BRS: కేసీఆర్‌పై నిందారోపణలకు నిరసనగా వాకౌట్‌ చేశాం

Eenadu icon
By Telangana News Desk Updated : 19 Jun 2025 06:13 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

అఖిలపక్ష సమావేశంలో సీఎం రాజకీయ ప్రసంగం సరికాదు
భారాస ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

ఈనాడు, హైదరాబాద్‌: పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై భారాస సలహాలు, సూచనలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన నిందారోపణలకు నిరసనగా అఖిలపక్ష సమావేశం నుంచి వాకౌట్‌ చేసినట్లు భారాస ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. బుధవారం సచివాలయం మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడారు. ‘సీఎం రేవంత్‌రెడ్డి తన ప్రసంగంలో భాజపాను ఏమీ అనకుండా కేసీఆర్‌ను బద్నాం చేయాలని చూశారు. గతంలో జరిగిన ఎపెక్స్‌ సమావేశాల గురించి వక్రీకరించి మాట్లాడారు. ప్రతి సందర్భంలోనూ కేసీఆర్‌ను విమర్శించే ధోరణిలోనే ఉన్నారు. ప్రజల ప్రయోజనాల కోసం భారాస మాట్లాడగా... గాంధీభవన్‌లో మాట్లాడినట్లు రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రసంగం చేయడం సరికాదు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఏదైనా ఒక రాష్ట్రం కొత్త ప్రాజెక్టును నిర్మించాలనుకుంటే ఎపెక్స్‌ కౌన్సిల్‌లో దాని వివరాలు చర్చించి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఏపీ ప్రభుత్వం ఎపెక్స్‌ కౌన్సిల్‌లో చర్చించకుండానే పోలవరం, బనకచర్ల వంటి ప్రాజెక్టుల విషయంలో దూకుడుగా వ్యవహరిస్తోంది. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ టీవోఆర్‌ జారీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈఏసీ ఎజెండాలోనూ ఉంచింది. ప్రీ ఫీజిబిలిటీ నివేదికను కేంద్ర జలశక్తిశాఖ ఆమోదించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడానికి ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితినీ సడలించడానికి కేంద్రం సిద్ధమైంది. వెంటనే ఎపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర జలశక్తి శాఖకు సీఎం లేఖ రాయాలి. అఖిలపక్షాన్ని దిల్లీకి తీసుకెళ్లాలి. ప్రత్యేక శాసనసభ సమావేశం ఏర్పాటు చేసి... బనకచర్ల ప్రాజెక్టు నిలిపివేయాలని ఏకవాక్య తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలి’ అని వద్దిరాజు డిమాండ్‌ చేశారు.


కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం

-భాజపా ఎంపీ డీకే అరుణ

అఖిలపక్ష సమావేశంలో ప్రస్తావనకు వచ్చిన అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. ఈ సమావేశంలో చేసిన ప్రజంటేషన్‌ వివరాలను కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌కు సమర్పిస్తామని చెప్పారు. అఖిలపక్ష సమావేశం తర్వాత మరో భాజపా ఎంపీ రఘునందన్‌రావుతో కలిసి సచివాలయం మీడియా పాయింట్‌ వద్ద ఆమె మాట్లాడారు. ‘రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు.. భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సూచనతో అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యాం. రాష్ట్ర రైతాంగం, ప్రజల కోసం హాజరయ్యాం. బనకచర్ల ప్రాజెక్టు ద్వారా రాష్ట్ర ప్రజలకు ఏమాత్రం అన్యాయం జరిగినా సహించబోమని చెప్పాం. ఈ ప్రాజెక్టుపై సీఆర్‌ పాటిల్‌కు కిషన్‌రెడ్డి సమాచారం అందించారు. ‘గోదావరి జలాల్లో తెలంగాణ వాటా కేటాయింపుల్లో ఎంతమేర వాడుకున్నారు? గోదావరిపై పూర్తికావాల్సిన ప్రాజెక్టులెన్ని? వాటిని ఎందుకు పూర్తి చేయలేకపోయారు? ఈ ప్రాజెక్టులకు పూర్తిస్థాయి అనుమతులు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వపరంగా మీవంతు ప్రయత్నం ఎందుకు చేయలేదు’ తదితర వివరాలను సమావేశంలో అడిగాం’ అని డీకే అరుణ పేర్కొన్నారు. 

Tags :
Published : 19 Jun 2025 03:01 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు