CM Revanth Reddy: ఆ కుటుంబంలో చిచ్చుపెట్టింది దోపిడీ సొమ్మే

Eenadu icon
By Telangana News Desk Published : 04 Sep 2025 05:52 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
5 min read

పంపకాల్లో తేడాలొచ్చే గొడవలు
మీ పంచాయితీలోకి మమ్మల్ని లాగకండి
మాకు సంక్షేమ పథకాలు అమలుచేసే పని ఉంది
కేసీఆర్‌ కుటుంబాన్ని ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు
భద్రాద్రి జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ముఖ్యమంత్రి 

ఈనాడు, ఖమ్మం; ఈనాడు డిజిటల్, కొత్తగూడెం; న్యూస్‌టుడే, చంద్రుగొండ, అన్నపురెడ్డిపల్లి: ‘నూట పది నెలలు అధికారంలో ఉండి.. నెలకు రూ.1,000 కోట్లకు తగ్గకుండా రూ.లక్ష కోట్లకు పైగా దోచుకున్నారు. పంపకాల్లో తేడాలు రావటంతో ఆయన పిల్లలు కత్తులతో పొడుచుకునే పరిస్థితికి వచ్చారు. ఏం సంతోషమయ్యా.. ఆ తండ్రికి? ఇల్లు, ఫాంహౌస్, వ్యాపారం.. ఇలా అన్నీ ఇచ్చినా పిల్లలకు ప్రశాంతత, ఆనందం ఇవ్వగలిగారా? దోపిడీ సొమ్ము ఇవాళ ఆ కుటుంబంలో చిచ్చుపెట్టింది. వారు కొట్లాడుకొంటూ... వారి వెనకాల మేమున్నామని అంటున్నారు’ అని పరోక్షంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, ఆయన కుటుంబాన్ని ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పంపకాల్లో పంచాయితీ వస్తే కుటుంబ పెద్ద లేదా కులపెద్ద దగ్గరికి వెళ్లాలి. మీ కుటుంబ పంచాయితీలోకి మమ్మల్ని లాగకండి. భారత రాష్ట్ర సమితి అనే పాములో కాలకూట విషముంది. తమను దోచుకునే అనకొండ అని 2023 డిసెంబరులోనే ఆ కాలనాగును ప్రజలు కట్టెతో కొట్టి చంపారు. చచ్చిన పామును కొట్టాల్సిన అవసరం మాకు లేదు. మాకు సంక్షేమ పథకాలు అమలుచేసే పని ఉంది’’ అని అన్నారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండాలపాడులో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. అనంతరం అదే మండలం దామరచర్లలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. కాంగ్రెస్‌ చేపడుతున్న పథకాలను చెబుతూ భారత రాష్ట్ర సమితి పదేళ్ల పాలనలోని వైఫల్యాలను ఎండగట్టారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. 

బెండాలపాడులోని బచ్చలి నర్సమ్మ ఇందిరమ్మ గృహంలో ఆమె మనుమరాలికి పాయసం తినిపిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యేలు జారె ఆదినారాయణ, మాలోత్‌ రాందాస్‌నాయక్‌

ఆత్మగౌరవ పండగ

బెండాలపాడులో ఇళ్ల లబ్ధిదారుల కళ్లల్లో ఆనందం చూశానని, ఇది వారు నిర్వహించుకొనే పండగ మాత్రమే కాదని.. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవ పండగ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ‘‘భారత రాష్ట్ర సమితి పాలనలో రెండు పడక గదుల ఇల్లు వస్తుందేమో.. బంధువులు, ఇతరుల ముందు గౌరవంగా బతకవచ్చని పేదలు ఎదురుచూసినా ఫలితం లేకపోయింది. ఇందిరమ్మ ఇళ్ల పథకంతో వారి కల సాకారమైంది. పేదలు ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. పేదలకు ఇళ్లు ఇచ్చి వారి ఆత్మగౌరవం నిలబెట్టిన పార్టీ కాంగ్రెస్‌.

పొంగులేటి సమర్థ మంత్రి

తనకు ఫలానా శాఖ కావాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అడగలేదు. కొరివి దెయ్యాలను పాతరేయాలంటే ‘భూభారతి’ తేవాలని, అలాగే పేదలకు ఇళ్లు కట్టించాలని, అందుకు రైతు బిడ్డ ఉండాలని నిర్ణయించుకొని దిల్లీలో అధిష్ఠానాన్ని ఒప్పించి రోజుకు 18 గంటలు పనిచేసే పొంగులేటికి రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల బాధ్యతలను అప్పగించాం. కేసీఆర్‌ సంగతి చూడటానికి నాకు సమయం ఉండాలని, సమర్థుడైన శ్రీనన్నకు ముఖ్య శాఖలు ఇచ్చాం. అంచనా తప్పలేదు. 20 నెలల్లోనే పేదలకు న్యాయం చేశారు. ‘భూభారతి’ ద్వారా రైతుల సమస్యలు పరిష్కరించారు. 4.50 లక్షల మంది పేదలకు ఎలాంటి తప్పుల్లేకుండా గృహాలు ఇస్తున్నాం.  వీటిలో 2,05,297 గృహాల నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. రాబోయే పదేళ్లలో అర్హులందరికీ సొంతిళ్లు నిర్మిస్తాం. మొత్తం 25,35,964 మంది రైతులకు రూ.25,617 కోట్ల రుణాలు మాఫీ చేశాం. ఇవన్నీ ఇందిరమ్మ రాజ్యంతో సాధ్యమయ్యాయి.

దామరచర్ల బహిరంగ సభలో అభివాదం చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. చిత్రంలో నీటిపారుదల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ మువ్వా విజయబాబు, రాందాస్‌నాయక్, జారె ఆదినారాయణ, బలరాంనాయక్, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, మట్టా రాగమయి

చదువు ఒక్కటే మార్గం

పేదలు బాగుపడాలంటే చదువు ఒక్కటే మార్గం. అందుకే ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌ పెడుతున్నాం. రూ.20 వేల కోట్లను పాఠశాలల నిర్మాణానికి వెచ్చిస్తున్నాం. వీటిల్లో చేరే వారిని ప్రపంచంలో ఎక్కడైనా ఉద్యోగాలు సాధించేలా తీర్చిదిద్దుతాం. పేదలు పరిపాలన బాధ్యతలు చేపట్టాలి. వైద్యులు, ఇతర ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడాలి. పది మందికి సాయం చేసే స్థితికి ఎదగాలి. అందుకు ఇందిరమ్మ ప్రభుత్వం కృషి చేస్తుంది’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.

సొంతిళ్లు ఎలా ఉన్నాయ్‌...

బెండాలపాడులో గృహప్రవేశం పూర్తి చేసుకున్న లబ్ధిదారులు బచ్చలి రమణ, బచ్చలి నర్సమ్మ కుటుంబాలకు సీఎం రేవంత్‌ నూతన వస్త్రాలు అందజేశారు. సొంతిళ్లు ఎలా ఉన్నాయని అడిగారు. పూరిగుడిసెల్లో నివసించే తమకు.. ఇందిరమ్మ ఇళ్లు కేటాయించి ముఖ్యమంత్రి మా గృహప్రవేశానికి రావటం ఆనందంగా ఉందని లబ్ధిదారులు బదులిచ్చారు. సీఎంకు పాయసం అందించారు. రమణ ఇంటి ఆవరణలో సీఎం కొబ్బరి మొక్క నాటారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల పైలాన్‌ను ఆవిష్కరించారు.

హాజరైన ప్రజలు


మాది చేతల ప్రభుత్వం: పొంగులేటి

గత ప్రభుత్వం పేదలను పురుగుల మాదిరి చూస్తే తాము పేదలకు భరోసా కల్పించటానికే ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామని రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గత ప్రభుత్వం పేదలకు ఏమైనా చేస్తే కమీషన్‌ ఎంత వస్తుంది అని ఆలోచించిందని, ప్రస్తుత ప్రజా ప్రభుత్వం ఆర్థిక సమస్యలున్నా, తలతాకట్టుపెట్టి ఒక్కొక్క కార్యక్రమం అమలుచేస్తోందని చెప్పారు. తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల సర్కారు అని, అందుకే ప్రతి సోమవారం బిల్లులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. సన్నరకం ధాన్యం పండించిన  రైతులందరికీ మొదటి విడత బోనస్‌ ఇచ్చామని, రెండో విడత త్వరలో చెల్లిస్తామని స్పష్టం చేశారు. గత పాలకులు పదేళ్లలో రేషన్‌ కార్డులు ఇవ్వలేదని, తాము 7లక్షల కార్డులు ఇచ్చామని, 15లక్షల మంది పేర్లు కార్డుల్లో చేర్చామని వివరించారు. గత మఖ్యమంత్రి కేసీఆర్‌ వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకొని, ఇళ్లు, రహదారులు నిర్మిస్తామని హామీ ఇచ్చి విస్మరించారని దుయ్యబట్టారు. అదే గ్రామంలో ఇందిరమ్మ ప్రభుత్వం 119 ఇళ్లు మంజూరు చేసిందని, వాటిని 15 రోజుల్లో పూర్తి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీలు రామసహాయం రఘురాంరెడ్డి, పోరిక బలరాంనాయక్, ఎమ్మెల్యేలు జారె ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య, కూనంనేని సాంబశివరావు, మాలోత్‌ రాందాస్‌నాయక్, మట్టా రాగమయి పాల్గొన్నారు.


హరీశ్‌రావు, సంతోష్‌ వెనక రేవంత్‌రెడ్డి ఉన్నారని ఒకరంటే.. లేదు లేదు కల్వకుంట్ల కవిత వెనక ఉన్నారని మరొకరంటున్నారు. నేను ఎవరి వెనకా లేను. నేను నాయకుణ్ని. ఉంటే ముందుంటా. నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలకు తోడుంటా.

మహబూబ్‌నగర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు