మైనింగ్‌ రవాణాలో అక్రమాలకు అడ్డుకట్ట!

Eenadu icon
By Telangana News Desk Published : 28 Oct 2025 04:43 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇక పాత వాహనాలకూ హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లు
టూరిస్టు వాహనాలకు సైతం..
నెలాఖరులోగా ఉత్తర్వులు!

ఈనాడు, హైదరాబాద్‌: మైనింగ్‌ రవాణాలో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్టవేసే విషయమై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఒకే నంబరు ప్లేటు, ఒకే పర్మిట్‌తో రెండు, మూడు వాహనాలు తిరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. ఈ నేపథ్యంలో ఖనిజాల్ని రవాణాచేసే పాత వాహనాలకు హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లు బిగుంచుకోవాలన్న నిబంధనను ప్రభుత్వం తీసుకురాబోతుంది. అలాగే పర్యాటకుల్ని తీసుకెళ్లే (టూరిస్టు) బస్సులు, వ్యాన్లకూ దీన్ని వర్తింపజేయాలని నిర్ణయించింది. 

రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ప్రధాన ఆదాయ వనరుల్లో మైనింగ్‌ ఒకటి. ఇసుక, కంకర, మొరం, గ్రానైట్, క్వార్ట్జ్‌ వంటి ఖనిజాల ద్వారా ఆదాయం సమకూరుతోంది. అయితే వీటిని రవాణాచేసేవారు ఒక పర్మిట్‌ను రెండు, మూడు అంతకంటే ఎక్కువ వాహనాలకు ఉపయోగిస్తున్నారు. ఒకే నంబరు ప్లేటును వేర్వేరు వాహనాలకు బిగిస్తున్నారు. గనుల్లో తవ్వే ఖనిజం పరిమాణానికి, లీజుదారులు చెల్లించే ఫీజులకు మధ్య భారీగా అంతరం ఉంటోంది. ముఖ్యంగా ఇసుక ద్వారా ఎక్కువగా ఆదాయానికి గండి పడుతోంది. ఏడాదికి సగటున 190 లక్షల టన్నుల ఇసుక విక్రయాలు జరుగుతున్నాయి. ఈ అమ్మకాలతో సగటున రూ.750 కోట్ల ఆదాయం వస్తోంది. పాత వాహనాలకూ హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లను తప్పనిసరిచేస్తే ఈ ఆదాయం భారీగా పెరుగుతుందన్నది ప్రభుత్వ అంచనా. కొత్త వాహనాలకు హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లు ఉంటాయి. వాటిని తొలగించి మరోటి బిగించడం చాలా కష్టం. పాత వాహనాలకు సాధారణ నంబరు ప్లేట్లు ఉండటంతో సులభంగా మార్చేస్తున్నారు. టూరిస్టు వాహనాలు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లినప్పుడు రెండుచోట్లా ఫీజులు కట్టాలి. దీంతో ‘ఆర్థికభారాన్ని’ తగ్గించుకునేందుకు కొందరు యజమానులు నంబరు ప్లేట్లు మారుస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

మైనింగ్, టూరిస్టు వాహనాల అక్రమాలతో ప్రభుత్వానికి జరుగుతున్న ఆర్థికనష్టంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమక్షంలో ఇటీవల సమావేశం జరిగినట్లు సమాచారం. నిజానికి పాత వాహనాలన్నింటికీ హైసెక్యూరిటీ నంబరు ప్లేట్ల నిబంధన తీసుకురావాలని ప్రభుత్వం కొద్దినెలల క్రితమే నిర్ణయించినా ఆఖరిక్షణంలో ఆగిపోయింది. ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా నివారించాలన్న తాజా నిర్ణయం నేపథ్యంలో ఖనిజాల్ని, పర్యాటకుల్ని రవాణాచేసే పాత వాహనాలకు హైసెక్యూరిటీ నంబరు ప్లేట్ల నిబంధనపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నెలాఖరులోగా ఉత్తర్వులు జారీకానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే వ్యక్తిగత వాహనాలకు హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లపై ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని రవాణాశాఖ వర్గాల సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని