Padma awards 2023: తెలుగింట ‘పద్మా’ల పంట

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో తెలుగు రాష్ట్రాలకు పెద్దపీట దక్కింది. రెండు రాష్ట్రాలకు కలిపి మొత్తంగా 12 పద్మ అవార్డులు వరించాయి.

Updated : 26 Jan 2023 08:20 IST

ఎస్‌.ఎం.కృష్ణ, జాకీర్‌ హుసేన్‌ సహా ఆరుగురికి పద్మ విభూషణ్‌
చినజీయర్‌ స్వామి, కమలేష్‌ డి.పటేల్‌కు పద్మభూషణ్‌
కీరవాణి సహా ఏపీలో ఏడుగురికి.. తెలంగాణలో ముగ్గురికి పద్మశ్రీలు

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో తెలుగు రాష్ట్రాలకు పెద్దపీట దక్కింది. రెండు రాష్ట్రాలకు కలిపి మొత్తంగా 12 పద్మ అవార్డులు వరించాయి. దేశవ్యాప్తంగా మొత్తం 91 పద్మశ్రీలు ప్రకటించగా.. ఇందులో తెలుగువారి వాటా పది కావడం విశేషం. అలాగే ఆధ్యాత్మిక రంగం నుంచి చినజీయర్‌ స్వామి, కమలేష్‌ డి.పటేల్‌లను పద్మభూషణ్‌ పురస్కారాలు వరించడం ముదావహం.


పద్మవిభూషణ్‌లు

ఈనాడు, దిల్లీ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం బుధవారం 106 ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించింది. విభిన్న రంగాల్లో సేవలందించిన ఆరుగురికి పద్మ విభూషణ్‌, 9 మందికి పద్మభూషణ్‌, 91 మందికి పద్మశ్రీలు దక్కాయి. దేశ అత్యున్నత పురస్కారమైన ‘భారతరత్న’కు ఈ జాబితాలో ఎవరినీ ఎంపిక చేయలేదు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్‌.ఎం.కృష్ణ, ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ములాయంసింగ్‌ యాదవ్‌ (దివంగత), ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్‌ హుసేన్‌, రెండు రోజుల క్రితం కన్నుమూసిన ప్రఖ్యాత వాస్తుశిల్పి బాలకృష్ణ దోషీ, ఓఆర్‌ఎస్‌ సృష్టికర్త దిలీప్‌ మహాలనబిస్‌ (దివంగత), అమెరికాకు చెందిన ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త శ్రీనివాస్‌ వర్ధన్‌లను పద్మ విభూషణ్‌కు ఎంపిక చేశారు. తెలంగాణకు చెందిన ప్రముఖ ఆద్యాత్మికవేత్త చినజీయర్‌ స్వామి, రామచంద్ర మిషన్‌ అధ్యక్షుడు కమలేశ్‌ డి.పటేల్‌తోపాటు ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి, ప్రముఖ సినీగాయని వాణీ జయరాంలను పద్మభూషణ్‌ అవార్డు వరించింది. అలాగే ఆదిత్యబిర్లా గ్రూప్‌ అధిపతి కుమార్‌ మంగళం బిర్లా, కర్ణాటకకు చెందిన తత్వవేత్త, నవలా రచయిత ఎస్‌.ఎల్‌.భైరప్ప, పుణె ఐఐఎస్‌ఈఆర్‌ ఫిజిక్స్‌ ప్రొఫెసర్‌ దీపక్‌ధార్‌, హిందీ సినిమాల నేపథ్య గాయని సుమన్‌ కల్యాణ్‌పుర్‌, జేఎన్‌యూ ఇంగ్లిష్‌ ప్రొఫెసర్‌ కపిల్‌ కపూర్‌లకూ పద్మభూషణ్‌ ప్రకటించారు. కళ, సామాజికసేవ, ప్రజా వ్యవహారాలు, సైన్స్‌, ఇంజినీరింగ్‌, వ్యాపారం, పరిశ్రమ, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, పౌరసేవల్లో విశేష సేవలు అందించినవారిని ఈ పురస్కారాలకు ఎంపిక చేశారు. మార్చి లేదా ఏప్రిల్‌ నెలలో రాష్ట్రపతి భవన్‌లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ అవార్డులు ప్రదానం చేస్తారు. మొత్తం 106 అవార్డుల్లో మూడు జంటగా ఇచ్చారు. పురస్కారాలు పొందినవారిలో 19 మంది మహిళలు, ఇద్దరు విదేశీయులు ఉన్నారు. ఏడుగురికి మరణానంతరం ఈ అవార్డులు ప్రకటించారు. మొత్తం అవార్డుల్లో అత్యధికంగా మహారాష్ట్రకు 12, కర్ణాటక 8, గుజరాత్‌ 8, ఉత్తర్‌ప్రదేశ్‌ 8, ఏపీ 7, తెలంగాణ 5, తమిళనాడు 5, పశ్చిమబెంగాల్‌ 4, దిల్లీ 4, ఒడిశా 4, బిహార్‌ 3, అస్సాం 3, రాజస్థాన్‌ 3, ఛత్తీస్‌గఢ్‌ 3, మధ్యప్రదేశ్‌కు 3 దక్కాయి. మిగతా రాష్ట్రాల నుంచి ఇద్దరు లేదా ఒకరు విజేతలున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 10 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కగా.. ఇందులో సినీ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి కూడా ఉన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త రాకేశ్‌ ఝున్‌ఝున్‌ వాలా (దివంగత), సినీనటి రవీనా టాండన్‌లకు కూడా పద్మశ్రీ ప్రకటించారు. అవార్డు విజేతలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు.


పద్మ భూషణులు


పద్మశ్రీలు


పద్మవిభూషణులు...
ములాయంసింగ్‌ యాదవ్‌

వర్తమాన రాజకీయాల్లో మట్టిమనిషిగా పేరొందిన నేత ఈయన. అత్యంత సాధారణ కుటుంబం నుంచి వచ్చి రాజకీయాల్లో అత్యున్నత శిఖరాలకు చేరుకున్నారు. 1939 నవంబరు 22న ఉత్తర్‌ప్రదేశ్‌లోని సఫాయ్‌ గ్రామంలో జన్మించిన ఈయన అంచెలంచెలుగా ఎదిగి యూపీ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా పనిచేశారు. రామ్‌మనోహర్‌ లోహియా శిష్యుడిగా పేరున్న ఈయన ఆయన నేర్పిన సామ్యవాద స్ఫూర్తితో సమాజ్‌వాదీ పేరుతో సొంత పార్టీ ఏర్పాటుచేసి ఉత్తర్‌ప్రదేశ్‌లో బలహీనవర్గాలకు రాజ్యాధికారాన్ని చేరువచేయడంలో కీలకపాత్ర పోషించారు. 1967లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన ఆయన గత ఏడాది అక్టోబర్‌ 10న తుదిశ్వాస విడిచేవరకూ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా, 5సార్లు ఎంపీగా, ఒకసారి కేంద్రమంత్రిగా పనిచేశారు. 1992 నుంచి 2017వరకు సమాజ్‌వాదీపార్టీ అధ్యక్షుడిగా కొనసాగారు. 2012లో కుమారుడు అఖిలేశ్‌ను ముఖ్యమంత్రిని చేసిన ఆయన గత అక్టోబరులో అనారోగ్యంతో కన్నుమూశారు.


రాజకీయ దురంధరుడు.. ఎస్‌ఎం కృష్ణ

ఎస్‌ఎం కృష్ణగా పేరుపొందిన సోమనహళ్లి మల్లయ్య కృష్ణ కర్ణాటక రాజకీయాల్లో తలపండిన నేత. 1932 మే 1న మండ్య జిల్లాలోని మద్దూరు తాలూకాలో జన్మించారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా, మహారాష్ట్ర గవర్నర్‌గా, కేంద్రమంత్రిగా పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉంది. 1971 నుంచి 2014 వరకు క్రియాశీలక రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. సుదీర్ఘకాలం కర్ణాటకలో కాంగ్రెస్‌కు పెద్దదిక్కుగా కొనసాగిన ఆయన తర్వాత భాజపాలో చేరారు. ఇటీవలే క్రియాశీలక రాజకీయాలనుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈఏడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్న తరుణంలో ఈ వక్కలిగ నేతకు పద్మవిభూషణ్‌ ప్రకటించారు.


ఎస్‌ఆర్‌ శ్రీనివాస్‌ వర్ధన్‌

ఈయన పూర్తిపేరు శాంతమంగళం రంగ అయ్యంగార్‌ శ్రీనివాస్‌ వర్ధన్‌. 1940 జనవరి 2న మద్రాస్‌ రాష్ట్రంలో జన్మించారు. ప్రస్తుతం అమెరికాలో స్థిరపడ్డారు. 20వ శతాబ్దంలో అత్యంత ప్రభావశీలమైన గణిత నిపుణుడిగా పేరొందారు. సంభావ్య సిద్ధాంతం (ప్రాబబిలిటీ థియరీ)కి ఈయన మారుపేరు. 2007లో ఏబుల్‌ ప్రైజ్‌ గెలుచుకొని ఆ గౌరవం పొందిన తొలి ఆసియా వాసిగా కీర్తిగడించారు. మద్రాస్‌ ప్రెసిడెన్సీ కాలేజ్‌, కోల్‌కతాలోని ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో విద్యాభ్యాసం చేశారు. ఈ సంస్థలో 1956 నుంచి 1963 మధ్యకాలంలో ఫేమస్‌ఫోర్‌గా పేరొందిన నలుగురిలో ఆర్‌.రంగారావు, కె.ఆర్‌.పార్థసారథి, వీరవల్లి ఎస్‌.వరదరాజన్‌లతోపాటు ఈయనా ఉన్నారు.


దిలీప్‌ మహాలనబిస్‌

ఈయన సులువుగా, తక్కువ ఖర్చుతో, సమర్థంగా పనిచేసే ఓఆర్‌ఎస్‌ వినియోగాన్ని ప్రపంచవ్యాప్తం చేయడం ద్వారా ఐదు కోట్ల ప్రాణాలను కాపాడారు. అతిసార, కలరా వల్ల తలెత్తే మరణాలు 93% మేర తగ్గడానికి ఓఆర్‌ఎస్‌ మార్గం చూపింది.


బాలకృష్ణ విఠల్‌దాస్‌ దోషీ

భారత వాస్తుశిల్పుల్లో పేరెన్నికగన్న ఈయన 1927 ఆగస్టు 26న బ్రిటిష్‌ ఇండియాలోని బాంబే ప్రెసిడెన్సీ పుణేలో జన్మించారు. ఈనెల 24న తుదిశ్వాస విడిచారు. భారత్‌లో ఆర్కిటెక్చర్‌ రంగం అభివృద్ధిలో ఈయన అత్యంత కీలకపాత్ర పోషించారు. చండీగఢ్‌ నగర రూపకర్త లీకారబూసియర్‌, లూయిస్‌ కాన్‌ల దగ్గర పనిచేసిన అనుభవం ఉంది. ఫ్లేమ్‌ యూనివర్సిటీ, బెంగళూరు, ఉదయ్‌పుర్‌ ఐఐఎం, దిల్లీలోని ఎన్‌ఐఎఫ్‌టీ, సీఈపీటీ వర్సిటీ, ఇందౌర్‌లో తక్కువ ఖర్చుతో కూడిన ఇళ్ల నిర్మాణ నమూనాలు రూపొందించారు.  2018లో ప్రిట్జ్‌కర్‌ ఆర్కిటెక్చర్‌ ప్రైజ్‌ గెలుచుకున్న తొలి భారతీయుడు. 


జాకీర్‌ హుసేన్‌

ఈయన జగమెరిగిన తబలా విద్వాంసుడు. 1951 మార్చి 9న బాంబేలో జన్మించిన ఈ 71 ఏళ్ల సంగీతకారుడు హిందుస్థానీ సంగీతంలో అత్యున్నత శిఖరాలకు చేరుకున్నారు. ప్రముఖ తబలా విద్వాంసుడు అల్లారఖా పెద్దకుమారుడు ఈయన. తండ్రి ద్వారా వారసత్వంగా వచ్చిన సంగీతాన్ని సమున్నత శిఖరాలకు తీసుకెళ్లి ప్రపంచ ప్రఖ్యాతిగాంచారు. ఈయన నటుడు కూడా. వాహ్‌తాజ్‌ అంటూ తాజ్‌మహల్‌ టీకి ఈయన చేసిన వాణిజ్యప్రకటన ప్రజల మనసుల్లో నిలిచిపోయింది. 1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్‌ సొంతం చేసుకున్నారు.


పద్మభూషణులు...
చినజీయరు స్వామికి తగిన గుర్తింపు

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు... సమతామూర్తి విగ్రహ రూపశిల్పి చినజీయర్‌స్వామికి కేంద్రం పద్మభూషణ్‌ అవార్డు ప్రకటించింది. 1956వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆయన జన్మించారు. 1980లో త్రిదండి సన్యాసిగా దీక్షను స్వీకరించిన అనంతరం త్రిదండి చిన శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌ స్వామీజీ అయ్యారు. చినజీయర్‌ స్వామి 1981లో నడిగడ్డపాలెంలోని శ్రీమద్‌ఉభయ వేదాంత ఆచార్య పీఠానికి అధిపతి అయ్యారు. జీయర్‌స్వామి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు విద్యనందించేందుకు జీయర్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌, వికాస తరంగిణిలను ఏర్పాటు చేశారు. విజయవాడ కేంద్రంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. రెండు దశాబ్దాల క్రితం శంషాబాద్‌లో శ్రీరామనగర్‌లో జీవాశ్రమం పేరుతో ఆశ్రమాన్ని నిర్మించారు. దివ్య సాకేతం పేరుతో ఆలయాన్ని ప్రారంభించారు.


ధ్యాన గురువు దాజీకీ ఉన్నత పురస్కారం

ప్రపంచవ్యాప్తంగా హార్ట్‌పుల్‌నెస్‌ మేడిటేషన్‌ గైడ్‌గా, హార్ట్‌ఫుల్‌నెస్‌ ఇన్‌స్టిట్యూట్‌, హార్ట్‌ఫుల్‌నెస్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకుడిగా, సహజ్‌ మార్గ్‌ స్పిరిచ్యువాలిటీ ఫౌండేషన్‌ మేనేజింగ్‌ ట్రస్టీగా ఉన్న ప్రఖ్యాత ధ్యాన గురువు, శ్రీరామ్‌చంద్ర మిషన్‌ అధ్యక్షుడు కమలేష్‌ డి పటేల్‌కు కేంద్రం పద్మభూషణ్‌ అవార్డు ప్రకటించింది. దాజీ(పెద్దన్న) అని పిలుచుకునే కమలేష్‌ డి పటేల్‌ గుజరాత్‌లో 1956లో జన్మించారు. ఫార్మసీ విద్యార్థిగా ఉన్న సమయంలోనే రాజయోగ ధ్యానం  మొదలెట్టారు. గురువు రామ్‌చంద్ర (బాపూజీ) దగ్గర 1976 నుంచి సాధన ఆరంభించారు. అహ్మదాబాద్‌లో ఫార్మసీలో గ్రాడ్యుయేషన్‌ చేశాక న్యూయార్క్‌ పీజీ చేసి అక్కడే ఫార్మా వ్యాపారం ప్రారంభించారు. భార్య, ఇద్దరు పిల్లలతో కొంతకాలం అక్కడే ఉన్నారు. 1983లో రామ్‌చంద్ర మరణంతో అధ్యక్షుడిగా పార్థసారథి రాజగోపాలాచారి(చారిజీ) బాధ్యతలు చేపట్టారు. ఆయనతో కలిసి 2003 నుంచి శ్రీరామ్‌చంద్ర మిషన్‌ కార్యకలాపాల్లో భాగస్వామి అయ్యారు. 2014 నుంచి శ్రీరామ్‌చంద్ర మిషన్‌ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. భారత్‌తో పాటు అమెరికాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఆయన ఆధ్యాత్మిక కార్యశాలలు నిర్వహించారు. ఆయన రాసిన ది హార్ట్‌ఫుల్‌నెస్‌ వే పుస్తకానికి విశేష ఆదరణ లభించింది.  రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలో చెగూరులో 1400 ఎకరాల్లో శ్రీరామ్‌చంద్ర మిషన్‌ (కన్హా శాంతివనం) విస్తరించి ఉంది.


సుధామూర్తి సేవలకు గుర్తింపు

ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ సుధామూర్తి సేవాతత్పరతలో సుప్రసిద్ధులు. రచయిత్రిగా, విద్యావేత్తగా, వితరణశీలిగా దేశ ప్రజలకు సుపరిచితులు. ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకులైన ఎన్‌.ఆర్‌.నారాయణమూర్తి ఆమె జీవిత భాగస్వామి. ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌లో వృత్తి జీవితాన్ని ప్రారంభించిన సుధామూర్తి పలు అనాథాశ్రయాలను నెలకొల్పారు. గ్రామీణాభివృద్ధికి, విద్యావ్యాప్తికి కృషి చేస్తున్నారు. కర్ణాటకలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్‌, గ్రంథాలయ వసతులు కల్పించారు.


ప్రసిద్ధ నవలా రచయిత...ఎస్‌.ఎల్‌.భైరప్ప

కర్ణాటకకు చెందిన ఎస్‌.ఎల్‌.భైరప్ప (91) నవలా రచయిత, ఆధ్యాత్మికవేత్త. కన్నడలో ఆయన రచించిన పలు నవలలు విశేష పాఠకాదరణను పొందాయి. గతంలో పద్మశ్రీ, సాహిత్య అకాడమీ అవార్డులను అందుకున్నారు. ఉన్నత పాఠశాల విద్యార్థిగా ఉన్న సమయంలో చదువును మధ్యలోనే వదిలేసి ముంబయి వెళ్లి రైల్వే కూలీగా పనిచేశారు. సాధువుల ప్రేరణతో ఆధ్యాత్మిక బాటపట్టారు. కొన్ని నెలల తర్వాత మైసూర్‌ తిరిగి వచ్చి విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. మైసూర్‌ విశ్వవిద్యాలయంలో ఎం.ఏ(తత్వశాస్త్రం)లో బంగారు పతకాన్ని సాధించారు.


భౌతికశాస్త్రంలో అసమాన ప్రతిభావంతులు... దీపక్‌ ధర్‌

పుణేలోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌లో భౌతికశాస్త్రవేత్త అయిన ప్రొఫెసర్‌ దీపక్‌ ధర్‌(72)...అంతర్జాతీయంగా గుర్తింపుపొందిన నిపుణులు. 1951లో యూపీలోని ప్రతాప్‌గఢ్‌లో జన్మించారు. ఉన్నత విద్యాభ్యాసం ఐఐటీ కాన్పుర్‌, అమెరికాలోని కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో కొనసాగింది. గతంలో ముంబయిలోని టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటర్‌ రీసెర్చ్‌లో పనిచేశారు. దేశంలో అత్యున్నత సైన్స్‌ పురస్కారమైన శాంతి స్వరూప్‌ భట్నాగర్‌ అవార్డును 1991లో స్వీకరించారు. స్టాటిస్టికల్‌ ఫిజిక్స్‌లో అంతర్జాతీయ స్థాయి బోల్‌ట్జ్‌మన్‌ పతకాన్ని 2022లో అందుకున్నారు. ఈ పురస్కారాన్ని పొందిన తొలి భారతీయుడిగా నిలిచారు.


మధుర గాయని...సుమన్‌ కళ్యాణ్‌పుర్‌

దేశంలో ప్రముఖ నేపథ్య గాయకులలో ఒకరైన సుమన్‌ కళ్యాణ్‌పుర్‌(86) 1937 జనవరి 28న ఢాకాలో జన్మించారు. ఆమె తండ్రి శంకరరావు హెమాడి స్వస్థలం కర్ణాటకలోని మంగళూరు అయినప్పటికీ ఉద్యోగ బాధ్యతల దృష్ట్యా చాలా కాలం ఢాకాలో ఉన్నారు. 1943లో ఆ కుటుంబం ముంబయికి వచ్చింది. తన గాన మాధుర్యంతో 1960, 1970లలో శ్రోతలను మైమరిపించారు సుమన్‌. హిందీ, మరాఠీ, అస్సామీ, గుజరాతీ, కన్నడ, మైథిలీ, భోజ్‌పురీ, రాజస్థానీ, బెంగాలీ, ఒడియా, పంజాబీ భాషల్లోని సినిమాలకు పాటలు పాడారు.


భాషావేత్త...కపిల్‌కపూర్‌

జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి అయిన కపిల్‌ కపూర్‌ 1940 నవంబరులో జన్మించారు. సినీ నటుడు, నిర్మాత కమల్‌కపూర్‌ తనయుడు కపిల్‌.  భారతీయ మేధో సంప్రదాయాలపై గట్టిపట్టున్న ఆయన భాషావేత్తగా, సాహితీవేత్తగా ప్రసిద్ధులు. 2012లో ప్రచురితమైన ‘ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ హిందూయిజమ్‌’కు ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌గా వ్యవహరించారు. ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీ(ఐఐఏఎస్‌)కు 2018లో ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు.


పద్మశ్రీలు
గోదావరి తీరం.. కీరవాణి సంగీతానికి పునాది

కొవ్వూరు పట్టణం, న్యూస్‌టుడే: గలగల పారే గోదావరి తీరాన పుట్టిన ఆయనకు.. సంగీతం ఆరో ప్రాణమైంది. పద్మశ్రీ సాధనకు పునాదైంది. పశ్చిమగోదావరి నుంచి తూర్పుగోదావరి జిల్లాలో కలిసిన కొవ్వూరు.. కోడూరి మరకతమణి కీరవాణి (ఎంఎం కీరవాణి) స్వస్థలం. 1961 జులై 4న శివశక్తి దత్త, భానుమతి దంపతులకు ఆయన జన్మించారు. తండ్రికి చిత్రలేఖనం, సంగీతం, కథలు, సాహిత్యాభిష ఉండటంతో సినిమాల వైపు దృష్టి మరలింది. ఈ నేపథ్యంలో ఎల్వీ ప్రసాద్‌ వద్ద సహాయకునిగా చేరి మళ్లీ కొవ్వూరు వచ్చి వ్యవసాయం, వ్యాపారం చేసినా అనుకున్న స్థాయిలో రాణించలేదు. దీంతో కర్ణాటకలోని రాయచూర్‌ వెళ్లి అక్కడే పెళ్లి చేసుకున్నారు. శివదత్త రాయచూరులో ఉండటంతో కీరవాణి కొవ్వూరులోని బాబాయి చంద్రబోస్‌ వద్ద కొన్నాళ్లు ఉన్నారు. కొవ్వూరులోనే ప్రాథమికవిద్య చదివారు. ఇంటికి దగ్గరలోనే ఉన్న కవితపు సీతన్న అనే విద్వాంసుని వద్ద వయోలిన్‌ నేర్చుకున్నారు. ఏ సినిమాలో పాట విన్నా, రేడియోలో సంగీతం వచ్చినాఆ రాగాన్ని, సంగీతాన్ని పట్టేసి ఆశ్చర్యపరిచేవారని స్థానికులు చెబుతున్నారు.


ప్రకాష్‌చంద్రసూద్‌కు గుర్తింపు

పుట్టపర్తి, న్యూస్‌టుడే: సత్యసాయి విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేస్తున్న ప్రకాష్‌చంద్రసూద్‌ సేవలను గుర్తించి కేంద్రప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. పంజాబ్‌లో 1928లో సామాన్య కుటుంబంలో జన్మించారు. ఆయన విద్యాభ్యాసం పంజాబ్‌లో కొనసాగించి, అమెరికాలో పీహెచ్‌డీ చేశారు. 1969 నుంచి 1988 వరకు వారణాసిలోని బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేశారు. 1988లోనే పదవీవిరమణ పొందారు. ముంబయిలోని భాభా అణుపరిశోధన కేంద్రంలో 1998 నుంచి 1999 వరకు పనిచేశారు. సత్యసాయిబాబా సూచన మేరకు 1998 నుంచి సత్యసాయి విశ్వవిద్యాలయంలో విద్యాబోధనతోపాటు పరిశోధన అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. ప్రత్యేకంగా న్యూక్లియర్‌ ఫిజిక్స్‌ ఎడ్యుకేషన్‌ రంగంలో ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన భారతదేశంలోని అత్యంత సీనియర్‌ అణుశాస్త్రవేత్తలలో ఒకరు. భార్య ఉషారాణితో పాటు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు. నేటికీ అధ్యాపకులుగా పనిచేస్తున్నారు.


హస్తకళలకు ప్రాణం పోసిన సీవీ రాజు

ఈనాడు డిజిటల్‌, అనకాపల్లి: లక్కబొమ్మల తయారీలో ప్రఖ్యాత కళాకారుడు చింతలపాటి వెంకటపతి రాజు (సీవీ రాజు). హస్తకళలను బతికించేందుకు చాలా కృషిచేశారు. ఈయన పదోతరగతి పూర్తిచేసే సమయానికి ప్రస్తుత అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం ఏటికొప్పాకలో పేరున్న హస్తకళాకారులు కళకు ఆదరణ లేక గ్రామాన్ని విడిచి కూలి పనులకు వలసపోయేవారు. ఇది చూసిన ఆయన.. ఏటికొప్పాక పేరును తిరిగి నిలబెట్టాలని లక్కబొమ్మల పరిశ్రమపై దృష్టిసారించారు. దిల్లీ వెళ్లి అధ్యయనాలు చేశారు. 1999లో ఏటికొప్పాకలో హస్తకళా నిలయాన్ని ఏర్పాటుచేసి కళాకారులకు ఆధునిక బొమ్మల తయారీపై శిక్షణ ఇచ్చారు. వారు తయారుచేసిన బొమ్మలకు వారే ధర నిర్ణయించుకునేలా చేశారు.  పసుపు, ఇండిగో పిక్కలు, జాప్రా, కరక్కాయి తదితరాలతో ప్రకృతిసిద్ధమైన రంగుల తయారీకి శ్రీకారం చుట్టారు.


35 రకాల ఆర్కిడ్‌ మొక్కల అన్వేషకుడు

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన డాక్టర్‌ అబ్బారెడ్డి నాగేశ్వరరావు (69)కు సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో పద్మశ్రీ పురస్కారం లభించింది. ఆయన ఆర్కిడ్‌ జాతికి చెందిన 35 రకాల మొక్కలను కనుగొన్నారు. మణిపుర్‌లోని సెంటర్‌ ఫర్‌ ఆర్కిడ్‌ జీన్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ ఈస్ట్రన్‌ హిమాలయన్‌ రీజియన్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన నాగేశ్వరరావు 2012లో పదవీవిరమణ చేశారు. ఈశాన్యరాష్ట్రాల్లో ఆయన దశాబ్దాల పాటు సేవలందించారు. ఈయన పరిశోధనలకు గుర్తింపుగా రెండు ఆర్కిడ్‌ జాతి మొక్కలకు ఆయన పేరు పెట్టారు.


హరికథకు పెట్టని ‘కోట’

ఈనాడు, అమరావతి: ప్రముఖ హరికథకుడు కోట సచ్చిదానందశాస్త్రికి పద్మశ్రీ పురస్కారం లభించింది. రామాయణ, మహాభారత ఇతిహాసాలు, అష్టాదశ పురాణాల్లోని ఆసక్తికర అంశాలను హరికథా రూపంలోకి తెచ్చి జనాకర్షకంగా చెప్పిన ఘనత కోట సచ్చిదానందశాస్త్రికి దక్కుతుంది. ఈయన తన హరికథల ద్వారా సామాజిక రుగ్మతలు పోగొట్టేలా చైతన్యపరిచేవారు.  ఆ రోజుల్లో ఆయన కథ వినడానికి ఎడ్లబండ్లు కట్టుకుని గుంటూరుకు వచ్చేవారు. హరికథా భాగవతార్‌గా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ప్రసిద్ధులు. 1960 నుంచి 1980 వరకు రేడియోలో వేల ప్రదర్శనలు ఇచ్చారు.


గిరిజన భాషలకూ గుర్తింపు... రామకృష్ణారెడ్డి

గిరిజన భాషలకు కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దపీట వేయాలంటున్నారు ఆచార్య బి.రామకృష్ణారెడ్డి. కేంద్ర ప్రభుత్వం బుధవారం రాత్రి ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలానికి చెందిన ఆయన వయసు 80 సంవత్సరాలు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయానికి రిజిస్ట్రార్‌గానూ వ్యవహరించారు.  గిరిజన భాషలైన కువి, మండలపై విస్తృత పరిశోధన చేశారు.  గిరిజన భాషలను కూడా అధికార భాషలుగా గుర్తించాలన్నారు.దేశంలో 200 భాషలుంటే అందులో 50 వరకు గిరిజన భాషలున్నాయని తెలిపారు. మైసూరు సీఐఐఎల్‌లో పనిచేసినప్పుడు తనకు గిరిజన భాషలపై పరిశోధనలు చేయాలన్న ఆసక్తి కలిగిందన్నారు.


రైతు పరిశోధనలు ఫలవంతం.. విజయ్‌ గుప్తా

దేశంలో నీలి విప్లవం తీసుకురావడంలో కీలకపాత్ర పోషించి చేపల ఉత్పత్తి పెరగడంలో విశేష కృషి చేసిన మత్స్య శాస్త్రవేత్త మోదడుగు విజయగుప్తాకు పద్మ పురస్కారం ప్రకటించింది. విజయగుప్తా బాపట్లలో 1939 ఆగస్టు 17న జన్మించారు. ఆంధ్రావిశ్వవిద్యాలయం ఉంచి బీఎస్సీ, బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం నుంచి ఎమ్మెస్సీ,  కోల్‌కతా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్‌ పొందారు. పంత్‌ యూనివర్సిటీ ఆఫ్‌ అగ్రికల్చర్‌, టెక్నాలజీ, సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ ఎడ్యుకేషన్‌లో డాక్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ డిగ్రీని పొందారు. పదవీ విరమణ అనంతరం గ్లోబల్‌ ఫిషరీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (వరల్డ్‌ ఫిష్‌)లో సహాయ డైరెక్టర్‌ జనరల్‌గా పనిచేశారు. కేంద్రం, ఉమ్మడి ఏపీతో పాటు తెలంగాణ ప్రభుత్వంలో మత్స్యశాఖల సాంకేతిక సలహాదారుగా పనిచేశారు.


సేవాశిఖరం.. సంకురాత్రి

ఈనాడు-కాకినాడ: డాక్టర్‌ చంద్రశేఖర్‌ సంకురాత్రి.. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా సింగరాయకొండలో 1943 నవంబరు 20న జన్మించారు. రాజమహేంద్రవరంలో ప్రాథమిక, కళాశాల విద్య చదివారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జువాలజీలో పీజీ చేసి, కెనడాలో ఆల్బెట్టా విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ పొందారు.1985 జూన్‌ 23న భార్య మంజరి, ఇద్దరు పిల్లలతో కెనడా నుంచి దిల్లీకి వస్తున్న విమానాన్ని ఖలిస్థాన్‌ వేర్పాటువాదులు పేల్చేశారు. ఈ దారుణఘటన చంద్రశేఖర్‌ జీవితాన్ని కుదిపేసింది. తర్వాత కెనడాలో 22 ఏళ్ల జీవనప్రస్థానాన్ని, ఉద్యోగాన్ని వదిలి భారతదేశానికి తిరిగొచ్చి, సంకురాత్రి ఫౌండేషన్‌ స్థాపించారు.1992లో 25మందితో మొదలైన సాయంత్రం పాఠశాల ఇప్పుడు శారదా విద్యాలయంగా ఎందరికో విద్య అందిస్తోంది.


చిరుధాన్యాల నిపుణుడు.. ఖాదర్‌వలీకి పురస్కారం

చిరుధాన్యాల ఉపయోగాలు, వాటి వినియోగం గురించి తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ... వాటిని ప్రోత్సహిస్తున్న డాక్టర్‌ ఖాదర్‌ వలీని పద్మశ్రీ పురస్కారం వరించింది. ఆంధ్రప్రదేశ్‌లోని వైయస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరులో జన్మించిన ఆయన.. బీఎస్సీ, ఎంఎస్సీ (ఎడ్యుకేషన్‌) మైసూరులోని రీజినల్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌లో చదివారు. అమెరికాలోని డ్యూపాంట్‌ కంపెనీలోనూ పని చేశారు. అంతరించిపోతున్న 5 రకాల చిరుధాన్యాలైన కొర్రలు, అండుకొర్రలు, సామలు, అరికెలు, ఊదల పునరుద్ధరణకు కృషి చేశారు.


45ఏళ్ల సేవలకు గుర్తింపు
డాక్టర్‌ పసుపులేటి హన్మంతరావు

పిల్లల వైద్యనిపుణుడు పసుపులేటి హన్మంతరావు 1945 సెప్టెంబరు 16న హైదరాబాద్‌ పాతనగరంలో జన్మించారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో 1970లో ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. 1975లో ఎండీ పూర్తి చేశారు. 2002లో పీహెచ్‌డీ చేశారు. పిల్లల వైద్యునిగా పనిచేసిన ఆయన క్రమేపీ మానసిక వైకల్యం గల పిల్లలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. దీని కోసం సేవలందించేందుకు తాను వ్యవస్థాపక ఛైర్మన్‌గా స్వీకార్‌ మల్టిస్పెషాలిటీ రిహాబిలిటేషన్‌ సెంటర్‌ వ్యవస్థాపక ఛైర్మన్‌గా పనిచేశారు. లక్షల మంది దివ్యాంగ పిల్లల వైద్యునిగా విశేష సేవలందించారు. 6,500 మంది వైద్యులకు దివ్యాంగుల పునరావాస చికిత్సకు అవసరమైన శిక్షణ ఇచ్చారు. గాంధీ, నిలోఫర్‌ తదితర ఆసుపత్రుల్లో దివ్యాంగుల కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. కడప, గుంటూరు,తాండూరులో స్వీకార్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక విద్యాకేంద్రాలను నెలకొల్పారు. మొత్తం 35కి పైగా జాతీయ, రాష్ట్ర, అంతర్జాతీయ పురస్కారాలను పొందారు. తన 45 ఏళ్లకృషికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రకటించడంపై ఆయన సంతోషం వ్యక్తంచేశారు.  


ఐసర్‌ డైరెక్టర్‌ గణేష్‌కు పద్మశ్రీ పురస్కారం

ఈనాడు, తిరుపతి: తిరుపతి ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఐసర్‌) డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ కె.ఎన్‌.గణేష్‌కు సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో పద్మశ్రీ పురస్కారం వరించింది. 1953లో జన్మించిన ఆయన 1970లో బీఎస్సీ, 1972లో బెంగళూరు విశ్వవిద్యాలయం నుంచి రసాయనశాస్త్రంలో పీజీ పట్టా పొందారు. 1976లో దిల్లీ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ సాధించారు. కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయంలో రెండో పీహెచ్‌డీ చేశారు. 1981లో హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ)లో చేరారు. అక్కడ దేశంలోనే తొలి డీఎన్‌ఏ సంశ్లేషణ (సింథసిస్‌) సౌకర్యాన్ని ఏర్పాటుచేశారు. 1987లో జాతీయ కెమికల్‌ లేబొరేటరీ (ఎన్‌సీఎల్‌, సీఎస్‌ఐఆర్‌)కు వెళ్లారు. అక్కడ 1994లో ఆర్గానిక్‌ కెమిస్ట్రీ విభాగానికి అధిపతి అయ్యారు. 2006లో పుణెలో ఏర్పాటుచేసిన ఐసర్‌కు తొలి డైరెక్టర్‌గా నియమితులయ్యారు. గుర్తింపు పొందిన జర్నల్స్‌లో 170 ప్రచురణలు ఉన్నాయి.


‘పద్మ’ గ్రహీతలకు సీఎం కేసీఆర్‌ అభినందనలు

ఈనాడు.హైదరాబాద్‌ : సామాజిక, ఆధ్యాత్మిక, సాహిత్య, భాషాసాంస్కృతిక, విద్య,వైద్య, శాస్త్ర సాంకేతిక రంగాల్లో తమ జీవితకాలంలో చేసిన విశిష్ట సేవల ద్వారా భారత ప్రభుత్వ పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేరుపేరునా అభినందనలు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని