ఎన్నికల ఏర్పాట్లలో పోలీసు యంత్రాంగం

రాష్ట్ర శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పోలీసు యంత్రాంగం అందుకు సంబంధించిన బందోబస్తు ఏర్పాట్లను ముమ్మరం చేసింది.

Published : 11 Sep 2023 05:56 IST

భద్రతపై ఈసీకి ప్రతిపాదనలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పోలీసు యంత్రాంగం అందుకు సంబంధించిన బందోబస్తు ఏర్పాట్లను ముమ్మరం చేసింది. భద్రతా ఏర్పాట్ల గురించి ఇప్పటికే ఎన్నికల సంఘానికి(ఈసీ) ప్రాథమిక ప్రతిపాదనలు అందజేసింది. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం త్వరలో సమగ్ర ప్రణాళిక రూపొందించాలని పోలీసు అధికారులు భావిస్తున్నారు. తెలంగాణతోపాటు అయిదు రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నందున పోలీసు అధికారులు కేంద్ర బలగాలకు సంబంధించి ముందుగానే ప్రతిపాదనలు పంపనున్నారు. 2018లో జరిగిన శాసనసభ ఎన్నికలకు 93 వేల మంది కేంద్ర పారామిలటరీ బలగాలు, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల నుంచి 18 వేల మంది భద్రతా సిబ్బందిని పిలిపించారు. రాష్ట్ర పోలీసు యంత్రాంగం దీనికి అదనం. గత శాసనసభ ఎన్నికల్లో 4 వేల సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈసారి సమస్యాత్మక ప్రాంతాల సంఖ్య 5 వేలకు పెరగవచ్చని అంచనా వేస్తున్న అధికారులు.. లక్షకుపైగా కేంద్ర బలగాల సిబ్బందిని పిలిపించే యోచనలో ఉన్నారు.

నియోజకవర్గానికి ఓ ప్రత్యేకాధికారి

రానున్న ఎన్నికల్లో ప్రతి శాసనసభా నియోజకవర్గానికి పోలీసు శాఖ నుంచి ఒక ప్రత్యేకాధికారిని నియమించాలని నిర్ణయించారు. అత్యాధునికంగా నిర్మించిన కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం అందుబాటులోకి రావడంతో.. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహణ, బందోబస్తు ఏర్పాట్ల పర్యవేక్షణకు పోలీసు అధికారులు ఈ సారి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువగా వినియోగించుకోనున్నారు.  రాష్ట్రంలో తీవ్రవాద కార్యకలాపాలు తగ్గినా.. ముందు జాగ్రత్తగా సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. తీవ్రవాదుల కదలికలు లేకుండా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ పోలీసులతో కలిసి ఇప్పటికే కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు