MLC kavitha: రాజకీయ నాయకురాలిననే.. బెయిల్‌ అడ్డుకుంటున్నారు

దిల్లీ మద్యం కేసులో తనను అరెస్టు చేసే విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నిబంధనలను ఉల్లంఘించినందున బెయిల్‌ ఇవ్వాలని భారాస ఎమ్మెల్సీ కవిత దిల్లీ హైకోర్టుకు విజ్ఞప్తిచేశారు.

Updated : 28 May 2024 08:28 IST

సామాన్యులకున్న హక్కులు కూడా ఉండవా
దిల్లీ హైకోర్టులో ఎమ్మెల్సీ కవిత వాదనలు

ఈనాడు, దిల్లీ: దిల్లీ మద్యం కేసులో తనను అరెస్టు చేసే విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నిబంధనలను ఉల్లంఘించినందున బెయిల్‌ ఇవ్వాలని భారాస ఎమ్మెల్సీ కవిత దిల్లీ హైకోర్టుకు విజ్ఞప్తిచేశారు. సుప్రీంకోర్టు తదుపరి ఉత్తర్వులు జారీచేసేంతవరకూ తనకు సమన్లు జారీచేయబోమని అడిషినల్‌ సొలిసిటర్‌ జనరల్‌ సర్వోన్నత న్యాయస్థానానికి వాగ్దానం చేసినా, దాన్ని తుంగలో తొక్కి ఈడీ తనను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. కేవలం రాజకీయ నాయకురాలినన్న కారణంతో ఈడీ తన బెయిల్‌కు అడ్డుపడుతోందని, సామాన్యులకున్న హక్కులుకూడా తనకు ఉండవా? అని ప్రశ్నించారు. తన బెయిల్‌ అప్లికేషన్లను కొట్టివేస్తూ దిల్లీ రౌజ్‌ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌చేస్తూ కవిత దిల్లీ హైకోర్టులో దాఖలుచేసిన పిటిషన్లపై సోమవారం జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం ముందు విచారణ జరిగింది. ఈ సందర్భంగా కవిత తరఫున సీనియర్‌ అడ్వొకేట్‌ విక్రమ్‌ చౌధరి సుదీర్ఘ వాదనలు వినిపించారు. ‘‘నాకు ఈడీ తొలుత 2023 మార్చి 8న సమన్లు జారీచేసింది. అయితే సీబీఐ సీఆర్‌పీసీ సెక్షన్‌ 160 కింద సమన్లు జారీచేసి ఇంటికొచ్చి విచారించినందున మీరూ అలాగే చేయాలని ఈడీని కోరాం. కస్టడీలో ఉన్న వ్యక్తిని ముఖాముఖి విచారించాల్సి ఉన్నందున ఈడీ ఆఫీసుకు రావాల్సిందేనని చెప్పారు. వారు చెప్పింది నమ్మి నేను 2023 మార్చి 11న దిల్లీలోని ఈడీ ఆఫీసుకు వస్తే పొద్దుపోయే వరకూ నన్ను కూర్చోబెట్టారు. ఆ సమయంలో వారు మొబైల్‌ ఫోన్లు అడగడంతో ఇచ్చాను. అందులో వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన విషయాలూ ఉంటాయి. ఫోన్‌ను ఓపెన్‌ చేసే విషయంపై నేను సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేశాను. ఈ కేసు పెండింగ్‌లో ఉండగానే నన్ను హాజరుకావాలని ఒత్తిడి చేయడంతో 2023 మార్చి 20న రెండోసారి ఈడీ ముందు హాజరయ్యాను. 2022 నవంబర్‌లో దాఖలుచేసిన రిమాండ్‌ రిపోర్ట్‌లో నేను ఫోన్లు ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. యాపిల్‌ కొత్త మోడల్‌ వస్తే ఫోన్‌ మార్చుకుంటూ ఉంటాను. నేను కొత్త ఫోన్‌ కొన్నప్పుడల్లా పాత వాటిని మా దగ్గర పనిచేసే ఉద్యోగులకు ఇస్తూ వచ్చాను. 

నాపై వచ్చిన ఆరోపణలను నివృత్తి చేయడానికి ఇదివరకు ఉద్యోగులకు ఇచ్చిన 11 పాతఫోన్లను సేకరించి ఈడీకి ఇచ్చాను. అందులో 4 ఫార్మట్‌ అయ్యాయి. వాటిని తీసుకున్న ఉద్యోగులు ఎందుకు ఫార్మట్‌ చేశారో నాకు తెలియదు. దాంతో నాకు ఎలా సంబంధం ఉంటుంది? ఆ తర్వాత  మార్చి 21న మూడోసారి ఈడీ ముందు హాజరయ్యాను. అరెస్టైన నిందితులతో కూర్చోబెట్టి విచారించాల్సి ఉందని చెప్పి... అలా చేయలేదు. సుప్రీంకోర్టు తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంతవరకూ నాకు సమన్లు జారీ చేయబోమని ఏఎస్‌జీ సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చినా... మార్చి 7న వారు సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌కు లేఖరాసి కవిత దాఖలుచేసిన రిట్‌ పిటిషన్‌ను తక్షణం లిస్ట్‌ చేయాలని పేర్కొన్నారు. ఈ లేఖ కారణంగానే నేను దాఖలుచేసిన పిటిషన్‌ మార్చి15 న లిస్ట్‌ చేశారు. కేసును మార్చి 19కి వాయిదా వేసిన వెంటనే ఈడీ అధికారులు వచ్చి అరెస్ట్‌చేశారు. దీన్ని నేను సుప్రీంకోర్టులో సవాల్‌చేశాను. 2023 సెప్టెంబర్‌లో ఈడీ సుప్రీంకోర్టులో దాఖలుచేసిన అఫిడవిట్‌లో నన్ను నిందితురాలిగా పేర్కొనలేదు. సెప్టెంబర్‌ నుంచి మార్చి మధ్యలో కొత్తగా ఏమీ జరగకపోయినా నన్ను అరెస్ట్‌ చేసి న్యాయప్రక్రియతో ఆడుకుంటున్నారు. కొందరు రాజకీయ నేతలతో చేతులు కలిపి నన్ను పార్టీ మార్చడానికే ఇలా చేశారా? అన్న అనుమానం కలుగుతోంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఇద్దరు పిల్లల తల్లిగా నా పరిస్థితిని గమనించి బెయిల్‌ మంజూరుచేయాలి’’ అని కవిత తరఫున ఆమె న్యాయవాది విక్రమ్‌ చౌధరి వివరించారు. మంగళవారం ఈడీ తన వాదనలు వినిపించనుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని