
హైదరాబాద్ వద్దు.. జిల్లాలే ముద్దు
ప్రభుత్వానికి 230 మంది అప్పీళ్లు
పరస్పర బదిలీలపై ఆశలు
ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్ రాష్ట్ర రాజధాని. ఎక్కువ మంది అధికారులు, ఉద్యోగులు ఇక్కడ పనిచేయాలని కోరుకునే మహానగరం. అత్యున్నత పదోన్నతులు పొందిన వారు చేరాల్సిన గమ్యం. అలాంటి హైదరాబాద్ వద్దని, తాము జిల్లాలకే వెళ్తామని, అవకాశం కల్పించాలని దాదాపు 230 మంది జోనల్ అధికారులు, ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ఉద్యోగుల బదలాయింపులో భాగంగా హైదరాబాద్‌లో జిల్లా స్థాయిలోని ఉద్యోగులను మినహాయించారు. జోనల్, బహుళజోన్ల పరిధిలో మాత్రమే హైదరాబాద్‌ను పరిగణనలోకి తీసుకొని కేటాయింపులు చేపట్టారు. ఈ మేరకు చాలా శాఖల జోనల్, బహుళజోనల్ ఉద్యోగులు, అధికారులు రెండువేల మందికి పైగా హైదరాబాద్‌లో నియమితులయ్యారు. శాఖాధిపతుల, జోనల్ కార్యాలయాల్లో వారికి పోస్టింగులు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం బదలాయింపుల అనంతరం అభ్యంతరాలు ఉంటే అప్పీలు చేసుకునే అవకాశం ఉద్యోగులకు కల్పించింది. ఈ మేరకు ఇతర జిల్లాలకు బదలాయించిన వారిలో మూడు వేల మంది వరకు హైదరాబాద్ జోన్ కావాలని అప్పీలు చేసుకున్నారు. దీనికి భిన్నంగా 230 మంది మాత్రం తమకు హైదరాబాద్ వద్దని దూర జిల్లాలు కావాలని కోరారు.
సర్దుబాటుకు పరస్పరం ఆరా
సాధారణంగా సాంకేతిక అంశాల ప్రాతిపదికన మాత్రమే ప్రభుత్వం అభ్యంతరాలను పరిశీలనలోకి తీసుకునే వీలుంది. హైదరాబాద్ వద్దు జిల్లాలకు వెళ్తామనే అంశం నిబంధనలకు అనుగుణంగా లేనందున వాటిపై ఏం చేయాలా అని ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. ఈ సమయంలో సర్కారు పరస్పర బదిలీలపై సానుకూలత వ్యక్తం చేసింది. దీంతో ఈ ఉద్యోగుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. వీరు జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే వారి గురించి అన్వేషణ చేపట్టారు. మరోవైపు వీరి గురించి తెలుసుకొని జిల్లా కార్యాలయాల్లో ఉన్న వారూ సంప్రదిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.