Arogyasri: ఆరోగ్యశ్రీలో మరో 65 కొత్త చికిత్సలు

రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకంలో మరో 65 చికిత్సలను చేర్చినట్లు డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు.

Published : 09 Jun 2024 04:24 IST

1,375 వ్యాధులకు నగదు ప్యాకేజీ పెంపు 
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

ఈనాడు, హైదరాబాద్‌: రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకంలో మరో 65 చికిత్సలను చేర్చినట్లు డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. యాంజియోగ్రామ్, పార్కిన్‌సన్స్, వెన్నెముక తదితర ఖరీదైన చికిత్సలను జాబితాలో చేర్చామని, ప్రస్తుతం ఈ పథకం కింద అమలులో ఉన్న చికిత్సల ప్యాకేజీ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అందుకు అవసరమైన రూ.497.29 కోట్లు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ‘రాష్ట్రంలో 1,402 ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నాం. 1,672 చికిత్సలకు ప్రభుత్వం సహాయాన్ని అందజేస్తోంది. ఈ పథకం కింద కొత్త చికిత్సా విధానాలపై సమీక్షించాం. 1,375 చికిత్సలకు ప్యాకేజీ ధరలు పెంచాలని వైద్య నిపుణులు సూచించిన మీదట ఆ మేరకు నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటివరకు అమల్లోలేని 65 అధునాతన చికిత్స విధానాలనూ ఇకపై ఈ పథకంతో అమలు చేస్తాం. ప్రస్తుతం ఆయుష్మాన్‌ భారత్‌లో ఉన్న 98 చికిత్సలను ఇటీవల ఆరోగ్యశ్రీలో చేర్చడంతో రోజుకు సుమారు రూ.189.83 కోట్ల అదనపు ఖర్చు ప్రభుత్వంపై పడుతోంది. అదనంగా చేర్చిన చికిత్సలతో రూ.158.20 కోట్ల ఖర్చు పెరుగుతుంది’ అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని