iPhone: ఐఫోన్‌ కొత్తందం!

Eenadu icon
By Technology News Desk Published : 05 Mar 2025 03:54 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

ఐఫోన్‌ నిత్య నూతనంగా ఆకర్షిస్తుండటానికి కారణమేంటి? దాని సాఫ్ట్‌వేరే. ఐప్యాడ్, ఐమ్యాక్‌ వంటి ఇతర యాపిల్‌ పరికరాలకూ ఇదే వర్తిస్తుంది. ఐఓఎస్‌ 18 వర్షన్‌లో కొంతవరకూ కృత్రిమ మేధ ఆధారిత యాపిల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్లను ఇప్పటికే ఉపయోగించుకుంటున్నారు. తాజాగా ఐఓఎస్‌ 18.4 డెవలపర్‌ బీటా వర్షన్‌ మరిన్ని ఫీచర్లతో ఊరిస్తోంది. డెవలపర్లు, ఔత్సాహికులు వీటిని పరీక్షిస్తున్నారు. ఇవి అందరికీ అందుబాటులోకి రావటానికి ఇంకొంత సమయం పడుతుంది. ఆ లోపు ఆసక్తికరమైన కొన్ని ఫీచర్ల మీద ఓ కన్నేద్దామా!

బహుభాషా ప్రపంచం

యాపిల్‌ ఇంటెలిజెన్స్‌ మొదట్లో ఒక్క యూఎస్‌ ఇంగ్లిష్‌నే సపోర్టు చేసేది. 18.2 వర్షన్‌ పలు స్థానిక ఇంగ్లిష్‌ యాసలకూ విస్తరించింది. ఇప్పుడిది మరింత విస్తృతమైంది. మనదేశంతో పాటు సింగపూర్‌లోని ఇంగ్లిష్‌నూ సపోర్టు చేస్తోంది. అలాగే ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, పోర్చుగీస్‌ (బ్రెజిల్‌), స్పానిష్, జపనీస్, కొరియన్, చైనీస్‌ భాషలనూ ఆమోదిస్తుంది. కొత్త భాషలను సపోర్టు చేయటమే కాకుండా వేర్వేరు భాషల్లో వివిధ రకాలుగా ఆలోచనలను, భావాలను వ్యక్తం చేస్తుంది కూడా. 

ప్లేగ్రౌండ్‌లో స్కెచ్‌ నైపుణ్యాలు

మనం ఇచ్చే వివరణల ద్వారా అసలు ఇమేజ్‌లను సృష్టించే ప్లేగ్రౌండ్‌ మరిన్ని నైపుణ్యాలను సంతరించు కుంది. కొత్తగా స్కెచ్‌ శైలి ఫీచర్‌తో అలరిస్తోంది. యానిమేషన్, ఇలస్ట్రేషన్‌ ఫీచర్లకు ఇది అదనం. ఇమేజ్‌ను సృష్టించటానికి ముందు గానీ తర్వాత గానీ స్కెచ్‌ స్టైల్‌ను ఎంచుకుంటే అప్‌డేటెడ్‌ శైలిలో అవుట్‌పుట్‌ వస్తుంది. కొత్త ఐఓఎస్‌ 18.4, ఐప్యాడ్‌ ఓఎస్‌ 18.4, మ్యాక్‌ఓఎస్‌ సీకోయా 15.4 బీటా వర్షన్‌గల అన్ని ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్‌లకూ ఇమేజ్‌ ప్లేగ్రౌండ్‌ అందుబాటులో ఉంటుంది. 

నోటిఫికేషన్స్‌ ప్రాధాన్య క్రమం

యాపిల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత ప్రయారిటైజ్‌ నోటిఫికేషన్స్‌ ఫీచర్‌ ఉపయోగం గురించి యూజర్లకు తెలియంది కాదు. ఇది ముఖ్యమైన నోటిఫికేషన్లను గుర్తించి, వాటిని ఇతర నోటిఫికేషన్ల కన్నా పైన ప్రత్యేక విభాగంలో చూపిస్తుంది. అయితే ఐఓఎస్‌ 18.4 డెవలపర్‌ బీటా వర్షన్‌ అప్‌డేట్‌లో ఇది డిఫాల్ట్‌గా ఆఫ్‌ అయ్యింటుంది. సెటింగ్స్‌ మెనూలోని నోటిఫికేషన్స్‌ ద్వారా ఎనేబుల్‌ చేసుకోవాలి. ఇది కాలంతో సంబంధం లేకుండా అతి ముఖ్యమైన అలర్ట్స్‌ను అన్నింటికన్నా పైన చూపిస్తుంది. 

యాంబియెంట్‌ మ్యూజిక్‌ సదుపాయం

సంగీత ప్రియులకు నచ్చే మరో కొత్త సదుపాయం యాంబియెంట్‌ మ్యూజిక్‌. దీన్ని కంట్రోల్‌ సెంటర్‌కూ యాడ్‌ చేసుకోవచ్చు. ఇందులో చిల్, ప్రొడక్టివిటీ, స్లీప్, వెల్‌బీయింగ్‌ అనే ఆప్షన్లనూ జత చేశారు. యాంబియెంట్‌ మ్యూజిక్‌ సదుపాయం డిఫాల్ట్‌గా యాపిల్‌ మ్యూజిక్‌ ప్లేలిస్టునే తీసుకుంటుంది. కానీ మీ మ్యూజిక్‌ లైబ్రరీకి కూడా కస్టమైజ్‌ చేసుకోవచ్చు. 

ఐప్యాడ్, మ్యాక్‌కు కొత్త మెయిల్‌ యాప్‌

ఐప్యాడ్, మ్యాక్‌కు సరికొత్త మెయిల్‌ యాప్‌ను విస్తరించారు. ఇది మెయిళ్లను తనకు తానే ప్రమోషన్స్, ప్రైమరీ, ట్రాన్సాక్షన్స్, అప్‌డేట్స్‌ విభాగాలుగా విభజిస్తుంది. ప్రమోషన్స్‌లో మార్కెటింగ్‌ మెయిల్స్, కూపన్లు.. ప్రైమరీలో పర్సనల్, సత్వరం స్పందించాల్సిన మెయిళ్లు.. ట్రాన్సాక్షన్స్‌లో కన్ఫర్మేషన్స్, రిసిప్ట్స్‌.. అప్‌డేట్స్‌లో వార్తలు, సోషల్‌ మీడియా నోటిఫికేషన్లు, న్యూస్‌లెటర్లు, డాక్టర్‌ అపాయింట్‌మెంట్స్, సబ్‌స్క్రిప్షన్‌ మెయిళ్ల వంటివి కనిపిస్తాయి.  

ముఖ్యమైన డాట్‌

చిన్నదే అయినా గోప్యతను సూచించే చుక్క గుర్తు బాగా ఉపయోగపడుతుంది. ఇది కెమెరా లేదా మైక్రోఫోన్‌ వాడకంలో ఉన్నప్పుడు ఐఫోన్‌ మెనూ బార్‌లో ప్రత్యక్షమవుతుంది. ఇప్పుడిది నలుపు బ్యాక్‌గ్రౌండ్‌తో కూడి ఉంటోంది. అందువల్ల మరింత కొట్టొచ్చినట్టుగానూ కనిపిస్తుంది. 

జెన్‌మోజీ బటన్‌ పెద్దగా

ఎమోజీ కీబోర్డులో జెన్‌మోజీ బటన్‌ పెద్దగా అయ్యింది. ఈ ఫీచర్‌ను తొలిసారి వాడేవారికి ఒక కొత్త పాపప్‌ కూడా ప్రత్యక్షమవుతుంది. మెసేజ్‌కు యాడ్‌ చేయటానికి లేదా స్టికర్‌గా వాడుకోవటానికి మీ ఒరిజినల్‌ ఎమోజీని సృష్టించుకోండి అని చెబుతుంది. 

ఏజ్‌ రేంజ్‌

కొత్త ఐఫోన్‌ను ఐఓఎస్‌ 18.4తో సెట్‌ చేసుకునేవారు ఇకపై ఏ వయసువారో నిర్ణయించుకోవచ్చు. ఇది పిల్లలు భద్రంగా ఉండటానికి తోడ్పడే పేరెంటల్‌ కంట్రోల్స్‌ సెట్‌ చేసుకోవటానికి తోడ్పడుతుంది.

మరికొన్ని ఫీచర్లు

  • కంట్రోల్‌ సెంటర్‌కు కొత్త డిజైన్లు తోడయ్యాయి. ఫోకస్‌ మోడ్స్‌ మార్చుకోవటానికి కొత్త పికర్, వాల్యూమ్‌ను సరిచేసునేటప్పుడు కొత్త యానిమేషన్, సెల్యులర్‌ డేటా బటన్‌కు కొత్త డిజైన్‌ వంటివి వీటిల్లో కొన్ని. 
  • సెటింగ్స్‌లోనూ కెమెరా కంట్రోల్‌ ఇంటర్ఫేస్‌లో కెమెరా యాప్‌ భాగానికి ప్రత్యేక మెనూ వచ్చి చేరింది. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని