విచ్ఛిన్నకర శక్తులతో దేశ సమైక్యతకు సవాలు

Eenadu icon
By Telangana News Desk Published : 01 Nov 2025 04:16 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
కాంగ్రెస్‌కు పటేల్, పీవీ అంటే నొప్పి: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి 

‘రన్‌ ఫర్‌ యూనిటీ’లో మాట్లాడుతున్న వెంకయ్యనాయుడు. చిత్రంలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రామచందర్‌రావు, కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ 

నారాయణగూడ, న్యూస్‌టుడే: కొన్ని విచ్ఛిన్నకర శక్తులు దేశ సమైక్యతకు సవాలు విసురుతూనే ఉన్నాయని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. శుక్రవారం మాజీ ఉప ప్రధాని, దేశ సమైక్యతా శిల్పి సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ 150వ జయంతి సందర్భంగా ‘రన్‌ ఫర్‌ యూనిటీ’ నిర్వహించారు. హైదరాబాద్‌ ఎల్బీస్టేడియం ఎదురుగా ఉన్న బాబూ జగ్జీవన్‌రామ్‌ కూడలి నుంచి అసెంబ్లీ ఎదురుగా ఉన్న పటేల్‌ విగ్రహం వరకు కొనసాగింది. వెంకయ్యనాయుడు పటేల్‌ విగ్రహానికి నివాళులర్పించి మాట్లాడారు. ‘ఈ రోజు పదవుల కోసం ఎలా తంటాలు పడుతున్నారో చూస్తున్నాం. కాని తనకు వచ్చే ప్రధాని పదవిని త్యాగం చేసిన మహనీయుడు పటేల్‌’ అని కొనియాడారు. ‘మొంథా తుపానులో అధికారులు సహాయ చర్యలు చేపట్టిన తీరు, స్వచ్ఛంద సేవా సంస్థల స్పందనను అభినందిస్తున్నా. తుపాను వల్ల నష్టపోయిన రైతులు, చేతివృత్తుల వారిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ఆదుకోవాలి’అని సూచించారు.

పటేల్‌ త్యాగాలు మరవకూడదు

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘పటేల్‌ స్వాతంత్య్ర సమరయోధుడిగానే కాదు. గుజరాత్‌లో రైతు ఉద్యమ నాయకుడిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. కాంగ్రెస్‌కు పటేల్‌ అన్నా.. తెలుగుబిడ్డ పీవీ నరసింహారావు అన్నా నొప్పి. వారికి నెహ్రూ కుటుంబం తప్ప ఇంకెవ్వరూ గుర్తుండరు. ఏడాది పొడవునా పటేల్‌ 150వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకొందాం. ప్రతి తెలంగాణ బిడ్డా పటేల్‌ త్యాగాలను మరవకూడదు. రజాకార్ల దమనకాండను తుదముట్టించిన పటేల్‌ పోరాటాన్ని స్మరించుకుందాం’అన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు మాట్లాడుతూ.. భారత ఏకత్వానికి ప్రతీక సర్దార్‌ పటేల్‌ అని నివాళులర్పించారు. కార్యక్రమంలో భాజపా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, భాజపా శాసనసభాపక్ష, మండలిపక్ష నాయకులు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఏవీఎన్‌రెడ్డి, మహారాష్ట్ర మంత్రి ఆశిష్‌  శెలార్, పార్టీ నేత చింతల రామచంద్రారెడ్డి తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని