CM Revanth Reddy: యూరియా కోటా పెంచండి

Eenadu icon
By Telangana News Desk Updated : 09 Jul 2025 06:40 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

కేంద్ర మంత్రి నడ్డాకు సీఎం రేవంత్‌రెడ్డి వినతి
జహీరాబాద్‌ పారిశ్రామిక స్మార్ట్‌ సిటీ అభివృద్ధికి చేయూతనివ్వాలని పీయూష్‌ గోయల్‌కు విజ్ఞప్తి
ఈనాడు - దిల్లీ

'కేంద్ర మంత్రి నడ్డాకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన దిల్లీ పర్యటనలో రెండో రోజు మంగళవారం ఇద్దరు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి యూరియా కోటా పెంచాలని ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ను కలిసి జహీరాబాద్‌ పారిశ్రామిక స్మార్ట్‌ సిటీ, వరంగల్‌ విమానాశ్రయానికి ఆర్థిక సాయం, హైదరాబాద్‌-విజయవాడల మధ్య నూతన పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధి, హైదరాబాద్‌-బెంగళూరు మధ్య తలపెట్టిన పారిశ్రామిక కారిడార్‌ను ఏరో-డిఫెన్స్‌ కారిడార్‌గా అభివృద్ధి చేయడంపై చర్చించారు. రాష్ట్రంలో ఎరువుల కొరత కారణంగా రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఆ సమస్య గురించి జేపీ నడ్డాకు ముఖ్యమంత్రి వివరించారు.

‘‘ప్రస్తుత వానాకాలం సీజన్‌కు సంబంధించి ఏప్రిల్‌-జూన్‌ నెలల మధ్య 5 లక్షల టన్నులు సరఫరా చేయాల్సి ఉండగా 3.07 లక్షల టన్నులు మాత్రమే సరఫరా చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ సమయంలో యూరియా అవసరం ఉన్నందువల్ల నిరాటంకంగా సరఫరా చేయాలి. జులై నెలకు సంబంధించి దేశీయంగా ఉత్పత్తి అయిన యూరియా     63 వేల టన్నులు, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న దాంట్లో    97 వేల టన్నులు సరఫరా చేయాల్సి ఉండగా.. ఇప్పటివరకు 29 వేల టన్నులు మాత్రమే అందించారు. రాష్ట్ర రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని దేశీయంగా ఉత్పత్తి అయ్యే యూరియా కోటా పెంచాలి. యూరియా సరఫరాకు తగ్గట్టు రైల్‌ రేక్‌లను పెంచాలి’’ అని కేంద్ర మంత్రికి రేవంత్‌రెడ్డి విన్నవించారు.


పీయూష్‌ గోయల్‌ ముందు నాలుగు డిమాండ్లు 

పీయూష్‌ గోయల్‌తో చర్చిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో మల్లు రవి, జితేందర్‌రెడ్డి

కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ముందు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాలుగు ప్రధాన డిమాండ్లు ఉంచారు. జహీరాబాద్‌ పారిశ్రామిక స్మార్ట్‌ సిటీ అభివృద్ధి; హైదరాబాద్‌-వరంగల్‌ పారిశ్రామిక కారిడార్‌లో అంతర్భాగమైన వరంగల్‌ విమానాశ్రయానికి ఆర్థిక సాయం; హైదరాబాద్‌-విజయవాడల మధ్య నూతన పారిశ్రామిక కారిడార్‌ ఏర్పాటుకు ఫీజిబిలిటీ స్టడీ; హైదరాబాద్‌-బెంగళూరు కారిడార్‌ను ఏరో-డిఫెన్స్‌ కారిడార్‌గా అభివృద్ధి చేయడం.. వీటిలో ఉన్నాయి. జహీరాబాద్‌ పారిశ్రామిక నగరాభివృద్ధికి జాతీయ పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధి, అమలు ట్రస్ట్‌ ఆమోదించిన రూ.596.61 కోట్లు వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రిని రేవంత్‌రెడ్డి కోరారు. ఈ స్మార్ట్‌ సిటీకి అవసరమైన విద్యుత్తు, నీటి సరఫరా, ఇతర మౌలిక వసతుల కల్పనకు ఆర్థిక సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. వరంగల్‌ విమానాశ్రయానికి కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందించాలని కోరారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలైన హైదరాబాద్‌-విజయవాడ మధ్య పారిశ్రామిక కారిడార్‌ నిర్మాణానికి ఉన్న సాధ్యాసాధ్యాలపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధ్యయనం మొదలుపెట్టామని, ఇందుకు కేంద్రం సహకారం అందించాలన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఆదిభట్లలో అత్యున్నత మౌలిక వసతులతో రక్షణ, ఏరోస్పేస్‌ పార్క్‌ ఏర్పాటు చేసిందని, ఈ నేపథ్యంలో హైదరాబాద్‌-బెంగళూరు కారిడార్‌ను ఏరో-డిఫెన్స్‌ కారిడార్‌గా అభివృద్ధి చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వంద ప్లగ్‌ అండ్‌ ప్లే పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయాలనుకుంటోందని, కేంద్రానికి త్వరలో ప్రతిపాదనలు సమర్పిస్తామని, వాటికి తమ వంతు చేయూత అందించాలని గోయల్‌కు విజ్ఞప్తి చేశారు. కేంద్ర రైల్వే, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను సీఎం కలవాలనుకున్నా కేంద్ర మంత్రి తండ్రి కన్నుమూయడంతో ఆ భేటీ సాధ్యం కాలేదు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో భేటీ కావాలని భావించినప్పటికీ ఆయనకున్న సమయాభావం వల్ల వీలుపడలేదు. నడ్డా, గోయల్‌లతో సమావేశాల్లో ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్‌రెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, కేంద్ర పథకాల సమన్వయ కార్యదర్శి గౌరవ్‌ ఉప్పల్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :
Published : 09 Jul 2025 03:29 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు