సంక్షిప్త వార్తలు (12)

Eenadu icon
By Telangana News Desk Published : 29 Oct 2025 04:13 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
5 min read

వరంగల్‌ ఎంజీఎం ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌గా హరీశ్‌చంద్రారెడ్డి 

ఈనాడు, హైదరాబాద్‌: వరంగల్‌ ఎంజీఎం ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌గా డాక్టర్‌ పి.హరీశ్‌చంద్రారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులిచ్చింది. ఇటీవల ఎంజీఎంలో ఇద్దరు పిల్లలకు ఒకే ఆక్సిజన్‌ సిలిండర్‌ అమర్చిన ఘటనను మంత్రి రాజనర్సింహ తీవ్రంగా పరిగణించి సూపరింటెండెంట్‌ కిశోర్‌పై చర్యలకు ఆదేశించిన విషయం తెలిసిందే.  


నవంబరు 7న నిరసన దీక్ష

 రాష్ట్ర పింఛన్‌దారుల సంఘం

ఈనాడు, హైదరాబాద్‌: పింఛన్‌దారుల ప్రధానమైన నాలుగు డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోతే  నవంబరు 7న ఇందిరాపార్క్‌ వద్ద నిరసన దీక్ష చేస్తామని తెలంగాణ పింఛన్‌దారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుంటకండ్ల దామోదర్‌రెడ్డి, సెక్రటరీ జనరల్‌ సి.చంద్రశేఖర్‌లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో 2.60లక్షల మంది సభ్యులున్న తమ సంఘం డిమాండ్లను పరిష్కరించాలని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి దామోదర్‌ రాజనర్సింహను పలుమార్లు స్వయంగా కలిసి విన్నవించినా పట్టించుకోకపోవడం శోచనీయమని వారు పేర్కొన్నారు.


‘విద్యుత్‌ ఉద్యోగుల సమస్యలపై చర్చలు సానుకూలం’

ఈనాడు, హైదరాబాద్‌: విద్యుత్‌ ఉద్యోగుల సమస్యలపై చర్చలు సానుకూలంగా ముగిశాయని ఉద్యోగుల 1104 యూనియన్‌ నాయకులు తెలిపారు. సిబ్బంది, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మంగళవారం ట్రాన్స్‌కో, దక్షిణ డిస్కం సీఎండీలు కృష్ణభాస్కర్, ముషారఫ్‌ ఫరూఖీతో నాయకులు చర్చలు జరిపారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం పట్ల ఇద్దరు సీఎండీలు సానుకూలంగా స్పందించారని యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.సాయిబాబు, అధ్యక్షుడు వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.


జూనియర్‌ కళాశాలలకు తెలుపు రంగే వేయాలి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఒకేవిధంగా కనిపించేలా భవనాలకు తెలుగు రంగు, అంచుల్లో నీలం రంగు మాత్రమే వేయాలని ఇంటర్‌ విద్యాశాఖ సంచాలకుడు కృష్ణఆదిత్య ఆదేశాలు జారీ చేశారు. నిర్దేశిత గడువు లోపు రంగులను పూర్తి చేయాలని, మైనర్‌ మరమ్మతుల నిధులను వినియోగించుకోవాలని ఆయన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 430 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలున్నాయి.


ఫార్మసీ స్పాట్‌ ప్రవేశాల గడువు పొడిగింపు 

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో బీఫార్మసీ, బయో మెడికల్‌ ఇంజినీరింగ్, బయో టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్‌ ఇంజినీరింగ్‌ కోర్సుల్లో స్పాట్‌ ప్రవేశాలకు గడువును ఈనెల 30 వరకు పొడిగించినట్లు ప్రవేశాల కన్వీనర్‌ శ్రీదేవసేన ఒక ప్రకటనలో తెలిపారు. ముందు ప్రకటించిన గడువు మంగళవారంతో ముగిసింది. 


మొగిలిగిద్ద జడ్పీహెచ్‌కు రూ.10 కోట్లు  

ఈనాడు, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్‌ మండలం మొగిలిగిద్ద ఉన్నత పాఠశాలకు ప్రభుత్వం రూ.10 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా మంగళవారం జీఓ జారీ చేశారు. ఆ పాఠశాల కొత్త భవన సముదాయం నిర్మాణానికి ఈ నిధులు కేటాయించారు. గత జనవరి 31న ఆ పాఠశాల 150వ వార్షికోత్సవం సందర్భంగా సీఎం ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఈ నిధులు విడుదల చేసింది. బూర్గుల రామకృష్ణారావు, మర్రి చెన్నారెడ్డి, ఆచార్య హరగోపాల్‌ తదితర ప్రముఖులు ఈ పాఠశాల పూర్వ విద్యార్థులే.  


సోషల్‌ సైన్స్‌ పరిశోధనపై నేటి నుంచి సదస్సు

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలో సోషల్‌ సైన్స్‌ పరిశోధన, సమస్యలు, సవాళ్లు అనే అంశంపై బుధవారం నుంచి రెండు రోజులపాటు జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు సెస్‌ సంచాలకురాలు ఆచార్య ఇ.రేవతి ఒక ప్రకటనలో తెలిపారు. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్స్‌ రీసెర్చ్‌(ఐసీఎస్‌ఎస్‌ఆర్‌)..సెస్, కౌన్సిల్‌ ఫర్‌ సోషల్‌ డెవలప్‌మెంట్, బిట్స్‌ పిలానీ హైదరాబాద్‌లకు సోషల్‌ సైన్స్‌ పరిశోధనా ప్రాజెక్టును మంజూరు చేసింది. 


బియ్యం ఎగుమతులు మరింత పెరగాలి: సమరేందు మహంతి 

ఈనాడు,హైదరాబాద్‌: తెలంగాణ నుంచి బియ్యం ఎగుమతులు మరింతగా పెరగాలని బియ్యం ఎగుమతుల నిపుణుడు, వరల్డ్‌ఫుడ్‌ ఫౌండేషన్‌ పురస్కార గ్రహీత సమరేందు మహంతి పేర్కొన్నారు. రాష్ట్రవ్యవసాయ విశ్వవిద్యాలయంలోని అగ్రిహబ్‌లో మంగళవారం బియ్యం ఎగుమతులపై జరిగిన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ‘తెలంగాణలో బియ్యం ఉత్పత్తి 2014-2024 మధ్య మూడురెట్లు పెరిగింది. ఇప్పటికే ‘తెలంగాణ రైస్‌’ అనే బ్రాండ్‌ పేరుతో ఇక్కడి బియ్యం ఫిలిప్పీన్స్‌కి ఎగుమతి అవుతున్నాయి. దాన్ని మరింత పెంచాలి’ అని సూచించారు. దీనికై ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని పౌరసరఫరాల కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. వ్యవసాయ సంచాలకుడు గోపి, పౌరసరఫరాల శాఖ సంచాలకులు హనుమంత్‌ కొండిబ, అగ్రివర్సిటీ పరిశోధన సంచాలకుడు బలరాం తదితరులు పాల్గొన్నారు. 


నేటి నుంచి సీపీగెట్‌ చివరి విడత కౌన్సెలింగ్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎంఏ, ఎంకాం, ఎంఎస్‌సీ సీట్ల భర్తీకి సీపీగెట్‌ చివరి విడత కౌన్సెలింగ్‌ బుధవారం  ప్రారంభం కానుంది. నవంబరు 1 వరకు రిజిస్ట్రేషన్, ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని, నవంబరు 2 నుంచి 4వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని ప్రవేశాల కన్వీనర్‌ ఆచార్య పాండురంగారెడ్డి తెలిపారు. నవంబరు 9న సీట్లు కేటాయిస్తారు.  


రాష్ట్రాల ట్రైబ్యునళ్లలోనే  రైల్వే క్లెయిమ్‌లు: ద.మ.రైల్వే

ఈనాడు, హైదరాబాద్‌: రైల్వేల్లో జరిగే ప్రమాదాలు, అనూహ్య ఘటనలతో ప్రయాణికులకు వారి వస్తువులకు జరిగిన నష్టం తదితర అంశాలకు సంబంధించిన పరిహార క్లెయిమ్‌లను వారివారి రాష్ట్రాలకు సంబంధించిన రైల్వే క్లెయిమ్‌ల ట్రైబ్యునల్‌ బెంచ్‌లోనే దాఖలు చేయాలని మంగళవారం ఓ ప్రకటనలో దక్షిణ మధ్య రైల్వే సూచించింది. తెలంగాణలో సికింద్రాబాద్, ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి(గుంటూరు), కర్ణాటకలో బెంగళూరు, మహారాష్ట్రలో నాగ్‌పుర్, ముంబయిలలో ఈ ట్రైబ్యునళ్లు ఉన్నాయని వివరించింది. సంఘటన జరిగిన ఏడాదిలోపు దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది.


తుపాను ప్రభావిత ప్రాంతాలకు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు: బండి సంజయ్‌

కరీంనగర్, న్యూస్‌టుడే: మొంథా తుపాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశమున్న నేపథ్యంలో కేంద్రం తరఫున అన్ని విధాలా సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను అప్రమత్తం చేశామని, ఏపీలో 19 జిల్లాల్లో వర్ష ప్రభావంఅధికంగా ఉన్నందున ఈ టీంలను అక్కడికి పంపించామన్నారు.


ఇందిరా మహిళాశక్తి పథకానికి ప్రత్యేక బ్యాంకు ఖాతా

ఈనాడు, హైదరాబాద్‌: ఇందిరా మహిళాశక్తి పథకం అమలుకు ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా ఏర్పాటుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈ పథకానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధితోపాటు వివిధ శాఖల నుంచి నిధులను సమీకరించి వెచ్చిస్తున్నారు. అలా కాకుండా దీనికోసం ప్రత్యేక ఖాతాను ఏర్పాటుచేసి అందులోనే నేరుగా నిధులను జమచేసి పథకాన్ని అమలు చేయాలని సెర్ప్‌ సీఈవో దివ్యాదేవరాజన్‌ పీఆర్‌ శాఖను కోరారు. ఈ మేరకు ఆర్థికశాఖకు ప్రతిపాదనలు పంపగా దానిని ఆమోదిస్తూ ముఖ్యకార్యదర్శి సందీప్‌ సుల్తానియా ఉత్తర్వులిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు