పోలీసుల అదుపులో తీన్మార్‌ మల్లన్న

క్యూన్యూస్‌ నిర్వాహకుడు తీన్మార్‌ మల్లన్న, సుదర్శన్‌, విఠల్‌లను రాచకొండ పోలీసులు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు.

Updated : 22 Mar 2023 05:10 IST

ఈనాడు, హైదరాబాద్‌: క్యూన్యూస్‌ నిర్వాహకుడు తీన్మార్‌ మల్లన్న, సుదర్శన్‌, విఠల్‌లను రాచకొండ పోలీసులు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రమే పోలీసులు  పీర్జాదీగూడలోని క్యూన్యూస్‌ కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్నారు. కొంత సమయం వేచి చూసి లోపలికి ప్రవేశించారు. అక్కడున్న తీన్మార్‌ మల్లన్న, విఠల్‌లను అదుపులోకి తీసుకోగా సుదర్శన్‌ను ఆయన ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నారు. కార్యాలయంలోని కొన్ని హార్డ్‌డిస్కులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో స్థానిక జర్నలిస్టులు స్పందించి మేడిపల్లి పోలీస్‌ స్టేషన్‌ వరకు ర్యాలీగా వెళ్లారు. మల్లన్నకు మద్దతుగా నినాదాలు చేశారు.కాగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌లు మంగళవారం అర్ధరాత్రి తీన్మార్‌ మల్లన్న ఇంటికి వెళ్లి ఆయన భార్యను పరామర్శించి ధైర్యం చెప్పారు.

పోలీసుల్ని బెదిరించారని ప్రకటన..

పీర్జాదిగూడ దగ్గర వాహనాలను మంగళవారం తనిఖీ చేస్తున్న సమయంలో క్యూన్యూస్‌కు చెందిన కొందరు విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని కర్రలతో బెదిరించి, వాళ్లను బలవంతంగా క్యూన్యూస్‌ కార్యాలయంలోకి తీసుకెళ్లినట్లు ఘట్‌కేసర్‌ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. గదికి తాళం వేసి, ఫోన్లు, ఐడీ కార్డులు లాక్కున్నట్లు పేర్కొన్నారు. పోలీసులని తెలిసినా దుర్భాషలాడుతూ దురుసుగా ప్రవర్తించారన్నారు. సమాచారం అందగానే ఘట్‌కేసర్‌ పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి వారిని రక్షించినట్లు తెలిపారు. అక్కడి సిబ్బందిని అదుపులోకి తీసుకున్నామని, వ్యవహారంపై దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని