విద్యారుణం రద్దు సరైన నిర్ణయమే

Eenadu icon
By Telangana News Desk Published : 28 Oct 2025 03:23 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ తీర్పు

ఈనాడు, హైదరాబాద్‌: బీమా కాలవ్యవధిని నిర్దేశించడంలో బ్యాంకు నిర్లక్ష్యంగా వ్యవహరించినందున దానికి పిటిషనర్లను బాధ్యులను చేయడం సరికాదని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ తేల్చి చెప్పింది. కుమారుడి చదువు కోసం రుణం తీసుకోగా అతను చనిపోవడంతో రుణం చెల్లింపునకు తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకురావడం సరికాదంది. విద్యారుణం రద్దు చేయాలని, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని, తాకట్టు పత్రాలన్నీ వాపసు ఇవ్వాలంటూ జిల్లా వినియోగదారుల కమిషన్‌ ఇచ్చిన తీర్పును కమిషన్‌ సమర్థించింది. హైదరాబాద్‌కు చెందిన ఎన్‌.వెంకటనారాయణస్వామి, రాగమణిలు తన కుమారుడి చదువు కోసం యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ.10 లక్షల రుణం మంజూరు చేసింది. అందులో రూ.7.50 లక్షలు వినియోగించుకున్నారు. 2011 నుంచి 2016 వరకు రూ.1.80 లక్షలు తిరిగి చెల్లించగా, కుమారుడు చనిపోవడంతో చెల్లింపులు నిలిపివేశారు. విద్యార్థి కోర్సు 3 ఏళ్లకే బీమా ఉందని, ప్రస్తుతం గడువు తీరినందున రుణాన్ని సహదరఖాస్తుదారులైన విద్యార్థి తల్లిదండ్రులు చెల్లించాలనడంతో వారు జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలను విన్న జిల్లా కమిషన్‌ రుణం రద్దు చేయడంతోపాటు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరాదని బ్యాంకును ఆదేశించింది. దీన్ని సవాలు చేస్తూ బ్యాంకు రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించింది. దీనిపై ఇన్‌ఛార్జి అధ్యక్షురాలు మీనారామనాథన్, సభ్యులు వి.వి.శేషుబాబులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి ఇటీవల తీర్పు వెలువరించింది. బీమా చెల్లించాలని మాత్రమే బ్యాంకు దరఖాస్తుదారులకు చెప్పిందని, సాధారణంగా బీమా ఈఎంఐ కాలం పూర్తయ్యేదాకా ఉంటుందని, దానికి విరుద్ధంగా కేవలం మూడేళ్లకే అని చెప్పడంలో బ్యాంకు నిర్లక్ష్యం ఉందని పేర్కొంది. మూడేళ్లకే పాలసీ అన్న విషయాన్ని రుణగ్రస్తులకు తెలియజేసినట్లు ఎలాంటి ఆధారాలు చూపలేదని, జిల్లా కమిషన్‌ తీర్పులో జోక్యం చేసుకోలేమంటూ బ్యాంకు అప్పీలును కొట్టివేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు