KTR: ఇందిరమ్మ రాజ్యం అంటే అన్ని వర్గాలను ఇబ్బంది పెట్టడమే

Eenadu icon
By Telangana News Desk Published : 28 Oct 2025 03:51 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆరోపణ
గతంలో రాహుల్‌గాంధీ ప్రయాణించిన ఆటోలో తెలంగాణ భవన్‌కు..

ఆటోలో తెలంగాణ భవన్‌కు వస్తున్న కేటీఆర్‌ 

ఈనాడు డిజిటల్, హైదరాబాద్, ఫిల్మ్‌నగర్‌-న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యమంటే ఇళ్లు కూలగొట్టడం, ఆటో డ్రైవర్ల ఉసురు తీయడం, అన్ని వర్గాలను ఇబ్బంది పెట్టడమేనని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ మూడు రంగుల జెండా కింద ఆటోల మూడు చక్రాలు నలిగిపోయాయని ధ్వజమెత్తారు. 4 లక్షల మంది జూబ్లీహిల్స్‌ ఓటర్లు తీసుకునే నిర్ణయంతో.. రాష్ట్రంలోని 4 కోట్ల మంది ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన ‘ఆటో అన్నతో మాట-ముచ్చట’ కార్యక్రమంలో కేటీఆర్‌ పాల్గొన్నారు. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ నుంచి తెలంగాణ భవన్‌ వరకు.. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రయాణించిన ఆటోలో కేటీఆర్‌ ప్రయాణించారు. రాహుల్‌ గాంధీ ఆటోలో తిరిగినప్పుడు రెండు ఆటోలకు యజమానిగా ఉన్న మష్రత్‌ అలీ.. ప్రస్తుతం ఆ రెండింటినీ అమ్ముకుని డ్రైవర్‌గా మారారని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ భవన్‌కు చేరుకున్న అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడినప్పట్నుంచి.. ఇప్పటివరకు 161 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని అసెంబ్లీలో డిమాండ్‌ చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో అమల్లో ఉన్న రూ.5 లక్షల ప్రమాద బీమా పథకాన్ని కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వం రద్దు చేసింది.

ఒక్కో యువతికి రూ.60 వేలు బాకీ పడిన ప్రభుత్వం

ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపిస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఓట్లు దండుకుంది. తులం బంగారం ఇస్తామని చెప్పి.. మెడలో ఉన్న గొలుసు కూడా లాక్కొంటున్నారు. ప్రభుత్వ నిర్వాకం వల్ల ఆటో డ్రైవర్లు, చిరు వ్యాపారులు కష్టాల కడలిలో చిక్కుకున్నారు. నెలకు రూ.2,500 చొప్పున ఒక్కో యువతికి కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.60 వేలు బాకీ పడింది’ అని కేటీఆర్‌ ధ్వజమెత్తారు. కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ ఉండేదని, ఇప్పుడు పోలీసులు అందరినీ భయపెడుతున్నారని ఆరోపించారు. తుపాకీతో బెదిరించిన వ్యక్తిని మంత్రి కొండా సురేఖ.. తన కారులో తీసుకెళ్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు.


ఆటో కార్మికుల ఓట్లు దండుకుని మోసం చేశారు: హరీశ్‌రావు

ఆటోలో ప్రయాణిస్తున్న హరీశ్‌రావు, మాధవరం కృష్ణారావు

అమీర్‌పేట, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ పార్టీ ఆటో కార్మికులకు మాయమాటలు చెప్పి వారి ఓట్లు దండుకుని మోసం చేసిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. గత ఎన్నికలకు ముందు హైదరాబాద్‌కు వచ్చిన రాహుల్‌గాంధీ ఆటో ఎక్కి..కార్మికులను ఉద్ధరిస్తానంటూ చెప్పిన హామీలేవీ నెరవేరలేదని ఆక్షేపించారు. ‘ఆటో అన్నతో మాట-ముచ్చట’ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి ఆటోలో ఎర్రగడ్డ నుంచి తెలంగాణ భవన్‌ వరకు ప్రయాణించారు. అంతకుముందు ఎర్రగడ్డలో మీడియాతో మాట్లాడారు. ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి రూ.12 వేలు ఇస్తామనే హామీని రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చకపోవడంతో కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. ఒక్కో కుటుంబానికి బకాయిపడ్డ రూ.24 వేలను తక్షణం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ వ్యాఖ్యలపై హరీశ్‌రావు స్పందిస్తూ మంత్రి వర్గంలో ఏం జరుగుతోందో అందరికీ తెలిసిందేనని ఎద్దేవా చేశారు. కొప్పుల ఈశ్వర్‌ సవాల్‌ను స్వీకరించి 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం వద్దకు రావాలని డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు