ACB: ఆర్టీఏ కార్యాలయాల్లో అనిశా ఆకస్మిక తనిఖీలు

రాష్ట్రంలో పలు ప్రాంతీయ రవాణా సంస్థ(ఆర్టీఏ) కార్యాలయాలతోపాటు తనిఖీ కేంద్రాల్లో అవినీతి నిరోధక శాఖ(అనిశా) మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించింది.

Updated : 29 May 2024 07:36 IST

అక్రమాలు గుర్తింపు.. రూ.2.7లక్షలు స్వాధీనం
అశ్వారావుపేటలో లారీడ్రైవర్ల వేషంలో అనిశా బృందం

మంగళవారం అశ్వారావుపేటలోని చెక్‌పోస్ట్‌ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో 
ఆర్టీఏ సిబ్బంది అనుకుని ఏసీబీ అధికారులకు మామూళ్లిస్తున్న లారీ డ్రైవర్‌

ఈనాడు, హైదరాబాద్‌-అశ్వారావుపేట గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో పలు ప్రాంతీయ రవాణా సంస్థ(ఆర్టీఏ) కార్యాలయాలతోపాటు తనిఖీ కేంద్రాల్లో అవినీతి నిరోధక శాఖ(అనిశా) మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించింది. ఆయా చోట్ల అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనే సమాచారంతో పదిహేను బృందాలు ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. 12 ఆర్టీఏ కార్యాలయాలతోపాటు 3 తనిఖీ కేంద్రాల్లో గంటలపాటు సోదాలు నిర్వహించాయి. ఈ సోదాల్లో పలు అక్రమాలు వెలుగుచూడటంతోపాటు లెక్కల్లో లేని రూ.2,70,510 నగదును అనిశా బృందాలు స్వాధీనం చేసుకున్నాయి.  

అధికారుల నుంచి వసూలు చేస్తూ.. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట శివారులోని అంతర్రాష్ట్ర సరిహద్దులో ఉన్న రవాణాశాఖ తనిఖీ కేంద్రానికి అవినీతి నిరోధక శాఖ అధికారులు లారీ డ్రైవర్ల మాదిరి వెళ్లారు. ఏసీబీ అధికారులని గుర్తించని తనిఖీ కేంద్రంలో పనిచేస్తున్న ప్రైవేటు వ్యక్తులు ‘12 చక్రాల లారీ అయితే రూ.200, 16 చక్రాల లారీకి రూ.400, 22 చక్రాల లారీకి రూ.800 ఇవ్వండి’ అంటూ మామూళ్లు తీసుకుని రెడ్‌హ్యండెడ్‌గా పట్టుపడ్డారు. అంతేకాదు కార్యాలయంలో తనిఖీలు చేస్తున్న సమయంలో ఏసీబీ అధికారులను రవాణాశాఖలో పనిచేసే సిబ్బంది అనుకుని లారీ డ్రైవర్లు మామూళ్లు తెచ్చి ఇవ్వడం ఇక్కడి పరిస్థితులను తేటతెల్లం చేస్తోంది. 

ఆర్టీఏ కార్యాలయాల్లో.. తనిఖీ కేంద్రాల్లో లీలలిలా..

  • దాదాపు అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో పలువురు అనధికారిక వ్యక్తులు(ఏజెంట్లు) దరఖాస్తుదారుల ధ్రువీకరణపత్రాలను తీసుకొచ్చినట్లు గుర్తించారు. అలాగే ఆర్టీఏ కార్యాలయాల్లో పలువురు సిబ్బంది యూనిఫాం ధరించకుండా విధుల్లో పాల్గొన్నట్లు తేలింది.
  • నిజామాబాద్‌ సాలూర చెక్‌పోస్టులో ఏఎంవీఐ అనధికారికంగా సెలవులో ఉన్నట్లు గుర్తించారు. కొన్నిచోట్ల ప్రైవేట్‌ ఏజెంట్ల కోడ్‌నంబర్లతో కూడిన డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి.
  • మహబూబాబాద్‌ డీటీవో డ్రైవర్‌ దరఖాస్తుదారుల నుంచి వసూలు చేస్తున్నట్లు తేలింది.
  • ఆదిలాబాద్‌ భోరజ్‌ చెక్‌పోస్టు వద్ద ప్రైవేటు వ్యక్తులను నియమించి మరీ లారీ డ్రైవర్ల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నట్లు తేలింది. లంచాల వసూళ్ల కోసం ప్రైవేటు వ్యక్తులకు నెలకు రూ.8వేల చొప్పున ఇస్తున్నట్లు వెల్లడైంది.
  • అశ్వారావుపేట ఎంవీఐ మఫ్టీలో ఉన్నట్లు తేలింది. ఇక్కడ ఏడుగురు ప్రైవేటు వ్యక్తులు వాహనదారుల నుంచి వసూళ్లు చేస్తున్నట్లు తేలింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని