NEET - EAPCET Counselling: రెండు కౌన్సెలింగ్‌లూ ఒకేసారి..!

Eenadu icon
By Telangana News Desk Updated : 18 Aug 2025 05:51 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

అటు ‘నీట్‌’.. ఇటు ఎప్‌సెట్‌

ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు ఓవైపు ‘నీట్‌’ కౌన్సెలింగ్‌ ప్రక్రియ కొనసాగుతుండగా.. మరోవైపు రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల (టీజీ ఎప్‌సెట్‌) ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభమవుతోంది. రాష్ట్రంలో పలువురు విద్యార్థులు ఈ రెండింటికీ దరఖాస్తు చేసుకోవడంతో వ్యవసాయ సంబంధిత(అగ్రి) కోర్సుల సీట్లభర్తీ విషయమై గందరగోళం నెలకొంటోంది. అభ్యర్థులు తొలుత అగ్రి కోర్సుల్లో చేరి.. తర్వాత ఎంబీబీఎస్‌ లేదా బీడీఎస్‌ సీటువస్తే అగ్రి కోర్సుల ప్రవేశాన్ని రద్దు చేసుకుంటుండగా ఈ సీట్లన్నీ మిగిలిపోయే పరిస్థితులు నెలకొంటున్నాయి.

  • రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ బైపీసీ ఉత్తీర్ణత అర్హతతో చాలామంది విద్యార్థులు అటు నీట్, ఇటు టీజీ ఎప్‌సెట్‌ రాస్తున్నారు. ఒకదాని తర్వాత మరొకటి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తే ఎలాంటి సమస్య ఉండేది కాదు. కానీ, ఒకే సమయంలో కౌన్సెలింగ్‌లు జరగడం ఇబ్బందికరంగా మారింది. 
  • తెలంగాణలో ‘నీట్‌’ ప్రక్రియ మొదలయినప్పటినుంచి అగ్రి, హార్టికల్చర్, వెటర్నరీ సీట్ల భర్తీలో ఇదే పరిస్థితి నెలకొంటోంది. ఆగస్టులో ‘నీట్‌’ కౌన్సెలింగ్‌ మొదలై తొలుత జాతీయస్థాయిలో, ఆ తర్వాత రాష్ట్రస్థాయిలో వైద్యవిద్య కోర్సుల సీట్ల భర్తీ ప్రక్రియ సుదీర్ఘంగా సాగుతోంది. ‘అగ్రి’ కోర్సుల కౌన్సెలింగ్‌ కూడా ఆగస్టులోనే మొదలవుతోంది. రెండు ప్రవేశపరీక్షలు రాసినవారిలో నీట్‌ ర్యాంకర్లు తొలుత అగ్రి కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవడం వల్ల అధికారులు వారికి ప్రధాన కళాశాలల్లో సీట్లు కేటాయిస్తున్నారు. వారి తర్వాత ఉన్నవారికి ఇతర కళాశాలల్లో సీట్లు వస్తున్నాయి. ‘అగ్రి’ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ముగిసేలోపు నీట్‌ ర్యాంకర్లు తమ సీట్లను రద్దుచేసుకొని వెళితేనే ఆ సీట్లు ఖాళీగా గుర్తించి కౌన్సెలింగ్‌లో భర్తీకి వీలవుతుండేది. కానీ ‘అగ్రి’ కౌన్సెలింగ్‌ ముగిసి.. తరగతులు ప్రారంభమైన తర్వాత నవంబరు, డిసెంబరు నెలల్లో నీట్‌ ద్వారా ప్రవేశాలు పొందినవారు వచ్చి ఇక్కడి సీట్లను రద్దు చేసుకుంటున్నారు. దీంతో ఆ సీట్లు భర్తీ కావడం లేదు. గత ఐదేళ్లలో ఇలా 400కి పైగా సీట్లు మిగిలిపోయాయి. 
  • ఈ ఏడాది అగ్రి వర్సిటీ కౌన్సెలింగ్‌ను వెనువెంటనే పూర్తిచేసి ఈ నెల 25 నుంచే తరగతులు నిర్వహించాలని భావిస్తోంది. కౌన్సెలింగ్‌ దరఖాస్తుల గడువు ముగిసేనాటికి 11 వేల మంది దరఖాస్తు చేసుకోగా.. ఇందులో 2,500 మంది నీట్‌కు కూడా దరఖాస్తు చేసుకున్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో రెండింటికీ కౌన్సెలింగ్‌ ఒకేసారి కాకుండా ఒకదాని తర్వాత ఒకటి నిర్వహిస్తే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ విషయమై పలుదఫాలుగా కేంద్ర మంత్రులు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులకు వినతిపత్రాలు కూడా సమర్పించినట్లు చెబుతున్నారు.
Tags :
Published : 18 Aug 2025 03:19 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు