Flight Engine parts: హైదరాబాద్‌లో విమాన ఇంజిన్‌ విడిభాగాల తయారీ

Eenadu icon
By Telangana News Desk Published : 29 Oct 2025 04:46 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

సాఫ్రాన్‌ ఇంజిన్స్, టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ భాగస్వామ్యంలో యూనిట్‌

‘సీఎఫ్‌ఎం లీప్‌’ ఇంజిన్‌ విడిభాగాల తయారీ కేంద్రం ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి డి.శ్రీధర్‌బాబు, టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ అధికారులు, సాఫ్రాన్‌ ప్రతినిధులు

ఈనాడు బిజినెస్‌ బ్యూరో: వాణిజ్య, యుద్ధ విమానాల ఇంజిన్లు తయారు చేసే అంతర్జాతీయ సంస్థ సాఫ్రాన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజిన్స్‌ భాగస్వామ్యంతో, టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ హైదరాబాద్‌లోని ఆదిభట్లలో ఉన్న టాటా సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఫర్‌ ఏరో ఇంజిన్స్‌లో అత్యాధునిక తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. ‘సీఎఫ్‌ఎం లీప్‌’ ఇంజిన్లలో వినియోగించే కదిలే విడిభాగాలను ఈ కేంద్రంలో ఉత్పత్తి చేస్తారు. ఈ విడిభాగాలకు సంబంధించిన మెషీనింగ్, స్పెషల్‌ ప్రాసెస్‌లనూ ఇక్కడే చేపడతారు. ఈ కేంద్రం ప్రారంభోత్సవాన్ని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌ బాబు, టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ అధికారులు, సాఫ్రాన్‌ ప్రతినిధుల సమక్షంలో మంగళవారం నిర్వహించారు. 

15% ఇంధనం ఆదా

‘సీఎఫ్‌ఎం లీప్‌’ ఇంజిన్లను సీఎఫ్‌ఎం ఇంటర్నేషనల్‌ అభివృద్ధి చేసింది. ఈ ఇంజిన్లకు అవసరమైన కదిలే విడిభాగాల ఉత్పత్తి కోసం గత ఏడాది జనవరిలో సాఫ్రాన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజిన్స్, టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీనికి అనుగుణంగా తక్కువ సమయంలోనే తయారీ కేంద్రాన్ని సిద్ధం చేశారు. సీఎఫ్‌ఎం లీప్‌ ఇంజిన్లను తక్కువ వెడల్పు ఉండే విమానాల్లో అధికంగా వినియోగిస్తున్నారు. ఇవి అత్యుత్తమ పనితీరు ప్రదర్శిస్తున్నట్లు, ముఖ్యంగా విమాన ఇంధనం 15% ఆదా అవుతున్నట్లు సాఫ్రాన్‌ వివరించింది. పైగా ఇంజన్‌ శబ్దం కూడా తక్కువ. 

మూడో అతిపెద్ద విపణి మన దేశమే

ఇందులో వినియోగించే కదిలే విడిభాగాలు ఎంతో కీలకమైనవి. అత్యంత నాణ్యతతో వీటిని ఉత్పత్తి చేయాలి. మన దేశంలో ఈ విడిభాగాలను తయారు చేయడానికి సంకల్పించడం ద్వారా మన సత్తా చాటినట్లు అవుతోందని టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ సీఈఓ, ఎండీ సుకరన్‌ సింగ్‌ తెలిపారు. ఎంతో ఉత్తమమైన ఇంజిన్లలో ఒకటైన లీప్‌ ప్రోగ్రాంలో భాగం కావడం ద్వారా అంతర్జాతీయ ఏరోస్పేస్‌ సరఫరా వ్యవస్థలో చేరిన ఘనత మనకు దక్కుతోందని వివరించారు. లీప్‌ ఇంజిన్లకు మనదేశం మూడో అతిపెద్ద విపణిగా ఉంది. మన దేశంలోని పౌర విమానాల్లో 75% వరకు సీఎఫ్‌ఎం టర్బోఫ్యాన్‌ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఇప్పటి వరకు దేశీయ విమానయాన సంస్థలు 2,000 పైగా లీప్‌ ఇంజిన్లను ఆర్డర్‌ చేశాయి. ఈ ఇంజిన్లకు ఇకపై మన దేశం నుంచే విడిభాగాలు, మద్దతు లభించే అవకాశం ఏర్పడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని