Uttam: 811 టీఎంసీల కృష్ణా జలాల్లో రాష్ట్రానికి 71శాతం డిమాండ్‌ చేస్తున్నాం: మంత్రి ఉత్తమ్‌

Eenadu icon
By Telangana News Team Updated : 13 Sep 2025 17:34 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

హైదరాబాద్‌: ఈ నెల 23 నుంచి కృష్ణా ట్రైబ్యునల్‌ విచారణ దృష్ట్యా.. నీటిపారుదల రంగ నిపుణులు, న్యాయ నిపుణులతో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి (Nalamada Uttam Kumar Reddy) సమీక్ష నిర్వహించారు. సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది వైద్యనాథన్‌తో పాటు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌ మాట్లాడుతూ..  కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. 811 టీఎంసీల కృష్ణా జలాల్లో రాష్ట్రానికి 71శాతం డిమాండ్‌ చేస్తున్నామన్నారు. న్యాయంగా రావాల్సిన నీటివాటాను సాధిస్తామని తెలిపారు. ట్రైబ్యునల్‌ ముందు బలమైన వాదనలు వినిపిస్తామని చెప్పారు. తాగు, సాగునీటితో సహా పరిశ్రమలకు నీటి వినియోగానికి చర్యలు తీసుకుంటామన్నారు. ట్రైబ్యునల్‌ విచారణ సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి దిల్లీకి వచ్చి సమీక్షిస్తారని తెలిపారు.

గత పాలకుల నిర్లక్ష్యమే కారణం..

తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులకు 65 శాతం మేర నీటి కేటాయింపులు ఉండాల్సిందేనని అన్నారు. పెరుగుతున్న అవసరాలకు తగ్గట్లుగా నీటి కేటాయింపులు ఉండాలని అందుకు అనుగుణంగా తాజా సమాచారాన్ని ట్రైబ్యునల్ కు సమర్పించామన్న ఉత్తమ్... ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ అవకాశాన్ని జారవిడుచుకోబోమని పునరుద్ఘాటించారు. జూన్, జూలై  మాసాల్లో 80 టీఎంసీల నీటిని అందుబాటులో ఉంచడంతో పాటు ఆపరేషన్ ప్రోటోకాల్ అనుసరించి నీటిని వినియోగించుకునే స్వేచ్చ తెలంగాణకు ఉండేలా ట్రైబ్యునల్ ముందు ఉంచుతామని తెలిపారు. ఏపీ అక్రమంగా వినియోగిస్తున్న 291 టీఎంసీల నీటి ఉదంతం వెలుగులోకి వచ్చినందున... ఆ నీటిని పునర్విభజన చేయాల్సిందేనని మంత్రి డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాజెక్టులకు ఏపీ అడ్డుపడుతోందని... రాష్ట్ర హక్కులను కూడా ట్రైబ్యునల్ ఎదుట జరిగే వాదనల్లో వినిపిస్తామని చెప్పారు. ప్రతిపాదిత ప్రాజెక్టుల అంశాలతో కూడిన ప్రత్యేక జీఓను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలిపారు. ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వల్లే కృష్ణా జలాలను తెలంగాణ వినియోగించుకోలేక పోయిందని భారత రాష్ట్ర సమితి నేతలపై ఉత్తమ్ మండిపడ్డారు. గత పాలకుల ఉదాసీనత కారణంగా ఏపీ అక్రమంగా నీటిని తరలించుకుపోయి ప్రయోజనం పొందిందని విమర్శించారు.

Tags :
Published : 13 Sep 2025 17:23 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని