Tamilisai Soundararajan: ఆమోదిస్తారా? ఆపుతారా?

ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే బిల్లుపై ఉత్కంఠ నెలకొంది. బిల్లుపై రాజ్‌భవన్‌ వివరణ కోరడం, ప్రభుత్వం సమాధానం ఇవ్వడం, మళ్లీ రాజ్‌భవన్‌ శనివారం మధ్యాహ్నం కొత్త సందేహాలు వ్యక్తంచేయడం, ప్రభుత్వమూ సాయంత్రమే వాటికి సమాధానాలు పంపడంతో ఆదివారం అసెంబ్లీలో ఈ బిల్లు ప్రవేశానికి నోచుకుంటుందా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది.

Updated : 06 Aug 2023 07:51 IST

ఆర్టీసీ బిల్లుపై ఎడతెగని ఉత్కంఠ
రెండు విడతలుగా గవర్నర్‌ సందేహాలు
వాటికి ప్రభుత్వ సమాధానాలు
తమిళిసై నిర్ణయంపై సందిగ్ధం
కార్మికుల్లో ఆందోళన

ఈనాడు, హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికులను(TSRTC Employees) ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే బిల్లు(RTC Bill)పై ఉత్కంఠ నెలకొంది. బిల్లుపై రాజ్‌భవన్‌ వివరణ కోరడం, ప్రభుత్వం సమాధానం ఇవ్వడం, మళ్లీ రాజ్‌భవన్‌ శనివారం మధ్యాహ్నం కొత్త సందేహాలు వ్యక్తంచేయడం, ప్రభుత్వమూ సాయంత్రమే వాటికి సమాధానాలు పంపడంతో ఆదివారం అసెంబ్లీలో ఈ బిల్లు ప్రవేశానికి నోచుకుంటుందా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. గతంలో అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై పలు అనుమానాలు వ్యక్తంచేసి, గవర్నర్‌ తిప్పి పంపగా అవే బిల్లులను ఇప్పుడు మళ్లీ అసెంబ్లీలో పెట్టి ఆమోదించారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ఆమోదించాలనుకొన్న ఆర్టీసీ విలీన బిల్లుపైనా గవర్నర్‌ రెండుసార్లు వివరణ కోరడంతో కార్మికులు ఆందోళనగా ఉన్నారు. ప్రస్తుతం చెన్నైలో ఉన్న గవర్నర్‌ ఆదివారం ఉదయం హైదరాబాద్‌ చేరుకోనున్నారు.

ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని జులై 31న జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. మూడో తేదీ నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టాలని నిర్ణయించారు. ఇది మనీ బిల్లు కావడంతో గవర్నర్‌ అనుమతి కోసం ఈనెల 2న మధ్యాహ్నం ముసాయిదా బిల్లును రాజ్‌భవన్‌కు పంపారు. దీనిపై కొన్ని సందేహాలను వ్యక్తంచేస్తూ గవర్నర్‌ కార్యాలయం వివరణ కోరడం, ప్రభుత్వం సమాధానం ఇవ్వడం, మళ్లీ గవర్నర్‌ అదనపు సమాచారం కోరడం, మరోసారి ప్రభుత్వం తన వివరణ పంపడం... ఇదంతా రెండు రోజుల్లోనే జరిగింది. మరోవైపు ఆర్టీసీ కార్మికులు శనివారం చలో రాజ్‌భవన్‌ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉదయంపూట రెండు గంటలపాటు బస్సులను నిలిపేశారు. రాజ్‌భవన్‌కు వచ్చిన కార్మికుల తరఫున పది మంది నాయకులను పిలిచి చెన్నైలో ఉన్న గవర్నర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. మీ ప్రయోజనాలను పరిరక్షిస్తానని ఆమె హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం గవర్నర్‌ లేవనెత్తిన అంశాలపై సీఎస్‌ శాంతికుమారి వివరంగా లేఖ రాశారు. దానిపై సంతృప్తి చెందని గవర్నర్‌ మరో ఆరు అంశాలపై అదనపు సమాచారం కోరారు. వాటి వివరాలతో కూడిన లేఖను విడుదల చేసిన రాజ్‌భవన్‌... ఆర్టీసీ ఉద్యోగుల చిరకాలవాంఛను రాజ్‌భవన్‌ అడ్డుకోవడం లేదని, వారికి భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ప్రక్రియను పూర్తి చేయడానికే గవర్నర్‌ తదుపరి వివరణను కోరారని పేర్కొంది. గవర్నర్‌ తాజా లేఖకు శనివారం సాయంత్రమే సీఎస్‌ సమాధానమిచ్చారు. తాజా పరిణామంతో గవర్నర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకొంటారన్నది ఆసక్తిగా మారింది.


గవర్నర్‌ మొదట లేవనెత్తిన అంశాలివీ...

  • 1958 నుంచి ఆర్టీసీలో కేంద్రం గ్రాంట్లు, వాటాలు, ఇతర సాయం గురించి బిల్లులో ఎలాంటి వివరాలు లేవు.
  • విభజన చట్టం తొమ్మిదో షెడ్యూలు ప్రకారం ఆర్టీసీ స్థితిని మార్చడంపై బిల్లులో సమగ్ర వివరాలు లేవు.
  • ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పరిగణిస్తామని చెబుతున్న ప్రభుత్వం, వారి సమస్యలకు పారిశ్రామిక వివాదాల చట్టం, కార్మిక చట్టాలు వర్తిస్తాయా లేదా? అనేది వివరించలేదు. వారి ప్రయోజనాలను ఎలా కాపాడతారో వెల్లడించలేదు.
  •  ఆర్టీసీ ఉద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పింఛన్‌ ఇస్తారా? వారికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని ప్రయోజనాలు ఇవ్వడానికి సంబంధించిన స్పష్టమైన వివరాలు ఇవ్వండి.
  • ప్రభుత్వ ఉద్యోగుల్లో కండక్టర్‌, కంట్రోలర్‌ తదితర పోస్టులు లేనందున వారి పదోన్నతులు, క్యాడర్‌ నార్మలైజేషన్‌ లాంటి విషయాల్లో ఆర్టీసీ ఉద్యోగులకు న్యాయం, ఇతర ప్రయోజనాలు ఎలా అందిస్తారో స్పష్టమైన వివరాలు ఇవ్వాలి. వీటితోపాటు ఆర్టీసీ కార్మికుల భద్రత, భవిష్యత్తు ప్రయోజనాలపై మరిన్ని స్పష్టమైన హామీలు ఇవ్వాలి.

గవర్నర్‌ లేఖకు ప్రభుత్వం ఇచ్చిన సమాధానాలివీ...

  • ఉమ్మడి రాష్ట్రంలోని ఏపీఎస్‌ ఆర్టీసీలో రాష్ట్రం వాటా రూ.140.20 కోట్లు, కేంద్రం వాటా రూ.61.07 కోట్లు. ప్రతిపాదిత బిల్లులో టీఎస్‌ఆర్టీసీ ఎస్టాబ్లిష్‌మెంట్‌ను ప్రభుత్వంలో కలిపే అంశం మాత్రమే ఉంది. టీఎస్‌ఆర్టీసీ చట్టపరంగా కొనసాగుతుంది, కార్పొరేషన్‌ బోర్డు ఆర్టీసీ అపెక్స్‌ బాడీగా ఉంటుంది. వాటా, రుణాలు, గ్రాంట్లు, కేంద్రం నుంచి వచ్చే సాయం తదితర అంశాలన్నీ బోర్డే చూసుకుంటుంది.
  • ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసులో కలిపిన తర్వాత కూడా టీఎస్‌ఆర్టీసీ ప్రస్తుతమున్న విధానంలోనే కొనసాగుతుంది. విభజన హామీలు పరిష్కారమయ్యే వరకు కార్పొరేషన్‌ స్వరూపం మారదు. రెండు రాష్ట్రాల అభిప్రాయాలను సమర్పించిన తర్వాత విభజనకు సంబంధించిన అంశాలు కేంద్ర పరిశీలనలో ఉన్నాయి.
  • ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసులోకి తీసుకొన్న తర్వాత పారిశ్రామిక వివాద చట్టంలోని ప్రొవిజన్స్‌ చట్టంలోని నిబంధనల ప్రకారమే ఉంటాయి. దీనికి సంబంధించి బిల్లులో ఎలాంటి వివరాలు అక్కర్లేదు. ప్రస్తుతమున్న ఉద్యోగుల ప్రయోజనాలు మరింత మెరుగ్గా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వంలోకి విలీనం చేసుకోవడం. ప్రస్తుత బిల్లు ప్రధాన ఉద్దేశమే అది.
  • ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే పింఛన్‌ నిబంధనలు, ఇతర ప్రయోజనాలు ఆర్టీసీ ఉద్యోగులకు వర్తించడం గురించి ఎలాంటి సందిగ్ధం లేదు. ప్రభుత్వంలో కలుపుకొన్న తర్వాత చట్టంలోని సెక్షన్లు 4, 5 ప్రకారం ప్రభుత్వం ఉద్యోగుల ప్రయోజనాలకు తగ్గట్లుగా ప్రొవిజన్లు రూపొందించి నోటిఫికేషన్‌ ఇవ్వడానికి అవకాశముంది. అప్పటివరకు స్టేక్‌ హోల్డర్లతో చర్చించి ఒక అభిప్రాయానికి రావడం జరుగుతుంది. ఈ మధ్యంతర సమయంలో ప్రస్తుతమున్న నిబంధనలే వర్తిస్తాయి. ప్రతిపాదిత బిల్లులోని సెక్షన్లు 4, 5 నిబంధనల తయారీకి అధికారాలు అప్పగించడమే.
  • ఇలాంటి అంశాలకు సంబంధించిన నిబంధనలను తగినంతగా రూపొందించడానికి, నిర్ణయించడానికి ప్రతిపాదిత బిల్లులోని సెక్షన్లు 4, 5 అనుమతిస్తాయి. ఉద్యోగులెవ్వరికీ జీతం, అలవెన్సులకు సంబంధించిన ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ప్రస్తుతం ఆర్టీసీలో ఉన్న వివిధ కేటగిరీలను, కేడర్‌ను ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత కూడా కొనసాగించడానికి ఎలాంటి అడ్డంకి ఉండదు. దీనికి తగ్గట్లుగా సర్వీసు నిబంధనలను రూపొందిస్తారు. ఈ బిల్లు పరిమిత లక్ష్యం ఏంటంటే... తెలంగాణ ప్రొహిబిషన్‌ ఆఫ్‌ ఎంప్లాయీస్‌ ఆఫ్‌ స్టేట్‌ గవర్నమెంట్‌ పబ్లిక్‌ సెక్టార్‌ అండర్‌ టేకింగ్స్‌ ఇన్‌టు పబ్లిక్‌ సర్వీసు యాక్టు, 1997 స్టేట్‌ యాక్ట్‌ 14 ఆఫ్‌ 1997ల నుంచి మినహాయింపు ఇవ్వడమే. ఈ రెండు చట్టాల ప్రకారం పబ్లిక్‌ సెక్టార్‌ యూనిట్లలో పనిచేసే వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకోవడానికి వీలుకాదు. ఈ నేపథ్యంలో ఇచ్చిన వివరణను పరిగణనలోకి తీసుకొని శానససభలో బిల్లు ప్రవేశపెట్టడానికి వీలుగా గవర్నర్‌ సిఫార్సు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోరారు.

మళ్లీ ఆరు అంశాలపై అదనపు సమాచారం కోరిన గవర్నర్‌ 

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందని గవర్నర్‌... మరో ఆరు అంశాలపై అదనపు సమాచారం కోరారు. దీనిపై రాజ్‌భవన్‌ ఒక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం...

  • ప్రభుత్వం ఇచ్చిన వివరణలో కేంద్రం వాటా 30% ఉందని పేర్కొన్నందున విలీనానికి కేంద్రం అనుమతి తీసుకొన్నారా, తీసుకొని ఉంటే సంబంధిత కాపీని పంపగలరు. తీసుకోకుంటే న్యాయపరంగా ఎదురయ్యే చిక్కులను పరిష్కరించడానికి తీసుకొన్న చర్యలను వివరించగలరు.
  • ఆర్టీసీలో శాశ్వత, తాత్కాలిక ఉద్యోగుల వివరాలు ఇవ్వగలరు. శాశ్వత ఉద్యోగుల వివరాలను కేటగిరీ, డిపోల వారీగా ఇవ్వాలి. అలాగే కాంట్రాక్టు, క్యాజువల్‌ ఉద్యోగులు డిపోల వారీగా ఎంతమంది ఉన్నారన్న వివరాలనూ ఇవ్వగలరు.
  • శాశ్వత ఉద్యోగులు మినహా మిగిలిన వారి విషయంలో చట్టపరంగా తీసుకోనున్న చర్యలు ఏమిటి?
  • ఉద్యోగుల విలీనం తర్వాత కూడా కార్పొరేషన్‌ కొనసాగుతుందని పేర్కొన్నందున కార్పొరేషన్‌కు సంబంధించిన చర, స్థిరాస్తులు అలాగే కొనసాగుతాయా లేక తెలంగాణ ప్రభుత్వం వాటిని ఏమైనా స్వాధీనం చేసుకొంటుందా అనేది గవర్నర్‌ తెలుసుకోగోరారు. ప్రత్యేకించి భూములు, భవనాలకు సంబంధించి...
  • ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తే వారి బాధ్యతలను నియంత్రించే అధికారం ఎవరికి ఉంటుంది. బస్సులు నడపడానికి డ్యూటీలు ఎవరు వేస్తారు? ఈ విషయంలో కార్పొరేషన్‌ పాత్ర ఏంటో కూడా స్పష్టంగా వివరించండి. ఉద్యోగులు, ప్రయాణికుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ వివరాలను కోరుతున్నాం.
  • ఉద్యోగులను ప్రభుత్వంలో కలుపుకొన్న తర్వాత వీరంతా కార్పొరేషన్‌లో డిప్యుటేషన్‌పై పని చేస్తారా లేక వేరే ఏర్పాటు ఏదైనా ఉందా అంటూ వీలైనంత త్వరగా వివరణలు ఇవ్వండి.

అదనంగా అడిగిన ఆరు అంశాలపై ప్రభుత్వ సమాధానాలివీ...

  • బిల్లు లక్ష్యాలలో పేర్కొన్నట్లు టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక కార్పొరేషన్‌. దీని కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయి. ఉద్యోగులు మాత్రమే ప్రభుత్వంలో విలీనమవుతారు. ఆస్తులు, అప్పులు అన్నీ కార్పొరేషన్‌కే ఉంటాయి. ప్రతిపాదిత బిల్లులో తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న వాటాను వెనక్కు తీసుకోవడం లేదు. ఏపీఎస్‌ఆర్టీసీ విభజన ఇంకా పెండింగ్‌లో ఉంది. కాబట్టి  ఈ దశలో ప్రస్తుత బిల్లు కోసం కేంద్రం ఆమోదం తీసుకోవాల్సిన అవసరం లేదు.
  • కేటగిరీ, డిపోల వారీగా శాశ్వత, తాత్కాలిక ఉద్యోగుల జాబితాను లేఖకు జత చేస్తున్నాం.
  • నాన్‌ పర్మనెంట్‌ ఎంప్లాయీస్‌కు సంబంధించి టీఎస్‌ఆర్టీసీలో ప్రస్తుతం ఉన్నట్లుగానే కొనసాగుతుంది.
  • ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం ఏపీఎస్‌ఆర్టీసీ విభజన అంశం ఇంకా కేంద్రం వద్ద ఉంది. అందుకే కార్పొరేషన్‌కు ఉన్న స్థిర, చరాస్థులు టీఎస్‌ఆర్టీసీకే ఉంటాయి.
  • బిల్లులో పేర్కొన్నట్లు టీఎస్‌ఆర్టీసీ కార్యకలాపాలు ముందులాగానే కొనసాగుతాయి. ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసులోకి తీసుకొన్నా, చట్టానికి తగ్గట్లుగా ప్రభుత్వం రూల్స్‌ను తయారు చేస్తుంది. రోజువారీ కార్యక్రమాలకు, స్థిర, చరాస్తులకు సహా టీఎస్‌ఆర్టీసీ బోర్డు డైరెక్టర్లే బాధ్యులుగా ఉంటారు. ఉద్యోగులు, ప్రజల ప్రయోజనాలను కాపాడటమే బిల్లు లక్ష్యం.
  • ప్రభుత్వంలో విలీనం తర్వాత టీఎస్‌ఆర్టీసీ ఎండీ, బోర్డు ఆఫ్‌ డైరెక్టర్ల ఆధ్వర్యంలోనే ఉద్యోగుల కార్యకలాపాలు ఉంటాయి. వారి జీతాలు, అలవెన్సులు రాష్ట్ర ఖజానా నుంచి చెల్లించడం జరుగుతుంది. దీనివల్ల జీతాలు, అలవెన్సులు, ఇతర ప్రయోజనాల విషయంలో వారికున్న సమస్య తొలగుతుంది. ముసాయిదా బిల్లును ఆమోదించి అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి వీలుగా సిఫార్సు చేయాలని ప్రధాన కార్యదర్శి కోరారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని