Uttam Kumar Reddy: పోలవరం ‘టీవోఆర్‌’ను అడ్డుకోండి

Eenadu icon
By Telangana News Desk Published : 17 Jun 2025 03:44 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

కేంద్ర మంత్రికి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లేఖ  

ఈనాడు, హైదరాబాద్‌: పోలవరం-బనకచర్ల ద్వారా గోదావరి జలాల మళ్లింపు కోసం ప్రాజెక్టు టీవోఆర్‌ (టర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌)లో ఏపీ చేసిన మార్పులను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించాలని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కేంద్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌కు ఆయన సోమవారం బహిరంగ లేఖ రాశారు. ‘బనకచర్ల ప్రాజెక్టు చేపట్టడం ద్వారా ఏపీ పర్యావరణ అనుమతులతో పాటు ట్రైబ్యునల్‌ నిబంధనలను ఉల్లంఘిస్తోంది. ఇది ముమ్మాటికీ పొరుగు రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలిగించడమే. గోదావరి జల వివాదాల ట్రైబ్యునల్‌తో పాటు సాంకేతిక సలహా మండలి(టీఏసీ) సూచనలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటోంది. కేంద్ర పర్యావరణశాఖ నుంచి 2005 అక్టోబరు 25న పోలవరం ప్రాజెక్టుకు అనుమతి లభించింది. అనంతర కాలంలో ఎటువంటి అనుమతులు లేకుండానే ప్రాజెక్టులో ఏపీ భారీ మార్పులు చేసింది. ఆ పనులు నిలిపివేయాలంటూ కేంద్రం 2011 ఫిబ్రవరి 8న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను వచ్చే ఏడాది జులై 2 వరకు పొడిగించాలి. కీలకమైన అంశాలపై కేంద్ర జలశక్తి, పర్యావరణ మంత్రిత్వ శాఖలు సంబంధిత పక్షాలతో సమావేశం నిర్వహించి చర్చించాలి. ప్రాజెక్టు నిర్మాణం కోసం మొదట ఆమోదించిన ప్రమాణాలను కేంద్రమే ఉల్లంఘిస్తోంది. కుడి కాలువ హెడ్‌ స్లూయిస్‌ నీటి విడుదల సామర్థ్యాన్ని 40 వేల క్యూసెక్కులకు పెంచారు. కుడి కాలువలో 11,654 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యానికి డీపీఆర్‌కు ఆమోదం లభించగా.. 17,560 క్యూసెక్కులతో నిర్మిస్తున్నారు. ఎడమ కాలువను కూడా సామర్థ్యానికి మించి నిర్మిస్తున్నారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను ఎక్స్‌పర్ట్‌ అప్రయిజల్‌ కమిటీ(ఈఏసీ) తిరస్కరించాలి’’ అని లేఖలో ఉత్తమ్‌ డిమాండ్‌ చేశారు. 


గోదావరి-బనకచర్లకు హరీశ్‌రావు మద్దతు ఇస్తున్నారా?

పీ అక్రమంగా చేపడుతున్న పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు మద్దతు ఇస్తున్నారా అని మంత్రి ఉత్తమ్‌ ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ‘ఆదివారం హరీశ్‌రావు నాకు రాసిన లేఖలో పేర్కొన్న విషయాలు చూస్తోంటే ఆ ప్రాజెక్టుకు ఆయన మద్దతు ఇస్తున్నట్లు ఉంది. గోదావరి మళ్లింపు జలాలతో కృష్ణా జలాల్లో 112.5 టీఎంసీల వాటా పొందాలంటూ హరీశ్‌ సూచన చేశారు. ఇది పూర్తిగా తప్పుడు ఆలోచన. ఎగువ రాష్ట్రాలకు వాటాల కల్పన నికర జలాలకు మాత్రమే వర్తిస్తుంది. వరద నీటికి కాదు. కృష్ణా జలాల్లో 68.5 శాతం వాటా, పోలవరం మళ్లింపుతో వచ్చే వాటా కోసం కేడబ్ల్యూడీటీ-2 ఎదుట కాంగ్రెస్‌ ప్రభుత్వం సమర్థంగా వాదనలు వినిపిస్తోంది. తెలంగాణ ప్రయోజనాల కోసం కాకుండా... రాజకీయ ఉద్దేశంతో హరీశ్‌రావు వ్యవరిస్తున్నారు’ అని ఉత్తమ్‌ విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు