Badi Bata: ‘బడిబాట’కు సరికొత్త ఒరవడి

రాష్ట్రంలో ఆచార్య జయశంకర్‌ బడిబాట కార్యక్రమంలో ఈసారి సర్కారు సరికొత్త ప్రచారం మొదలుపెట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే ఎన్నివిధాలుగా  ప్రయోజనం పొందవచ్చో వివరిస్తోంది.

Published : 08 Jun 2024 06:32 IST

ప్రభుత్వ పాఠశాలలకు ప్రజలు ఆకర్షితులయ్యేలా ప్రచారం
తల్లిదండ్రుల్లో మార్పు తెచ్చేలా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఆచార్య జయశంకర్‌ బడిబాట కార్యక్రమంలో ఈసారి సర్కారు సరికొత్త ప్రచారం మొదలుపెట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే ఎన్నివిధాలుగా  ప్రయోజనం పొందవచ్చో వివరిస్తోంది. సర్కారు బడుల పట్ల తల్లిదండ్రులు ఆకర్షితులయ్యేలా.. ప్రైవేట్‌ పాఠశాలలపై మోజును తగ్గించేందుకు విస్తృత ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 6వ తేదీన బడిబాట ప్రారంభం కాగా.. గతానికి భిన్నంగా పోస్టర్లు ముద్రించి ప్రచారం చేస్తున్నారు. ‘ప్రైవేట్‌ పాఠశాలల్లో చేరితే రూ.50 వేల నుంచి రూ.లక్షన్నర వరకు ఖర్చవుతుంది.. ఇప్పుడు ఆదాచేసే డబ్బును మీ పిల్లల ఉన్నత చదువులకు పొదుపు చేయండి. మీ డబ్బులు మీ దగ్గరే.. మీ పిల్లల భవిష్యత్తు మా దగ్గర’ అంటూ ప్రచారం చేస్తున్నారు. ఉచిత పుస్తకాలు, ఏకరూప దుస్తులు, ఆరోగ్య పరీక్షలు, ఉదయం రాగి జావ, మధ్యాహ్న భోజనం, రీడింగ్‌ కార్నర్ల సౌకర్యం, డిజిటల్‌ తరగతి గదులు తదితర వాటిని పేర్కొంటూ పోస్టర్లు ముద్రించారు. 

ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా

ప్రైవేట్‌ పాఠశాలలకు ధీటుగా.. ప్రభుత్వ పాఠశాలల పునర్‌వైభవానికి కృషి చేసేలా ప్రచారం చేపట్టాలని, తల్లిదండ్రుల్లో మార్పు తెచ్చే ప్రయత్నం జరగాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా విద్యాశాఖ అధికారులకు, కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. దాంతో అధికారులు ఈసారి పోస్టర్లు కూడా ముద్రించి సర్కారు బడుల్లో చదివితే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పొందే ప్రయోజనాలను వివరిస్తున్నారు. బాసర ట్రిపుల్‌ఐటీలో సీట్లు పొందడంలో ప్రాధాన్యం ఉంటుందని వివరిస్తున్నారు.


అమ్మ ఆదర్శ కమిటీలు.. 

ప్రతి పాఠశాలలో అమ్మ ఆదర్శ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే 26,823 పాఠశాలలకు గాను 20,680 చోట్ల ఆ కమిటీలు ఏర్పాటయ్యాయి. వాటి ఆధ్వర్యంలోనే అన్ని పాఠశాలలను కొత్త హంగులతో తీర్చిదిద్దుతున్నారు. 17,729 బడుల్లో అవసరమైన పనులన్నీ ఈ కమిటీలకు అప్పగించారు. తలుపులు, కిటికీలు, బ్లాక్‌ బోర్డులు, ఎలక్ట్రిక్‌ స్విచ్‌ బోర్డులు, ఫ్యాన్లు, మరుగుదొడ్ల తాత్కాలిక మరమ్మతు పనులను వేసవిలోనే మొదలుపెట్టారు. ఈ పనులకు ప్రభుత్వం రూ.667.25 కోట్లు కేటాయించింది. అందులో రూ.147 కోట్లు ఆయా కమిటీలకు అడ్వాన్సుగా చెల్లించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని