Uttam Kumar Reddy: రూ.లక్ష కోట్లు ఖర్చు చేసినా లక్ష ఎకరాలకు మించి నీరివ్వలేదు
కాళేశ్వరం తప్పిదాలకు కేసీఆర్‌దే బాధ్యత అని కమిషన్ తేల్చింది
అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్: కాళేశ్వరం నిర్మాణంలో జరిగిన తప్పిదాలకు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌దే బాధ్యత అని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తేల్చిందని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. కాళేశ్వరంలో లోపాలున్నాయని.. డ్యామ్‌కు, బ్యారేజీకి తేడా లేకుండా నిర్మాణం చేపట్టారని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) నివేదికలో ఉందన్నారు. అధికారులు వద్దన్నా వినకుండా మేడిగడ్డలో పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేశారని, మరమ్మతులు చేయకుండా కూలిపోయేందుకు కారణమయ్యారని ఆరోపించారు. ఆదివారం శాసనసభలో జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికపై లఘుచర్చను ఉత్తమ్ ప్రారంభించి మాట్లాడారు. రూ.38 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత-చేవెళ్లను నాటి ప్రభుత్వం పక్కనపెట్టి కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టిందని, అంచనా వ్యయాన్ని రూ.1.47 లక్షల కోట్లకు పెంచిందని ఆక్షేపించారు. రూ.లక్ష కోట్లు ఖర్చు చేసిన ఈ ప్రాజెక్టుతో కొత్త, పాత ఆయకట్టు కలిపి 34 లక్షల ఎకరాలకు నీరిస్తామన్నారని... కొత్తగా లక్ష ఎకరాలకు, పాత ఆయకట్టులో మరో లక్ష ఎకరాలకు మాత్రమే నీరిచ్చారని విమర్శించారు. నాలుగేళ్లలోనే కూలిపోయిందన్నారు.
‘‘క్యాబినెట్ అనుమతి లేకుండానే నాటి ప్రభుత్వం కాళేశ్వరంపై ముందుకెళ్లింది. మేడిగడ్డ వద్ద ప్రాజెక్టును కట్టవద్దని నాటి ప్రభుత్వ కమిటీ చెప్పింది. వాప్కోస్ కమిటీ నివేదిక రావడానికి ముందే మేడిగడ్డ బ్యారేజీ కట్టడానికి డీపీఆర్ తయారు చేయాలని అప్పటి సీఎం ఆదేశించారు. రూ.21 వేల కోట్లతో కట్టిన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు, పంప్‌హౌస్‌లు 20 నెలలుగా నిరుపయోగమయ్యాయి. మేడిగడ్డ కూలడం... రాష్ట్ర చరిత్రలోనే అత్యంత దురదృష్టకర సంఘటన. దేశంలోనే ఇంతటి ఆర్థిక విపత్తు ఏ రాష్ట్రంలోనూ జరగలేదు’ అని పేర్కొన్నారు. తన ప్రసంగానికి భారత రాష్ట్ర సమితి సభ్యులు అడ్డుపడంతో.. ‘మీరే డిజైన్ చేశారు. మీరే కట్టారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే కూలింది. సుప్రీంకోర్టు మాజీ జడ్జి కమిషన్‌ను కాంగ్రెస్ కమిషన్ అంటారా?
పారదర్శకంగా జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ
జస్టిస్ ఘోష్ కమిషన్ పారదర్శకంగా విచారణ జరిపి నివేదిక ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడటం లేదు. కమిషన్ ఇచ్చిన నివేదికపై అసెంబ్లీలో చర్చించిన తరువాత అందరి అభిప్రాయాల మేరకు ప్రజాస్వామ్యబద్ధంగా చర్యలు తీసుకుంటాం. 2019 నుంచే లీకేజీలతో ప్రాజెక్టులో లోపాలు బయటపడ్డాయి. నీళ్లు తగ్గించి, మరమ్మతులు చేయాలని కోరినా కేసీఆర్ పట్టించుకోలేదు. అందుకే మేడిగడ్డ కూలిపోయింది. ఆనాటి సీఎందే బాధ్యత అని కమిషన్ నివేదికలో పేర్కొంది. ప్రాణహిత-చేవెళ్ల డిజైన్‌ను నాటి సీఎం మార్చారని చెప్పింది. ప్రాజెక్టు ప్లానింగ్, డిజైనింగ్, నిర్మాణంలో తప్పులు చేశారు. నిర్మాణంలో నాణ్యత లేదని.. పూర్ ప్లానింగ్, డిజైనింగ్ వల్లే కూలిందని జస్టిస్ ఘోష్ లిఖితపూర్వకంగా పేర్కొన్నారు. తుమ్మిడిహెట్టి దగ్గర నీళ్లున్నా... ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని మేడిగడ్డకు మార్చడం వెనుక సరైన కారణం లేదని కమిషన్ పేర్కొంది. కాంట్రాక్టు పద్ధతి, టెండరింగ్ ప్రక్రియ.. అన్నింట్లో ఉల్లంఘనలు జరిగాయంది. ప్రాజెక్టు పూర్తి కాకముందే పూర్తయినట్లు సర్టిఫికెట్ ఇచ్చారు. కాంట్రాక్టర్లకు మేలు చేసేలా నాటి ప్రభుత్వం వ్యవహరించిందని కమిషన్ తన నివేదికలో పేర్కొంది.
20.2 టీఎంసీలే వచ్చాయి..
సంవత్సరానికి 195 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తామని నాటి ప్రభుత్వం చెప్పింది. రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరంతో.. తెలంగాణకు ఐదేళ్లలో ఉపయోగపడ్డ నీళ్లు 101 టీఎంసీలు. అంటే ఏడాదికి 20.2 టీఎంసీలు. మేం అధికారంలోకి వచ్చాక ఆ మూడు బ్యారేజీల్లో చుక్క నీరూ నిల్వ చేయలేదు. అయినా పంటలకు నీరిచ్చాం. తెలంగాణలో ఖరీఫ్, రబీల్లో రికార్డుస్థాయిలో వరి పండింది. ధాన్యం దిగుబడిలో దేశంలో తెలంగాణ నంబర్-1గా నిలిచిందని కేంద్ర ప్రభుత్వం చెప్పింది.
నిజాల్ని దాచిపెడుతున్నదెవరు?
జరిగిన తప్పులు, నష్టం ప్రజలకు తెలియాలన్నదే మా ఉద్దేశం. నివేదికను అసెంబ్లీలో పెట్టి చర్చిస్తామని మేం చెబితే.. భారత రాష్ట్ర సమితి నేతలు కోర్టుకు వెళ్లారు. నిజాల్ని ఎవరు దాచిపెడుతున్నారు? డీపీఆర్‌కు ఆమోదం రాకముందే కాంట్రాక్టర్లను మాట్లాడుకుని గత ప్రభుత్వం పనులు మొదలుపెట్టింది. కమిషన్ నివేదికలో ఇంజినీర్లు, ఐఏఎస్‌లు, నేతల పేర్లున్నాయి. మేడిగడ్డ కూలడానికి నాటి సీఎంతో పాటు నాటి నీటిపారుదల, ఆర్థిక శాఖల మంత్రులూ బాధ్యులని చెప్పింది’’ అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
 - 
                        
                            

బిహార్ అసెంబ్లీ పోరు.. ముగిసిన తొలిదశ ప్రచారం
 - 
                        
                            

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
 - 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 - 
                        
                            

ఛత్తీస్‌గఢ్‌లో రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
 - 
                        
                            

బాధితులకు రూ.కోటి పరిహారం ఎప్పుడు చెల్లిస్తారు?: తెలంగాణ హైకోర్టు
 


