Jubilee hills bypoll: అమాత్యులందరికీ బాధ్యతలు!

Eenadu icon
By Telangana News Desk Published : 29 Oct 2025 04:22 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

జూబ్లీహిల్స్‌ ఒక్కో డివిజన్‌లో ఇద్దరు మంత్రుల ప్రచారం 
9 వరకూ ముఖ్య నేతలంతా నగరంలోనే ఉండేలా ప్రణాళిక 
ఉప ఎన్నికలో విజయానికి కాంగ్రెస్‌ వ్యూహం  

ఈనాడు, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో విజయానికి కాంగ్రెస్‌ పక్కా వ్యూహం అమలు చేస్తోంది. సీఎం, ఉప ముఖ్యమంత్రి మినహా మంత్రులందరికీ ప్రచార బాధ్యతలను అప్పగించింది. ఒక్కో డివిజన్‌లో ఇద్దరు మంత్రులు వ్యక్తిగతంగా బాధ్యతలు తీసుకుని ప్రచారం చేయడమే కాకుండా కార్యక్రమాలను పక్కాగా అమలు చేయాలని పార్టీ సూచించింది. వచ్చే నెల 9వ తేదీ సాయంత్రం ప్రచార గడువు ముగిసేవరకూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యనేతలెవరూ హైదరాబాద్‌ విడిచి వెళ్లవద్దని స్పష్టంచేసింది. అందరూ జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొనాలని, పెద్దసంఖ్యలో అనుచరులతో తిరుగుతూ హడావుడి చేయకుండా 10 నుంచి 20 మందితో ఇంటింటికీ వెళ్లి ఓటు అడగాలని సూచించింది. ‘‘ఒక డివిజన్‌కు కేటాయించిన ఇద్దరు మంత్రులు అక్కడున్న ప్రాంతాలను చెరిసమానంగా పంచుకుని ప్రచారాన్ని పర్యవేక్షిస్తూ క్షేత్రస్థాయిలో తిరగాలి. వీరికి సాయంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల ఛైర్మన్లు, పార్టీ అనుబంధ సంఘాల నేతలు పనిచేయాలి. ఎవరు ఏ రోజు ఎన్ని ఇళ్లకు వెళ్లి ఎంతమంది ఓటర్లను కలవాలి అనేది ముందుగా నిర్ణయించుకోవాలి. ఆ ప్రణాళిక ప్రకారం కలసి మాట్లాడారా లేదా అనేది మరుసటి రోజు ఉదయమే సమీక్షించుకోవాలి. ఏదైనా ఒక డివిజన్‌లో లోపాలు గుర్తిస్తే.. సవరించి శ్రేణుల్లో ఉత్సాహం నింపే చర్యలు చేపట్టాలి’’ అని ప్రణాళిక రూపొందించుకున్నారు.

ఎలాంటి లోపాలు లేకుండా... 

ఇప్పటికే గత రెండు నెలలుగా ఈ నియోజకవర్గ బాధ్యతలను నగర ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వివేక్‌లు పర్యవేక్షిస్తున్నారు. తాజాగా.. ఇంటింటి ప్రచార కార్యక్రమాల నిర్వహణతో ఓటర్లకు దగ్గరయ్యేందుకు మంత్రులందరినీ పార్టీ రంగంలోకి దించింది. ఈ ఉప ఎన్నికలో సీఎం రేవంత్‌రెడ్డి కూడా ప్రచారం చేయనున్నారు. సీఎం ఏరోజుకారోజు ప్రచార కార్యక్రమాలపై ఆరాతీస్తూ నేతలను అప్రమత్తం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జి మీనాక్షీ నటరాజన్‌ కూడా పర్యవేక్షిస్తున్నారు. ప్రచార బాధ్యతల నిర్వహణలో ఎవరూ నిర్లక్ష్యం చూపవద్దని, రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం కదా ఉపఎన్నికలో సునాయాసంగా విజయం సాధిస్తామనే ధోరణితో వ్యవహరించవద్దని మీనాక్షి అంతర్గత సమావేశాల్లో హెచ్చరిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ఏ డివిజన్‌కు ఎవరెవరంటే... 

రహమత్‌నగర్‌ డివిజన్‌కు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బోరబండకు సీతక్క, మల్లు రవి, వెంగళరావునగర్‌కు తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి, సోమాజిగూడకు శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్, షేక్‌పేటకు కొండా సురేఖ, వివేక్, ఎర్రగడ్డకు దామోదర్‌ రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, యూసఫ్‌గూడ డివిజన్‌కు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌లను ప్రచార బాధ్యులుగా పార్టీ నియమించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని