Published : 30/11/2021 04:56 IST

నిబంధనలకు తూట్లు.. నిర్ణయాలు తోచినట్లు

విశ్వవిద్యాలయాల్లో ఇష్టారాజ్యం
జేఎన్‌టీయూహెచ్‌లో పీహెచ్‌డీ ప్రవేశాల రగడ
తెలంగాణ వర్సిటీలో సిబ్బంది నియామకాలపై ఆందోళనలు
అభాసుపాలవుతున్న ఉపకులపతులు

ఈనాడు, హైదరాబాద్‌: అధ్యాపకుల బదిలీలు, విద్యార్థుల పీహెచ్‌డీ ప్రవేశాలు, పొరుగుసేవల సిబ్బంది నియామకాలు.. అంశమేదైనా కొన్ని విశ్వవిద్యాలయాల ఉపకులపతులు నిబంధనలకు నీళ్లొదులుతున్నారు.. ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తమ అధికారులు అవలంబిస్తున్న విధానాల్లో లోపాలున్నా ఉపకులపతులు వంతపాడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఫలితంగా బాధ్యతలు చేపట్టి ఆరు నెలలు గడవక ముందే వీసీలు వివాదాస్పదమవుతున్నారు. వర్సిటీలు.. విద్యార్థి సంఘాలు, అధ్యాపకుల ఆందోళనలకు కేంద్రాలవుతున్నాయి. తెలంగాణ వర్సిటీలోనైతే ఉపకులపతి, పాలకమండలి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. వర్సిటీల్లో అనుచిత నిర్ణయాలు విద్యాశాఖతో పాటు సర్కారుకూ తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది.

ప్రతిభకు పాతర!
పీహెచ్‌డీ ప్రవేశాలకు జేఎన్‌టీయూహెచ్‌ 2020 ఫిబ్రవరి 19న నోటిఫికేషన్‌ జారీచేసింది. 2021 జనవరి 19న రాతపరీక్ష నిర్వహించారు. జులైలో ఫలితాలు వెల్లడించి, నెలాఖరులో ముఖాముఖీలు ప్రారంభించారు. 43 ఫుల్‌టైమ్‌, 186 పార్ట్‌టైమ్‌ పీహెచ్‌డీ సీట్లు ఖాళీగా ఉండగా.. ఏ సీటు ఎవరికి కేటాయించారో తెలిపే రోస్టర్‌ విధానాన్ని పాటించడం లేదంటూ కొందరు ఎస్‌సీ, ఎస్‌టీ కమిషన్‌ను ఆశ్రయించారు. ఫలితంగా చివరకు సీట్‌ మాట్రిక్స్‌ పట్టికను వర్సిటీ వెబ్‌సైట్లో పొందుపరిచింది. విచిత్రం ఏంటంటే రాతపరీక్ష ఫలితాలు ఇచ్చాక కూడా అభ్యర్థుల మార్కులను వెల్లడించలేదు. ఫుల్‌టైమ్‌, పార్ట్‌టైమ్‌ ఖాళీలకు వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇచ్చినా.. ఇంటర్వ్యూలు అందరికీ కలిపి నిర్వహించారు. రాతపరీక్షలో అర్హత సాధించని నెట్‌/సెట్‌ కూడా పాస్‌ కాని, ముఖాముఖీకి రాని అభ్యర్థికి సీటిచ్చారు. నెట్‌తో పాటు వర్సిటీ రాతపరీక్షలో అర్హత పొందిన బీసీ మహిళా అభ్యర్థికి ప్రవేశాన్ని తిరస్కరించారు. కాలపరిమితిని గాలికొదిలి ఏళ్ల క్రితం ‘గేట్‌’ పాసైన వారికీ ఉదారంగా సీట్లిచ్చినట్లు తెలిసింది. అందుకే ప్రవేశాల్లో అవకతవకలు జరిగాయంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగడం.. ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లిన నేపథ్యంలో అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనను వాయిదా వేస్తున్నట్లు వర్సిటీ ఈ నెల 22న ప్రకటించింది.

సిబ్బంది నియామకాలపై రచ్చ
పాలకమండలి, ప్రభుత్వ అనుమతి లేకుండానే తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఉపకులపతి రవీందర్‌గుప్తా 120 మందిని పొరుగుసేవల్లో నియమించారన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై పాలకమండలి సమావేశంలో చర్చించినా వీసీ తానెవరినీ నియమించలేదని చెప్పుకొచ్చారు. చివరకు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందటంతో విద్యాశాఖ కార్యదర్శి సుల్తానియా సర్కారు అనుమతి లేకుండా వర్సిటీల్లో ఏ ఒక్క నియామకమూ జరపరాదని ఉత్తర్వులిచ్చారు. నియామకాలన్నీ రద్దుచేస్తున్నట్లు చివరకు పాలకమండలి సమావేశంలోనే కళాశాల/సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ ప్రకటించాల్సి వచ్చింది.


ప్రిన్సిపాళ్లతో బదిలీ ఉత్తర్వులా?

యూలోని వివిధ కళాశాలల్లో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకులను ఆయా ప్రిన్సిపాళ్లు బదిలీ  చేయడం వివాదాస్పదమైంది. వారికి ఆ అధికారం లేదని, వర్సిటీ రిజిస్ట్రార్‌ ఇస్తే వెళతామని అధ్యాపకులు వాదిస్తున్నారు. ఉత్తర్వులు ఇచ్చేందుకు వర్సిటీ ససేమిరా అనడంతో అధ్యాపకులు మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.


రిజిస్ట్రార్ల నియామకాలూ వివాదాస్పదమే

* జేఎన్‌టీయూహెచ్‌లో రిజిస్ట్రార్‌గా కొనసాగుతున్న మంజూర్‌ హుస్సేన్‌ను రెండు నెలల క్రితం ఉపకులపతి నర్సింహారెడ్డి తొలగించారు. ప్రభుత్వ జోక్యంతో మళ్లీ మరునాడే ఆయన్ని కొనసాగిస్తున్నట్లు ఆదేశాలు జారీచేశారు.

* కాకతీయ వర్సిటీలో సహ ఆచార్యుడిగా ఉన్న మల్లికార్జునరెడ్డిని రిజిస్ట్రార్‌గా నియమించారు. ప్రొఫెసర్‌ హోదా లేని వారికి ఆ పదవి ఎలా ఇస్తారని కొందరు ఫిర్యాదు చేయడంతో ఆయన నెల రోజులకే రాజీనామా చేశారు.

* తెలంగాణ వర్సిటీలో అక్రమ నియామకాలకు రిజిస్ట్రార్‌ వంత పాడుతున్నారని పాలకమండలి ఆరోపించడంతో ప్రభుత్వం ఆయన్ను తప్పించింది. రిజిస్ట్రార్‌గా నియమితులైన రెండు నెలల్లోనే ఆయన దిగిపోవాల్సి వచ్చింది. అలా దిగిపోతూ కూడా కొందరు ఆచార్యుల సర్వీస్‌ రికార్డులను వెంట తీసుకెళ్లారన్న ఆరోపణలు వచ్చాయి. ఈక్రమంలో ఆయనకు నోటీసులు ఇవ్వాలని పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని