శ్రీనివాసరావు ఎలా తెలుసు.. అతనితో ఉన్న బంధం ఏమిటి?

నకిలీ సీబీఐ అధికారి కొవ్విరెడ్డి శ్రీనివాసరావు కేసులో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారులు 8.30 గంటల పాటు విచారించారు.

Updated : 02 Dec 2022 08:16 IST

నకిలీ అధికారి వ్యవహారంలో.. మంత్రి గంగుల, ఎంపీ రవిచంద్రలకు ప్రశ్నలు

ఈనాడు, దిల్లీ: నకిలీ సీబీఐ అధికారి కొవ్విరెడ్డి శ్రీనివాసరావు కేసులో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారులు 8.30 గంటల పాటు విచారించారు. దిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాలయంలో గురువారం ఉదయం 11.30 గంటలకు విచారణ ప్రారంభించిన అధికారులు రాత్రి 8 గంటల వరకు కొనసాగించారు. సీబీఐ అధికారినంటూ పలువురిని మోసగించిన కేసులో విశాఖపట్నానికి చెందిన కొవ్విరెడ్డి శ్రీనివాసరావును గత శనివారం సీబీఐ అధికారులు దిల్లీలో అరెస్టు చేశారు. ఆయన ఫోన్‌లో ఉన్న కాల్‌ లిస్ట్‌, ఫొటోల ఆధారంగా మంత్రి గంగుల కమలాకర్‌, ఎంపీ వద్దిరాజు రవిచంద్రలకు సీబీఐ బుధవారం నోటీసులు జారీ చేసింది. గురువారం విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొనడంతో వారిరువురూ దిల్లీ వచ్చారు. సీబీఐ కేంద్ర కార్యాలయంలో సీబీఐ ఎస్పీ (అవినీతి నిరోధక శాఖ) షయాలి తురత్‌, మరో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు వారిని విచారించారు. కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాసరావు, అతని బాధితులైన మరికొందరిని విచారణ సమయంలో హాజరుపర్చారు.

‘మంత్రి, ఎంపీని గుర్తుపట్టారా?’ అని శ్రీనివాసరావును ప్రశ్నించగా..‘గుర్తుపట్టాను’ అని అతను బదులిచ్చినట్టు సమాచారం. అనంతరం మంత్రి, ఎంపీ..శ్రీనివాసరావుతో కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలు, సీసీ కెమెరాల్లో వారు మాట్లాడుకుంటున్న దృశ్యాలతోపాటు సేకరించిన డాటాను విచారణాధికారులు వారి ఎదుట ఉంచారు. ‘శ్రీనివాసరావు మీకు ఎలా తెలుసు? ఆయన మొబైల్‌లో మీ ఫోన్‌ నంబరు ఎందుకు ఉంది? ఫొటోలు ఎక్కడ తీసుకున్నారు? అతనితో ఉన్న సంబంధం ఏమిటి? అంటూ ఇద్దర్నీ వేర్వేరుగా ప్రశ్నించారు. ‘‘వారం క్రితం ఓ మున్నూరుకాపు సమావేశంలో శ్రీనివాసరావును కలిశాం. మొత్తంగా రెండుసార్లు కలుసుకున్నాం. మున్నూరు కాపు బిడ్డగా, ఐపీఎస్‌ అధికారిగా భావించి మాటకలిపాం తప్ప ఆయనతో ఎలాంటి లావాదేవీలు జరపలేదని’’ మంత్రి బదులిచ్చినట్టు సమాచారం. అనంతరం శ్రీనివాసరావును అధికారులు క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేయగా, ఆయన కూడా మున్నూరు కాపు సంఘం సమావేశానికి వెళ్లినట్టు అంగీకరించారని తెలిసింది. విచారణ అనంతరం వారి వాంగ్మూలాలను అధికారులు నమోదుచేశారు. సంతకాల అనంతరం మంత్రి, ఎంపీలను పంపించి వేశారు.

డబ్బులు ఇచ్చామన్నది అవాస్తవం: మంత్రి గంగుల

విచారణ సమయంలో వాస్తవాలే చెప్పామని మంత్రి గంగుల కమలాకర్‌ విచారణ అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ తెలిపారు. నోటీసు ఇచ్చిన తర్వాత ఒక్క రోజే గడువు ఇచ్చినప్పటికీ చట్టాలు, న్యాయంపై గౌరవంతో విచారణకు హాజరయ్యామన్నారు. శ్రీనివాసరావుకు డబ్బులు ఇవ్వజూపామంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. సాక్షులుగా పిలిచినందున 161 స్టేట్‌మెంట్‌ను అధికారులు నమోదుచేశారన్నారు. మళ్లీ విచారణకు పిలిచారా? అని ప్రశ్నించగా లేదన్నారు. ఇదే తుది విచారణ అని అధికారులు తమతో చెప్పారన్నారు. ఈ కేసులో ఇద్దరం సాక్షులం మాత్రమేనని ఎంపీ రవిచంద్ర తెలిపారు. శ్రీనివాసరావుకు తాము బంగారం కొనిచ్చినట్టు సాగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని