గ్రామస్థాయి వరకు రెవెన్యూ సేవలు

Eenadu icon
By Telangana News Desk Published : 05 Sep 2025 04:19 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

జీపీవోల నియామకంతో నెరవేరిన ఎన్నికల హామీ
నేడు సీఎం చేతులమీదుగా నియామక పత్రాలు: మంత్రి పొంగులేటి

ఈనాడు, హైదరాబాద్‌: గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని కాంగ్రెస్‌ ప్రభుత్వం నెరవేర్చిందని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం రద్దుచేసిన వీఆర్వో, వీఆర్‌ఏ వ్యవస్థల పునరుద్ధరణలో భాగంగా ప్రభుత్వం కొత్తగా గ్రామ పాలన అధికారులను (జీపీవోలను) నియమిస్తోందన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించనున్న కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వారికి నియామకపత్రాలు అందిస్తారని మంత్రి పొంగులేటి వెల్లడించారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో గురువారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. భూ సమస్యలపై రైతులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్లు వివరించారు. ‘‘ఒకటి రెండు రోజుల్లో జీపీవోలు అందుబాటులోకి రానున్నారు. ఈ పోస్టుల్లో పనిచేసేందుకు ఆసక్తిచూపిన వీఆర్వో, వీఆర్‌ఏలకు రెండు విడతల్లో అర్హత పరీక్ష నిర్వహించాం. 5,106 మంది జీపీవోలుగా ఎంపికయ్యారు. గత ప్రభుత్వంలోని పెద్దలు తాము చెప్పినట్లు వినలేదన్న అక్కసుతో వీఆర్వో, వీఆర్‌ఏ వ్యవస్థలను రద్దుచేశారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో సామాన్యులకు రెవెన్యూ సేవలు దూరమయ్యాయి. రాష్ట్రంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టాం. రెవెన్యూ, సర్వే విభాగానికి మధ్య అవినాభావ సంబంధం ఉండటంతో ఆ విభాగాన్ని కూడా బలోపేతం చేస్తున్నాం. రిజిస్ట్రేషన్లకు సర్వే పటం తప్పనిసరి చేస్తున్న నేపథ్యంలో వచ్చే నెల మొదటి వారం నుంచి.. మొదటి విడతలో శిక్షణ పొందిన 7 వేల మంది లైసెన్స్‌డ్‌ సర్వేయర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాం’’ అని మంత్రి పొంగులేటి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు