ponguleti Srinivasa Reddy: 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాకే.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు అడుగుతాం

Eenadu icon
By Telangana News Desk Published : 23 Jun 2025 05:45 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

నకిరేకల్‌లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు ఉత్తర్వులు అందజేస్తున్న పొంగులేటి, గుత్తా, వీరేశం. చిత్రంలో చామల, అయిలయ్య

నకిరేకల్, న్యూస్‌టుడే: తల తాకట్టుపెట్టయినా రానున్న మూడున్నరేళ్లలో పేదలకు 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామని... ఆ తర్వాతే అసెంబ్లీ ఎన్నికల్లో మీ గుమ్మం వద్దకు వచ్చి ఓట్లు అడుగుతామని రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా నకిరేకల్‌లో ఆదివారం నియోజకవర్గంలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు ఉత్తర్వులు పంపిణీచేసే సభలో మాట్లాడారు. పదేళ్లలో గత ప్రభుత్వం 93 వేల ఇళ్లను మొదలు పెట్టి 66 వేలు పూర్తి చేసిందని.. మిగిలినవి మొండిగోడలతోనే దర్శనమిచ్చాయని విమర్శించారు.

‘‘పేదలకు ఇళ్లను నిర్మించి ఇచ్చే గృహనిర్మాణ శాఖనే నాటి ప్రభుత్వం రద్దు చేసింది. ప్రభుత్వం ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇళ్లకు ఇచ్చే నిధుల విషయంలో ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయదు. అలాగే డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను పూర్తిచేసేందుకు నిధులిస్తాం. కలెక్టర్లు పారదర్శకంగా అర్హులను ఎంపిక చేయాలి. భూభారతి చట్టం ద్వారా నిర్వహించిన సదస్సుల్లో రాష్ట్రంలో 8.60లక్షల దరఖాస్తులు వచ్చాయి. గత పాలకులు వారు అంటించుకున్న బంకను నేడు బనకచర్ల విషయంలో మాకు అంటించేందుకు తాపత్రయపడుతున్నారు. ఈ అంశం 2016లో మొదలైంది. నాటి నుంచి ఏడేళ్లు అధికారంలో ఉన్న వారు అప్పుడు ఏం చేశారు? గోదావరిలో 400 టీఎంసీల గురించి తెలంగాణ పక్షాన కేంద్రం వద్ద గాని, కోర్టులో గాని నోరు విప్పారా? నాడు అధికారంతో ప్రజల ఆస్తులు కొల్లగొట్టిన అంశాలపై విచారణలు తుదిదశకు వచ్చాయి.

తప్పుచేసిన వారు అసలు, మిత్తీతో శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. రప్పారప్పా అంటూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తే ప్రజలే బుద్ధి చెబుతారు. భద్రాచలం రామాలయానికి ఒక్కసారే వచ్చిన నాటి సీఎం రూ.వంద కోట్లతో అభివృద్ధి చేస్తానని చెప్పి వంద పైసలు కూడా ఇవ్వలేదు. సీఎం రేవంత్‌రెడ్డి ఆశీస్సులతో రామాలయ అభివృద్ధికి రూ.90 కోట్ల వరకు వ్యయం చేశాం.. రూ.110 కోట్లైనా ఖర్చు చేస్తాం’’ అని మంత్రి వివరించారు. నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం అధ్యక్షతన నిర్వహించిన ఈ సభలో శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, విప్‌ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, మందుల సామేల్, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీలు శంకర్‌నాయక్, నెల్లికంటి సత్యం తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు