CM Revanth Reddy: అందరినీ ఆదుకుంటాం
కొడంగల్ ఎంతో కామారెడ్డీ అంతే...
వరద బాధితుల కష్టాలు తెలుసుకోవడానికే వచ్చా
వేల మంది ఒకేసారి వస్తుండటంతోనే యూరియా సమస్య...
ఇసుక మేటల తొలగింపునకూ నిధులిస్తాం
కామారెడ్డి జిల్లా పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి 

కామారెడ్డిలోని జీఆర్ కాలనీలో వరద బాధితులతో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో మంత్రి పొంగులేటి, షబ్బీర్ అలీ తదితరులు
వందేళ్లలో ఇంత వర్షం ఎప్పుడూ పడలేదు. వరదల విషయం తెలియగానే మంత్రులతో చర్చించి కామారెడ్డికి రావాలని ప్రయత్నించాను. వాతావరణ పరిస్థితులు అనుకూలించలేదు. మెదక్ వెళ్లి... అక్కడి నుంచే కామారెడ్డి కలెక్టర్‌తో మాట్లాడాను. వర్షాలు, వరదలతో సంభవించిన నష్టానికి తాత్కాలిక మరమ్మతులు సరిపోవు. అందుకే ప్రత్యక్షంగా చూడటానికి వచ్చాను. పొలాల్లోని ఇసుక మేటలను తొలగించేందుకు కూడా ప్రత్యేకంగా నిధులిచ్చి వ్యవసాయ యోగ్యంగా చేసుకునేలా సహకరిస్తాం.
-సీఎం రేవంత్‌రెడ్డి

మృతుల కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల ఆర్థికసాయం అందిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి.
చిత్రంలో సురేశ్ షెట్కార్, లక్ష్మీకాంతరావు, షబ్బీర్ అలీ, సీతక్క, మదన్‌మోహన్‌రావు తదితరులు
ఈనాడు డిజిటల్, కామారెడ్డి- ఈనాడు, నిజామాబాద్: ‘‘కొడంగల్ నియోజకవర్గానికి ఏ సాయం చేస్తానో... కామారెడ్డికీ అదే చేస్తానని గతంలోనే చెప్పా. కామారెడ్డికి సాయం అందించడానికి ఎప్పుడూ ముందుంటాను. మీ కష్టాల్లో అండగా నిలబడతాను. అందుకే మిమ్మల్ని నేరుగా కలవడానికి వచ్చా. ఆడబిడ్డల సమస్యలు తెలుసుకున్నా. వాటన్నింటినీ పరిష్కరించి... ప్రభుత్వం అండగా ఉంటుంది. ధైర్యంగా ఉండండి’’ అని వరద బాధితులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇటీవలి భారీ వర్షాలతో అతలాకుతలమైన కామారెడ్డి జిల్లాలో సీఎం గురువారం పర్యటించారు.
దెబ్బతిన్న వంతెన పరిశీలన... రైతులకు పరామర్శ
సీఎం రేవంత్‌రెడ్డి తొలుత కామారెడ్డి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలను హెలికాప్టర్‌లో పరిశీలించారు. అనంతరం తాడ్వాయి మండలం ఎర్రపహాడ్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి కాన్వాయ్‌లో లింగంపేట మండలం లింగంపల్లి కుర్దుకు వెళ్లి... వరదలకు దెబ్బతిన్న ఆర్ అండ్ బీ వంతెనను పరిశీలించారు. అక్కడ వరద నష్టాలపై ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను చూశారు. అదే మండలం బురిగిద్ద గ్రామంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. అక్కడ పొలాల్లో ఇసుక మేటలు వేసిన రైతులతో మాట్లాడారు. నష్టం వివరాలు కనుక్కున్నారు. ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. అక్కడి నుంచి కామారెడ్డికి చేరుకుని... జీఆర్ కాలనీలో పర్యటించారు. ఇళ్లు నీటమునిగిన బాధితులతో మాట్లాడారు. వరదల ధాటికి పూరి గుడిసెలనూ కోల్పోయిన బాధితులకు గృహనిర్మాణ పథకం కింద ఇళ్లు ఇప్పిద్దామని, ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు తక్షణమే రూ.5 లక్షలు ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. భవిష్యత్తులో పునరావృతం కాకుండా వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలిపారు. అనంతరం కామారెడ్డి కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయా సందర్భాల్లో సీఎం మాట్లాడారు.

కామారెడ్డిలో జీఆర్ కాలనీ, హౌసింగ్‌బోర్డు కాలనీల మధ్య ఇటీవలి వర్షాలకు ఉద్ధృతంగా ప్రవహించిన కాలువను పరిశీలిస్తున్న
సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో  మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్
శాశ్వత పరిష్కారం అవసరం
భారీ వర్షాలతో పేదలు, రైతులు, విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు. తాత్కాలికంగా మీ సమస్యల పరిష్కారానికి కలెక్టర్లకు ఆదేశాలిచ్చా. ప్రజాప్రతినిధులే కాకుండా.. అధికారులు కూడా పరస్పరం సహకరించుకోవడంతో చాలా ప్రాణనష్టం తగ్గింది. ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బంది సహకారంతో చాలామంది ప్రాణాలను కాపాడగలిగాం. జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్, ఎస్పీ రాజేశ్‌చంద్రతో పాటు అధికారులంతా సహకరించారు. అందుకే ప్రాణ, ఆస్తి, పశుసంపద నష్టం చాలా తక్కువగా జరిగింది. ఆ సమయంలో 24 గంటలూ పనిచేసిన అధికారులందరినీ అభినందిస్తున్నా. వరదలు ఉద్ధృతం కావడంతో మంత్రి సీతక్క, ఎంపీ సురేశ్ షెట్కార్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి ఫోన్ చేసి ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించా.
టోకెన్లు ఇస్తే.. యూరియా సమస్య ఉండేది కాదు
యూరియా దుకాణాలకు వేల మంది ఒకేసారి వస్తే సమస్యగా మారుతుంది. రైతువేదికల వద్ద ఇద్దరేసి పోలీసులను నియమించి రైతులకు ముందే టోకెన్లు ఇచ్చి.. ఒక్కొక్కరిని ఒక్కో రోజు రమ్మంటే ఏ సమస్యా ఉండదు. అంతా ఒకేసారి వచ్చి ఒకే దగ్గర నిలబడితే వరుస పెద్దగా కనిపిస్తుంది. యూరియా అందుబాటులో ఉన్నా.. వెయ్యి మంది వరుసలో ఉంటే చివరి వ్యక్తికి అందేసరికి 8 గంటలకు పైగా పడుతుంది. అంతసేపు నిలబడలేక, సహనం నశించి... యూరియా అందుబాటులో లేదని కొన్నిసార్లు రోడ్డుకు అడ్డంగా కూర్చుంటారు. పాలేరు నియోజకవర్గంలో ఎక్కడికక్కడ పూర్తిగా పీఏసీఎస్‌ల ద్వారా ఒక క్రమపద్ధతిలో యూరియా పంపిణీ చేస్తుండడం సత్ఫలితాలనిస్తోంది. మిగిలిన చోట్ల కూడా ఇలాంటి విధానాన్ని అమలు చేస్తే సమస్యను పరిష్కరించవచ్చు.
మళ్లీ 15 రోజుల్లో సమీక్ష
సమస్య వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా, మానవత్వంతో వ్యవహరించాలి. అధికారులైనా, ప్రజాప్రతినిధులైనా ప్రజల అవసరాలు, సమస్యలు పరిష్కరించడానికే ఉన్నాం. విపత్తు నిర్వహణలో కామారెడ్డి జిల్లా నమూనాగా నిలవాలి. కామారెడ్డి కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను పకడ్బందీగా అమలు చేస్తే ఇదే విధానాన్ని ఇతర జిల్లాల్లో ఆచరించడానికి అవకాశం ఉంటుంది. మళ్లీ 15 రోజుల తర్వాత సమీక్ష చేస్తా. కేవలం కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల వారితోనే కాకుండా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలతో సమస్యలపై సమీక్ష నిర్వహించాలని మంత్రి సీతక్కకు సూచిస్తున్నా. కలెక్టర్లు, ఎమ్మెల్యేలు... మీ సమస్యలన్నీ సీతక్కకు చెప్పండి. రాబోయే 10 రోజుల్లో ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలందరితో హైదరాబాద్‌లో సమీక్ష నిర్వహించుకుందాం. దానికి ఎంపీలు సురేశ్ షెట్కార్, ధర్మపురి అర్వింద్‌లనూ ఆహ్వానించండి. అధికారులంతా ప్రతిపాదనలతో రావాలి. వరదలతో జరిగిన నష్టం, ఏమేం మరమ్మతులు చేయాలి, ఎంత నిధులు మంజూరు చేయాలో వివరాలిస్తే వాటన్నింటిపై సానుకూలంగా స్పందించి వేగంగా నిధులు విడుదల చేస్తాం.
తాత్కాలికంగా కాకుండా.. శాశ్వత ప్రాతిపదికన ప్రణాళికాబద్ధంగా ముందుకు రావాలి. విపత్తుల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచే బిల్లులన్నీ రాబట్టుకోవాలని అధికారులు యత్నిస్తున్నారు. ఇకనుంచి అలా కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టుకునే ప్రయత్నం చేద్దాం. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి భాజపాకు చెందినవారైనా... సహకారం అందించడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు’’ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ‘పోచారం ప్రాజెక్టును వందేళ్ల క్రితం రూ.20 లక్షలతో కట్టారు. ఇంత వరద వచ్చినా తెగకుండా గట్టిగా ఉంది. ఇంతకుమించి నేనేం చెప్పలేను’ అని పరోక్షంగా కాళేశ్వరం ప్రాజెక్టును ఉద్దేశించి ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. చెరువులు, కుంటలు, రోడ్లకు మరమ్మతులు చేయిస్తామన్నారు. ఆయా కార్యక్రమాల్లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యేలు మదన్‌మోహన్‌రావు, తోట లక్ష్మీకాంతరావు, సుదర్శన్‌రెడ్డి, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, భూపతిరెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్‌అలీ, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్, ఎస్పీ రాజేశ్‌చంద్ర పాల్గొన్నారు. వరదల కారణంగా చనిపోయినవారి కుటుంబ సభ్యులకు కామారెడ్డి కలెక్టరేట్‌లో రూ.5 లక్షల చొప్పున ఆర్థికసాయం చెక్కులను సీఎం రేవంత్‌రెడ్డి అందజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

చిన్నారితో అసభ్య ప్రవర్తన.. హైదరాబాద్‌లో డ్యాన్స్ మాస్టర్ అరెస్టు
 - 
                        
                            

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
 - 
                        
                            

బిహార్ అసెంబ్లీ పోరు.. ముగిసిన తొలిదశ ప్రచారం
 - 
                        
                            

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
 - 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 - 
                        
                            

ఛత్తీస్‌గఢ్‌లో రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
 


