TG High Court: ఎన్నికల్లో పోటీ ప్రాథమిక హక్కు కాదు

Eenadu icon
By Telangana News Desk Published : 31 Oct 2025 04:14 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు పిల్లల నిబంధనపై పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడమన్నది ప్రాథమిక హక్కు కాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఇదేమీ ప్రాథమిక హక్కుల పరిధిలోకి రాదని.. వృత్తి, వ్యాపారం, ఉద్యోగాల నిర్వహణకు చెందిన ప్రాథమిక హక్కుకు ఉల్లంఘన కాదని సుప్రీంకోర్టు.. జావెద్‌ వర్సెస్‌ హరియాణా కేసులో స్పష్టం చేసిందని పేర్కొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థికి ఇద్దరు కంటే ఎక్కువమంది పిల్లలు ఉండకూడదన్న తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టంలోని సెక్షన్‌ 21(3)ని కొట్టివేయాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా కంది మండలానికి చెందిన ఉప్పు వీరన్న, మరొకరు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్, జస్టిస్‌ జి.ఎం.మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ రాజ్యాంగ విరుద్ధమైన ఈ నిబంధనను కొట్టివేయాలని కోరారు. ఈ నిబంధనను సవరిస్తూ ప్రభుత్వం గెజిట్‌ జారీ చేసిందని, దీనికి గవర్నర్‌ ఆమోదం లభించలేదన్నారు. వాదనలను విన్న ధర్మాసనం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడం అన్నది ప్రాథమిక హక్కు కాదని, ప్రభుత్వం పంచాయతీరాజ్‌ చట్టానికి తీసుకువచ్చిన సవరణను గవర్నర్‌ ఆమోదించలేదంది. అందువల్ల ఈ పిటిషన్‌లో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమంటూ కొట్టివేసింది.

‘జూబ్లీహిల్స్‌ నామినేషన్‌ తిరస్కరణలో జోక్యం చేసుకోలేం’

ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో తిరస్కరణకు గురైన నామినేషన్‌ను స్వీకరించాలంటూ ఆదేశాలు జారీ చేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. నామినేషన్‌పై అభ్యంతరాలుంటే ఎన్నిక పిటిషన్‌ దాఖలు చేసుకోవచ్చంది. నామినేషన్‌ను తిరస్కరించడాన్ని సవాల్‌ చేస్తూ సంగారెడ్డికి చెందిన ఎం.సంజీవులు దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్, జస్టిస్‌ జి.ఎం.మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. నామినేషన్‌ను తిరస్కరిస్తూ ఎన్నికల అధికారి జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను రద్దు చేయాలన్న పిటిషనర్‌ అభ్యర్థనను తిరస్కరిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు