EPFO - Higher pension: సాంకేతిక సమస్యలతో అర్హతకు దూరం.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు లింకు తొలగించిన ఈపీఎఫ్‌వో

దేశవ్యాప్తంగా 2014 సెప్టెంబరు 1కి ముందు పదవీ విరమణ చేసి, అధిక పింఛను పొందేందుకు అర్హత కలిగిన ఈపీఎఫ్‌వో పింఛనుదారులు పెద్దసంఖ్యలో గడువులోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోలేకపోయారు.

Updated : 07 Mar 2023 07:24 IST

ఆందోళనలో అధిక పెన్షన్‌కు అర్హత కలిగిన పింఛనుదారులు

ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా 2014 సెప్టెంబరు 1కి ముందు పదవీ విరమణ చేసి, అధిక పింఛను పొందేందుకు అర్హత కలిగిన ఈపీఎఫ్‌వో పింఛనుదారులు పెద్దసంఖ్యలో గడువులోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోలేకపోయారు. గడువు తేదీకి 15 రోజుల ముందు వరకు వెబ్‌సైట్‌లో దరఖాస్తు లింకు తెరుచుకోకపోవడం, తర్వాత ఆధార్‌ అనుసంధానం సమస్యలతో వీరి దరఖాస్తు ఫారం ముందుకు వెళ్లలేదు. దీంతో మరో నెల రోజులు గడువు పొడిగిస్తారని పింఛనుదారులు, ఈపీఎఫ్‌వో క్షేత్రస్థాయి వర్గాలు భావించాయి. కానీ సంస్థ కేంద్ర కార్యాలయం ముందే ప్రకటించిన మేరకు ఈ నెల 3తో గడువు ముగిసిందని పేర్కొంటూ మెంబర్‌ పోర్టల్‌లో ఆన్‌లైన్‌ దరఖాస్తు లింకును తొలగించింది. గడువు తేదీ నాటికి 91,258 దరఖాస్తులు వచ్చాయని వెల్లడించింది.

2014 సెప్టెంబరు 1 నాటికి అధిక వేతనంపై ఈపీఎఫ్‌ చందా చెల్లిస్తూ, అధిక పింఛను కోసం 11(3) కింద యజమానితో కలిసి ఇచ్చిన ఉమ్మడి ఆప్షన్‌ తిరస్కరణకు గురై పదవీ విరమణ చేసిన ఉద్యోగులు.. తాజాగా అధిక పింఛనుకు దరఖాస్తు చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. ఈ మేరకు జనవరి 5న ఈపీఎఫ్‌వో ఆన్‌లైన్‌ దరఖాస్తు లింక్‌ను అందుబాటులోకి తెచ్చింది. మార్చి 3లోగా దరఖాస్తు చేయాలని సూచించింది. 2014 సెప్టెంబరు 1కి ముందు పదవీ విరమణ చేసిన వారి ఈపీఎఫ్‌ ఖాతాలు ఆధార్‌తో అనుసంధానం కాలేదు. సర్వీసు, వేతనం ఆధారంగా పింఛను చెల్లింపు పత్రాలను (పీపీవో) ఈపీఎఫ్‌వో జారీ చేసింది. ఆ మేరకు పింఛను అందుతోంది. పీపీవో కాపీలో ఉన్న పేరు, ఆధార్‌లో పేరు, పుట్టిన తేదీలు సరిపోలక పలువురు ప్రస్తుతం అధిక పింఛనుకు దరఖాస్తు చేసుకోలేకపోయారు. కొందరు ఆధార్‌లో మార్పులు చేసుకునేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఈ విషయాన్ని పింఛనుదారులు క్షేత్రస్థాయిలోని ఈపీఎఫ్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. ఆ మేరకు పీపీవో కాపీలో మార్పులకు ప్రయత్నించారు. కొందరు సిబ్బందికి సవరణలతో కూడిన పీపీవో కాపీలను మంజూరు చేసేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ ప్రయత్నాలన్నీ పూర్తయ్యేనాటికి దరఖాస్తు గడువు ముగిసింది. సుప్రీంకోర్టు నిబంధనల మేరకు నాలుగు నెలల గడువు ఇవ్వాలని, రెండు నెలలు మాత్రమే ఇచ్చారని పింఛనుదారులు పేర్కొంటున్నారు. సాంకేతిక సమస్యల దృష్ట్యా కనీసం నెల రోజులు గడువు పొడిగించాలని కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు