NEET PG: పీజీ వైద్య విద్యపై ఆశలు గల్లంతు!

Eenadu icon
By Telangana News Desk Published : 30 Jan 2025 05:32 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

సుప్రీంకోర్టు తీర్పుతో రాష్ట్ర విద్యార్థుల్లో ఆందోళన 

ఈనాడు, హైదరాబాద్‌: వైద్య విద్య పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో రాష్ట్ర కోటా కింద నివాస ప్రాంత ఆధారిత ప్రవేశాలను అనుమతించలేమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో.. పీజీ వైద్య విద్యపై ఆశలు గల్లంతవుతాయేమోననే ఆందోళన తెలంగాణ విద్యార్థుల్లో నెలకొంది. రాష్ట్రంలోని మొత్తం పీజీ వైద్య సీట్లలో ఇప్పటికే 50 శాతం ఆల్‌ ఇండియా కోటాకు వెళ్తున్నాయి. మిగిలిన 50 శాతం సీట్లను స్థానిక రిజర్వేషన్లకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కోటాల్లో.. మిగిలిన సీట్లను ఓపెన్‌ కేటగిరీలో భర్తీ చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న రిజర్వేషన్లను అలాగే కొనసాగిస్తూ.. మిగిలిన ఓపెన్‌ కేటగిరీ సీట్లకు మాత్రమే స్థానికతను తొలగిస్తారా? లేదా మొత్తం అన్ని సీట్లకా అనే విషయాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

కేవలం ఓపెన్‌ కేటగిరీలో మాత్రమే స్థానికతను తొలగిస్తే.. రాష్ట్రంలో అమలవుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల ప్రకారం పీజీ వైద్య సీట్ల ప్రక్రియ యథావిధిగా సాగుతుంది. ఓపెన్‌లో సీట్లకు మాత్రం దేశం మొత్తం నుంచి పోటీ పడతారు. తద్వారా రిజర్వేషన్లతో సంబంధం లేకుండా ఓపెన్‌లో పోటీపడే విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే ఓపెన్‌లో కేవలం ఉన్నత కులాల విద్యార్థులే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీలూ పోటీపడతారు. అఖిల భారత స్థాయిలో ఈ సీట్లను భర్తీ చేస్తే.. మన రాష్ట్ర విద్యార్థులు ఆ మేరకు పోటీపడి పీజీ సీట్లను సాధించాల్సి ఉంటుంది. ఆ పోటీలో అవకాశాలు కోల్పోయే ప్రమాదమూ ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 

50 శాతం సీట్లకూ నిబంధనను తొలగిస్తే..

ఒకవేళ మొత్తం 50 శాతం సీట్లకు కూడా స్థానికత నిబంధనను తొలగిస్తే.. అప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల సీట్లు కూడా ఆలిండియా కోటాలో  చేరిపోతాయి. అఖిల భారత కోటాలో రిజర్వేషన్లు ఉన్నా కూడా.. మన విద్యార్థులు నష్టపోయే అవకాశాలు ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఉదాహరణకు మన దగ్గర రెడ్డి సామాజిక వర్గం ఓసీలో ఉంటే.. కర్ణాటకలో ఓబీసీలో ఉంది. మహారాష్ట్రలోని కొన్ని ఎస్టీ వర్గాలు మన రాష్ట్రంలో ఆ కేటగిరీలోకి రావు.

మన దగ్గర ఎస్టీలు కూడా వేరే రాష్ట్రాల్లో ఆ కేటగిరీలో లేరు. ఇలాంటప్పుడు మన ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు పీజీ వైద్య విద్య సీట్లను కోల్పోయే ప్రమాదం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ రెండు పద్ధతుల్లోనూ రాష్ట్ర విద్యార్థులకు నష్టమే అని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం 50 శాతం పీజీ వైద్య సీట్లను కాళోజీ ఆరోగ్య వర్సిటీ ఆధ్వర్యంలో నీట్‌ ర్యాంకుల ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. ఒకవేళ అన్ని సీట్లూ ఆలిండియా కోటాలోకి వెళ్తే.. ఇక ఆ సీట్లను కూడా రాష్ట్రం భర్తీ చేసే అవకాశం ఉండదు. జాతీయ స్థాయిలోనే భర్తీ చేస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు