NIMS: ఛాతీలో దిగిన బాణం.. శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడిన నిమ్స్‌ వైద్యులు

ప్రమాదవశాత్తు ఛాతీలో దిగిన బాణంతో దాదాపు 24 గంటలు విలవిలలాడుతూ నరకయాతన అనుభవించిన ఓ గిరిజన యువకుడికి నిమ్స్‌ వైద్యులు శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడారు.

Published : 26 May 2024 05:35 IST

24 గంటలపాటు విలవిలలాడిన గిరిజన యువకుడు

ఛాతీలో బాణంతో నంద

ఈనాడు, హైదరాబాద్, న్యూస్‌టుడే, నిమ్స్‌: ప్రమాదవశాత్తు ఛాతీలో దిగిన బాణంతో దాదాపు 24 గంటలు విలవిలలాడుతూ నరకయాతన అనుభవించిన ఓ గిరిజన యువకుడికి నిమ్స్‌ వైద్యులు శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడారు. నిమ్స్‌ డైరెక్టర్‌ డా.బీరప్ప, కార్డియోథొరాసిక్‌ విభాగాధిపతి డా.అమరేశ్వరరావు, సీనియర్‌ వైద్యుడు డా.గోపాల్‌ శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపుర్‌ జిల్లా ఊసూర్‌ ప్రాంతానికి చెందిన సోది నంద(17) అనే గుత్తికోయ తెగకు చెందిన యువకుడు గురువారం స్థానిక అడవిలోకి వెళ్లాడు. ప్రమాదవశాత్తు బాణం ఛాతీలో దిగింది. వెంటనే భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచనలతో వరంగల్‌ ఎంజీఎంకు, అక్కడి నుంచి హైదరాబాద్‌ నిమ్స్‌కు శుక్రవారం సాయంత్రం తీసుకొచ్చారు. వైద్యులు తొలుత సీటీస్కాన్‌ తీశారు. ఊపిరితిత్తుల పక్క నుంచి గుండెలోని కుడి కర్ణికలోకి బాణం గుచ్చుకున్నట్లు గుర్తించారు. అప్పటికే భారీగా రక్తస్రావమైంది. దీంతో ఒకవైపు రక్తం ఎక్కిస్తూనే మూడు గంటలపాటు సంక్లిష్టమైన శస్త్రచికిత్స చేసి బాణాన్ని తొలగించారు. అది దిగిన చోట రక్తస్రావమై గడ్డకట్టడంతో ప్రాణాపాయం తప్పిందని పేర్కొన్నారు. ఆ యువకుడు సొంతంగా బాణాన్ని తీసే ప్రయత్నం చేసి ఉంటే మరింత రక్తస్రావమై పరిస్థితి చేజారిపోయేదని వివరించారు. మానవీయ కోణంలో ఈ చికిత్సను నిమ్స్‌ పూర్తి ఉచితంగా చేసిందని, కోలుకున్న వెంటనే డిశ్ఛార్జి చేస్తామని చెప్పారు. శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించిన డా.అమరేశ్వరరావు బృందాన్ని నిమ్స్‌ డైరెక్టర్‌ అభినందించారు. 

ఎక్స్‌రేలో కనిపిస్తున్న బాణం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు