Ponguleti: ప్రతి భూ సమస్యకూ పరిష్కారం

Eenadu icon
By Telangana News Desk Published : 09 Jul 2025 03:26 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
5 min read

కోర్టు ఉత్తర్వుల అనంతరమే ఆన్‌లైన్‌లోని సాదాబైనామాలపై చర్యలు 
జీవోలు 58, 59 కింద అందిన దరఖాస్తులపై ముందుకెళ్లేందుకు కమిటీ ఏర్పాటు 
త్వరలో భూ అక్రమాలపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌.. ఓ సంస్థతో పది రోజుల్లో ఎంవోయూ
‘ఈనాడు’ ఇంటర్వ్యూలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 
ఈనాడు, హైదరాబాద్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ప్రతి భూ సమస్యకూ పరిష్కారం చూపుతామని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సంపూర్ణ హక్కులు కల్పించే వరకు ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. భూ భారతి అమల్లో భాగంగా మూడు విడతలుగా చేపట్టిన రెవెన్యూ సదస్సులు రైతులకు ఎంతగానో ఉపయోగపడ్డాయన్నారు. సదస్సుల అనంతరం క్షేత్ర స్థాయిలో చేపడుతున్న చర్యలు, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు అనుసరిస్తున్న విధానం తదితర అంశాలపై మంగళవారం ‘ఈనాడు’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన స్పష్టత ఇచ్చారు. 

ఎసైన్డ్‌ భూములపై ఎలా ముందుకెళ్తారు?

రాష్ట్రంలో ఎసైన్డ్‌ భూముల సమస్య చాలా తీవ్రంగా ఉంది. కాంగ్రెస్‌ ప్రభుత్వాల హయాంలో నియోజకవర్గ స్థాయిలోనే సమస్యల పరిష్కారానికి ఎసైన్డ్‌ కమిటీలు ఉండేవి. గత ప్రభుత్వం వాటిని కోల్డ్‌ స్టోరేజ్‌లో పెట్టింది. ఈ కమిటీల పునరుద్ధరణకు విధి విధానాల ఖరారుపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. 

రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారం ఎలా సాగుతోంది

మంత్రి: రైతులను కష్టపెట్టిన ధరణి చట్టాన్ని తొలగించి ఆ స్థానంలో ప్రజా ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం అమల్లో భాగంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించి అధికారులు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మూడు విడతల్లో 8.81 లక్షలు వచ్చాయి. పైలట్‌ ప్రాజెక్టు కింద ఏప్రిల్‌- మే నెలల మధ్య 34 మండలాల్లో రెండు విడతలుగా సదస్సులు నిర్వహించగా మొత్తం 53 వేల దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 70 శాతం ఇప్పటికే పరిష్కరించాం. సాదాబైనామా, ఎసైన్డ్‌లకు సంబంధించిన సమస్యలు మాత్రమే మిగిలి ఉన్నాయి. న్యాయ స్థానం విచారణలో ఉన్నవి మినహా అన్నింటికీ పరిష్కారం చూపుతాం. ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సినవాటిపై దృష్టి పెడతాం. గత ప్రభుత్వం పరిష్కరించలేకపోయిన సమస్యలు భారీగా ఉన్నాయనేది సదస్సులకు వచ్చిన స్పందనను బట్టి అర్థమవుతోంది.

గతంలో దరఖాస్తు చేసుకున్న సాదాబైనామాలను క్రమబద్ధీకరిస్తారా?

ఈ అంశం హైకోర్టు విచారణలో ఉంది. గత ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. ఆర్వోఆర్‌ 2020 చట్టంలో క్రమబద్ధీకరణకు సెక్షన్లు మాత్రం చేర్చలేదు. ఆ చట్టం ప్రకారం స్వీకరించినవి మాత్రమే ఆన్‌లైన్‌ చేశారు. బుధవారం కోర్టు విచారణ జరగనుంది. న్యాయస్థానం ఉత్తర్వుల ప్రకారం క్రమబద్ధీకరణపై నిర్ణయం తీసుకుంటాం. ఆన్‌లైన్‌లో ఉన్న 2.80 లక్షల్లో 60 శాతం దరఖాస్తులకు సంబంధించి నోటీసులు రూపొందించి సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వ స్థలాలు, బోగస్‌ పట్టాలు పెట్టి క్రమబద్ధీకరించాలంటూ దరఖాస్తు చేసుకున్నవి ఎట్టి పరిస్థితుల్లో చేయం. కొత్తగా దరఖాస్తుల స్వీకరణపై నిర్ణయం తీసుకోలేదు. 

1/70 చట్టం అమల్లో ఉన్న జిల్లాల్లో సమస్యల పరిష్కారానికి కలెక్టర్లు వెనుకాడుతున్నట్లు తెలుస్తోంది...?

నిజమే. ఈ జిల్లాల్లో గిరిజన, గిరిజనేతరులకు ఇబ్బందులు ఉన్నాయి. త్వరలో సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి.. వచ్చిన సూచనలతో ఎవరికీ ఇబ్బంది కలగకుండా, హద్దుల సమస్యలు రాకుండా పరిష్కారాలు చేపట్టాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. 

అటవీ- రెవెన్యూ సరిహద్దుల సమస్యలను ఎలా పరిష్కరిస్తారు?

రెండు గ్రామాలు, జిల్లాలు, రాష్ట్రాలతోపాటు శాఖల మధ్య సరిహద్దు సమస్యలు ఉన్నాయి. వికారాబాద్‌ జిల్లా తాండూరు నియోజకవర్గంలో కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల్లో ఏర్పడిన సమస్యను నేను ప్రత్యక్షంగా చూశా. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో సర్వే నంబరు ఒకటి చూపి, మరో చోట ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. రాష్ట్రంలో సర్వే లేకపోవడంతోనే ఈ సమస్యలు వస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో అధ్యయనం తరువాత రాష్ట్రంలో లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. మొదటి విడతగా 7,043 మందికి త్వరలో శిక్షణ పూర్తి కానుంది. ఆగస్టులో రెండో విడతగా మూడు వేల మందికి శిక్షణ ఇస్తాం. వీరి సహాయంతో కొత్త చట్టంలో పేర్కొన్నట్లు రిజిస్ట్రేషన్‌ సందర్భంగా సర్వే పటం జోడించడం తప్పనిసరి చేస్తాం. రాష్ట్రంలో నక్షాలు లేని గ్రామాలు 413 ఉండగా పైలట్‌ ప్రాజెక్టు కింద ఐదు గ్రామాల్లో సర్వే చేపట్టాం. ఖమ్మం జిల్లా ములుగుమాడులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సర్వే పూర్తయింది. ఈ అనుభవంతో మిగిలిన గ్రామాల్లో నక్షాలు రూపొందించే ప్రక్రియ చేపడతాం. 

జీవోలు 58, 59 కింద అందిన దరఖాస్తుల పరిశీలన చేపడతారా.. ప్రభుత్వ భూముల ఆక్రమణదారులపై చర్యలు ఎప్పుడు?

ఈ రెండు జీవోల ఆధారంగా దరఖాస్తు చేసుకున్న అర్హులైన సామాన్యులకు న్యాయం చేస్తాం. దీనికోసం త్వరలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం. 59 జీవో ఆధారంగా కొందరు ఉద్దేశపూర్వకంగా కబ్జాలకు పాల్పడ్డారు. ఇప్పటికే గుర్తించిన భూములను నిషేధిత జాబితాలో చేర్చాం. గత సమావేశాల్లో భాజపాపక్ష నేత మహేశ్వర్‌రెడ్డి వేసిన ప్రశ్న మేరకు భూ అక్రమాలపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ చేపడతామని ప్రకటించా. దీనికి అనుగుణంగానే కేరళకు చెందిన సంస్థతో ఒప్పందం కుదుర్చుకోబోతున్నాం. పైలట్‌ కింద సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో ఆడిట్‌ చేపట్టి... అక్కడ వచ్చిన అనుభవాలతో మిగిలిన జిల్లాల్లోనూ నిర్వహిస్తాం.

మీరు ప్రకటించినట్లు ఆగస్టు 15 నాటికి అన్ని సమస్యలకు పరిష్కారాలు సాధ్యమేనా?

రెవెన్యూ సదస్సుల్లో సాదాబైనామాల క్రమబద్ధీకరణకు 33%, ఎసైన్డ్, సర్వే, పోడు భూములకు సంబంధించినవి 17%, ప్రభుత్వ జోక్యం లేకుండా కలెక్టర్ల స్థాయిలో పరిష్కరించగలిగేవి 20%, రెవెన్యూ అంశాలకు సంబంధించి 30% దరఖాస్తులు వచ్చాయి.  మొదటి రెండు రకాలు మినహా మిగిలినవి క్షేత్ర స్థాయిలోనే పరిష్కారమవుతాయి. సదస్సులు ముగిసిన తరువాత గత నెల 20 నుంచి 24వ తేదీ వరకు అన్‌లైన్‌లో మరో 55 వేల దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 23 వేల అర్జీల పరిశీలన పూర్తయింది. రెవెన్యూ- సర్వే ఇంటర్‌ లింక్‌ సమస్యలు, సాదాబైనామా, పోడు సమస్యలు తప్ప మిగిలిన వాటికి ఆగస్టు 15 లోపు తప్పకుండా పరిష్కారం చూపుతాం.

అవినీతి అధికారులకు మెమోలు జారీ చేయడానికే చర్యలను పరిమితం చేస్తారా.. కఠిన చర్యలు తీసుకుంటారా?

మెమోల జారీనే కాదు.. అక్రమాలకు పాల్పడే వారిని సస్పెండ్‌ కూడా చేస్తున్నాం. ఇలాంటి వారిపై గట్టి చర్యల కోసం రెవెన్యూ చట్టంలో ప్రత్యేకంగా సెక్షన్లు ఏర్పాటు చేశాం. ఎన్ని చేసినా కొందరు చట్టాల్లో లొసుగులను ఆసరాగా చేసుకుంటున్నారు. మరింత పకడ్బందీగా చట్టాల అమలుకు ఏఐని వినియోగించాలని నిర్ణయించాం. మున్ముందు కఠినంగా వ్యవహరిస్తాం. చట్టం అనుమతిస్తే.. ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించేందుకూ వెనుకాడం. స్లాట్‌ విధానంతో రిజిస్ట్రేషన్ల శాఖలో కొంత మార్పు వచ్చింది. రిజిస్ట్రేషన్ల రాబడి పెంచుకునేందుకు శాస్త్రీయ పద్ధతిని అనుసరిస్తాం. భూముల మార్కెట్‌ విలువ సవరణపై అధ్యయనం జరుగుతోంది. అవసరమైన చోట మార్కెట్‌ విలువ పెంపు, లేని చోట తగ్గించేందుకు చర్యలు తీసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు