Karimnagar: నిట్‌లో సీటు.. రూ.4.59 లక్షలు కట్టే దారెటు..

Eenadu icon
By Telangana News Desk Published : 09 Jul 2025 04:59 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హుజూరాబాద్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న ఆ దంపతులు తమ కుమారులనైనా ఉన్నత చదువులు చదివించాలని ఆశపడ్డారు. తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పిల్లలు చిన్ననాటి నుంచి ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతూ ప్రముఖ కళాశాలల్లో సీట్లు సాధించారు. నాలుగేళ్ల క్రితం పెద్దకుమారుడు ఉస్మానియా వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ సీటు సాధించగా... ఫీజులు తరువాత కట్టేలా కళాశాలలో ప్రత్యేక అనుమతులు తీసుకొని చదివిస్తున్నారు. ప్రస్తుతం చిన్నకుమారుడు వరంగల్‌ నిట్‌లో సీటు సాధించాడు. ఇక అప్పు కూడా పుట్టే మార్గం లేకపోవడంతో ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నారు.

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం సింగాపూర్‌కు చెందిన నీరటి అశోక్, లలిత దంపతుల చిన్నకుమారుడు రిషీ అల్గునూర్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదివాడు.రంగారెడ్డి జిల్లా గౌలిదొడ్డిలోని ఎస్సీ సంక్షేమ గురుకుల పాఠశాలలో 941 మార్కులతో ఇంటర్‌ పాస్‌ అయ్యాడు. జేఈఈ మెయిన్స్‌లో 96.98 పర్సంటైల్‌ సాధించగా, జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 4,797 ర్యాంకు వచ్చింది. వరంగల్‌ నిట్‌లో ఈసీఈ(వీఎల్‌ఎస్‌ఐ) విభాగంలో సీటు దక్కింది. అయితే మొదటి సంవత్సరంలో చేరాలంటే అన్నిరకాల ఫీజుల కోసం రూ.1.48 లక్షలు కట్టాలని చెబుతున్నారు. మిగిలిన మూడేళ్లకు ఏడాదికి రూ.1,03,500 చొప్పున ఖర్చవుతుంది. మొత్తం నాలుగేళ్లకు రూ.4.59 లక్షలు కావాలి. తమ కుటుంబానికి ప్రస్తుతం అంత స్తోమత లేదని, దాతలు చేయూత అందించాలని రిషీ, అతని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు