Minister Uttam: సన్నబియ్యం పంపిణీ.. తెలంగాణలోనే ప్రథమం
84 శాతం మంది పేదలకు లబ్ధి
త్వరలో ఉప్పు, పప్పు, చింతపండు కూడా
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

హుజూర్‌నగర్‌లో సీఎం రేవంత్ సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
ఈనాడు, హైదరాబాద్: దేశంలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ... చరిత్రలో నిలవబోతోందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో దాదాపు 84 శాతం మంది పేదలకు ఉచితంగా సన్నబియ్యం అందించబోతున్నామని చెప్పారు. ఉగాది రోజున ఆదివారం హుజూర్‌నగర్ వేదికగా ఈ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి అర్హులందరికీ రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా మరో 30 లక్షల మందిని రేషన్‌కు అర్హులుగా గుర్తించబోతున్నట్లు వెల్లడించారు. శుక్రవారం ఆయన హుజూర్‌నగర్‌లో సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించి వచ్చి సచివాలయంలో సాయంత్రం విలేకరులతో మాట్లాడారు. పేదలకు త్వరలో ఉప్పు, పప్పు, చింతపండు వంటి సరకుల్ని కూడా రేషన్‌దుకాణాల ద్వారా అందిస్తామని, క్రమక్రమంగా సరకుల సంఖ్య పెంచుతామని మంత్రి వెల్లడించారు. ‘‘దొడ్డుబియ్యం స్థానంలో సన్నబియ్యం పంపిణీ వల్ల రాష్ట్రంపై రూ.2,800 కోట్ల అదనపు భారం పడనుంది. ఆ భారాన్ని భరించాలని కేంద్రాన్ని కోరా. ప్రతి లబ్ధిదారుకు 6 కిలోల బియ్యం ఇస్తాం. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు. అధికారుల వద్ద ఉన్న జాబితాలో పేరుంటే కార్డులేకపోయినా రేషన్ తీసుకోవచ్చు. నా సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఇంత మంచి సంక్షేమ పథకాన్ని చూడలేదు.
ప్రధాని ఫొటో గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదు
అందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం. బీపీఎల్ కుటుంబాల వారికి ఇచ్చేది మూడు రంగులతో, ఏపీఎల్ కుటుంబాలకు ఇచ్చేది ఆకుపచ్చ రంగుతో ఉంటుంది. వాటిపై క్యూఆర్ కోడ్ ఉంటుంది. చిప్ ఉండదు. కొత్తవి ప్రింటింగ్‌కు ఇచ్చాం. రేషన్‌కార్డుపై ప్రధాని ఫొటో గురించి ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కొత్తగా జారీచేసే వాటితో కలిపి రాష్ట్రంలో రేషన్‌కార్డుల సంఖ్య కోటికి, లబ్ధిదారులు 3.10 కోట్ల మంది అవుతారని అంచనా వేస్తున్నాం.
భారాస నికరంగా ఇచ్చిన కార్డులు 49 వేలే
సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన రూ.500 బోనస్‌తో కొనుగోలు చేసిన సన్నధాన్యాన్ని మిల్లింగ్ చేయించి రేషన్ కార్డుదారులకు ఇవ్వబోతున్నాం. 2014 నాటికి రాష్ట్రంలో కార్డుల సంఖ్య 89,73,708. భారాస ప్రభుత్వం పదేళ్లకాలంలో తీసేసిన, ఇచ్చిన కార్డులను లెక్కేస్తే నికరంగా ఇచ్చినవి 49,479. కుటుంబ సభ్యుల పేర్లు చేర్చేందుకు గత ప్రభుత్వ హయాంలో వచ్చిన దరఖాస్తులనూ మేం పరిష్కరిస్తున్నాం. సన్న బియ్యాన్ని రాష్ట్ర అవసరాలకే వాడతాం. ఎఫ్‌సీఐకి ఇవ్వం. దొడ్డు బియ్యం మాత్రమే ఇస్తాం’’ అని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వివరించారు. సమావేశంలో పౌరసరఫరాలశాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్, డైరెక్టర్ ప్రసాద్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
దేవాదుల పంపు ప్రారంభం.. ఎనలేని సంతోషాన్ని ఇచ్చింది
‘ఎక్స్’లో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్
ఈనాడు, హైదరాబాద్: దేవాదుల ఎత్తిపోతల్లోని మూడో పంపుహౌస్‌లో మొదటి పంపు ప్రారంభించడం ఎనలేని సంతోషాన్ని ఇచ్చిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. ‘గురువారం పంపును ప్రారంభించే కార్యక్రమంలో చిన్న పాత్రే పోషించినప్పటికీ.. పంపుహౌస్ ద్వారా అదనంగా నీటిని అందించడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో నీటి కోసం ఎదురుచూస్తున్న రైతుల పంటలను కాపాడినట్లయింది’ అని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
 - 
                        
                            

బిహార్ అసెంబ్లీ పోరు.. ముగిసిన తొలిదశ ప్రచారం
 - 
                        
                            

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
 - 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 - 
                        
                            

ఛత్తీస్‌గఢ్‌లో రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
 - 
                        
                            

బాధితులకు రూ.కోటి పరిహారం ఎప్పుడు చెల్లిస్తారు?: తెలంగాణ హైకోర్టు
 


