Uttam Kumar Reddy: ‘రఫేల్‌’ కూలిపోవడంపై ఏమంటారు?

Eenadu icon
By Telangana News Desk Updated : 01 Jun 2025 08:18 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలి
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌

ఈనాడు, దిల్లీ: ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో భారత యుద్ధ విమానం రఫేల్‌ కూలిపోయినట్లు వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని తెలంగాణ మంత్రి, కాంగ్రెస్‌ నాయకుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. బ్లూమ్‌బర్గ్‌ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌(సీడీఎస్‌) అనిల్‌ చౌహాన్‌ స్వయంగా ఈ విషయాన్ని ధ్రువీకరించినందున కేంద్రం దీనిపై స్పందించాలని అన్నారు. ఆయన శనివారం ఇక్కడ ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు.

‘‘భారత వాయుసేన నిర్దేశిత లక్ష్యాలను ఛేదించి సురక్షితంగా తిరిగి రావడాన్ని మేము స్వాగతిస్తున్నాం. అయితే మన యుద్ధవిమానం కూలిపోయిందన్న విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. పాకిస్థాన్‌కు చెందిన ఎన్ని యుద్ధవిమానాలు కూలిపోయాయో చెప్పాలి. యుద్ధ విమానాలు కూలిపోవడం గురించి బ్లూమ్‌బర్గ్‌ విలేకరి సీడీఎస్‌ అనిల్‌ చౌహాన్‌ను అడిగినప్పుడు ‘అవి ఎందుకు కూలిపోయాయి? ఏం తప్పులు జరిగాయన్నది ఇక్కడ చాలా ముఖ్యం’ అన్నారు. ఇదే విషయాన్ని మా నాయకుడు రాహుల్‌గాంధీ చెబితే ఆయనకు వ్యతిరేకంగా అధికారపార్టీ నాయకులు తీవ్ర  ప్రచారం చేశారు. ఈ ఆపరేషన్‌కు సంబంధించి ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం చాలా ముఖ్యం. దానికి, దేశభక్తికి ముడిపెట్టొద్దు. కూలిన యుద్ధవిమానం గురించి అడిగినప్పుడు కాంగ్రెస్‌ నాయకులను దేశభక్తి లేని వారిగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన భాజపా నాయకులు... సీడీఎస్‌ అనిల్‌ చౌహాన్‌ దేశభక్తిని కూడా ప్రశ్నిస్తారా? గాంధీ కుటుంబాన్ని మించిన దేశభక్తులు లేరు.

దేశ సమగ్రత కోసం ప్రాణాలను త్యాగంచేసిన చరిత్ర గాంధీ కుటుంబానికి ఉంది. వారి దేశభక్తిని ప్రశ్నించే అర్హత అధికారపార్టీ నాయకులకు లేదు. ఇరుదేశాల డీజీఎంవోలు కాల్పుల విరమణ గురించి చెప్పక ముందే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ దాని గురించి ఎలా ప్రకటించారన్న దానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకూ సరైన సమాధానం చెప్పలేదు. ఎయిర్‌ మార్షల్‌ ఏకే భారతి చెప్పినట్లు పైలట్లు ఇళ్లకు సురక్షితంగా తిరిగి వచ్చినా యుద్ధ విమానాలు మాత్రం వైమానిక కేంద్రానికి తిరిగి రాలేదు. వాయు సేన అధిపతి ఏపీ సింగ్‌ కూడా ఇటీవల సీఐఐ సమావేశంలో మాట్లాడుతూ యుద్ధవిమానాలు, ప్రతిభావంతులైన సిబ్బంది కొరతపై తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ఈ పరిస్థితుల ప్రకారం ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని సునిశితంగా సమీక్షించుకొని భవిష్యత్తులో వేయబోయే అడుగులపై పూర్తి పారదర్శకంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది’’ అని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

Tags :
Published : 01 Jun 2025 08:17 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని