌ ముగిసిన తర్వాత యుజ్వేంద్ర చాహల్‌ను (Chahal) రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB) తమతో అట్టిపెట్టుకోలేదు. ఆ సమయంలో ఆర్‌సీబీ తీరుపై విమర్శలు వచ్చాయి. దాదాపు ఎనిమిదేళ్లపాటు బెంగళూరు తరఫున ఆడిన చాహల్‌ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. అయినా, అతడిని రిటెయిన్‌ చేసుకోలేదు. కనీసం అతడిని పక్కన పెట్టడానికి కారణమేంటో కూడా చాహల్‌కు చెప్పకపోవడంతో విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇదే అంశంపై చాహల్‌ స్పందించాడు.

‘‘2014లో బెంగళూరు జట్టుతో నా ప్రయాణం మొదలైంది. తొలి మ్యాచ్‌ నుంచి విరాట్ కోహ్లీ నా మీద నమ్మకంతో ఉన్నాడు. అయితే, నన్ను రిటెయిన్‌ చేసుకోకపోవడం తీవ్రంగా బాధించింది. ఎనిమిదేళ్లపాటు ఫ్రాంచైజీ కోసం ఆడాను. కనీసం కారణం కూడా చెప్పకపోవడం ఆవేదనకు గురి చేసింది. కొంతమంది నేనే ఎక్కువగా డబ్బు అడిగినట్లు మాట్లాడుకోవడం నా దృష్టికి వచ్చింది. అందుకే పలు ఇంటర్వ్యూల్లో దానిపై స్పష్టత కూడా ఇచ్చా. నేను ఎలాంటి ప్రయోజనాలను అడగలేదు. నేనెంత తీసుకోవడానికి అర్హుడినో నాకు తెలుసు. అలాంటి వ్యాఖ్యలు వచ్చినప్పుడు కూడా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు నుంచి కనీసం ఒక్క ఫోన్‌ కాల్‌ కూడా రాలేదు. ఇది మరింత నిరుత్సాహపరిచింది. ఇప్పటికీ నన్ను ఎందుకు తీసుకోలేదో కూడా చెప్పలేదు.

అతడొక్కడు 171.. వాళ్లు 130

ఆర్‌సీబీ తరఫున 140 మ్యాచ్‌లు ఆడుంటా. అయితే, సరైన సమాచారం ఇవ్వకుండానే నన్ను పక్కన పెట్టారు. రిటెయిన్‌ చేసుకోకపోయినప్పటికీ వేలంలో తీసుకుంటామని నాకు హామీ ఇచ్చారు. కానీ, వేలం సందర్భంగా ఒక్క బిడ్‌ కూడా వేయలేదు. దాంతో నాకు ఆర్‌సీబీపై విపరీతమైన కోపం వచ్చింది. వారి కోసం ఎనిమిదేళ్లు ఆడినా పట్టించుకోలేదు. నాకు చిన్నస్వామి స్టేడియం అంటే చాలా ఇష్టం. అయ్యిందేదో అయింది. అదంతా మంచికే జరిగిందని నమ్ముతున్నా. రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టులోకి వచ్చిన తర్వాత నేను డెత్‌బౌలర్‌గా మారా. చివరి ఓవర్లలో బౌలింగ్‌ చేయడం ప్రారంభించా. గతంలో ఆర్‌సీబీ తరఫున చివరిగా 16 లేదా 17వ ఓవర్‌ వేసేవాడిని. ఇప్పుడు రాజస్థాన్‌ జట్టు తరఫున డెత్‌ ఓవర్లలో బౌలింగ్‌ వేస్తున్నా. అప్పటికి, ఇప్పటికీ నా ఆట 5 నుంచి 10 శాతం పెరిగింది. దీంతో అప్పుడు జరిగిందంతా మన మంచికే అనుకుంటున్నా’’ అని చాహల్‌ తెలిపాడు. 

ఐపీఎల్ 2021 సీజన్‌ తర్వాత జరిగిన వేలంలో చాహల్‌ను రాజస్థాన్‌ రాయల్స్‌ సొంతం చేసుకుంది. చాహల్‌ కోసం ఆర్‌సీబీ ఒక్క బిడ్‌ వేయకపోవడం గమనార్హం. దిల్లీ క్యాపిటల్స్, ముంబయి ఇండియన్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య తీవ్ర పోటీ వచ్చింది. చివరికి సంజూ శాంసన్‌ నాయకత్వంలోని రాజస్థాన్‌ జట్టు చాహల్‌ను రూ. 6.50 కోట్లకు దక్కించుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని