మూణ్నెల్లు దాటినా 35 శాతమే

వానాకాలం సీజన్‌ రాష్ట్రంలో ఒడిదొడుకులతో సాగుతుండగా... పంటల సాగుకు అన్నదాతలు నానా కష్టాలు పడుతున్నారు. వారికి సాయంగా నిలవాల్సిన బ్యాంకుల వైఖరి నిరాశాజనకంగా ఉంది.

Updated : 11 Sep 2023 10:01 IST

పంట రుణాల మంజూరు అంతంతమాత్రమే
తీరు మారని బ్యాంకులు.. అన్నదాతల అవస్థలు

ఈనాడు, హైదరాబాద్‌: వానాకాలం సీజన్‌ రాష్ట్రంలో ఒడిదొడుకులతో సాగుతుండగా... పంటల సాగుకు అన్నదాతలు నానా కష్టాలు పడుతున్నారు. వారికి సాయంగా నిలవాల్సిన బ్యాంకుల వైఖరి నిరాశాజనకంగా ఉంది. వ్యవసాయానికి నిర్దేశించిన లక్ష్యాల మేరకు రుణసాయం అందించాల్సి ఉన్నా దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. సీజన్‌లో మూడు నెలలు గడిచినా... ఇప్పటికి సుమారు 35 శాతం మాత్రమే రుణాలను అందించాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ పరిధిలోని రైతుల్లో అధికశాతం మందికి మళ్లీ రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు నిరాకరించాయి. దీంతో పాటు ఇతరత్రా కారణాల పేరిట అన్నదాతలకు మొండిచేయి చూపినట్లు తెలుస్తోంది. 2023-24 వార్షిక రుణప్రణాళిక కింద ఈ వానాకాలం సీజన్‌లో రూ.83,391 కోట్ల మేరకు అన్నదాతలకు రుణసాయం అందించాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఏప్రిల్‌ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించాలని సూచించింది.

రైతులకు కష్టాల మీద కష్టాలు

పంటల సాగు పెట్టుబడుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు ద్వారా అందిస్తున్న ఎకరానికి రూ.5వేల సాయం రైతులను కొంత మేరకు ఆదుకుంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా మూడేసి సార్లు విత్తనాలు వేయాల్సి వచ్చింది. అతివృష్టి వల్ల కొంత నష్టం కలిగింది. దీంతో వారికి మళ్లీ పెట్టుబడుల కోసం రుణాలు అవసరమయ్యాయి. బ్యాంకుల నుంచి రుణసాయం కష్టంగా మారడంతో రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించక తప్పడం లేదు. పంట రుణాలే కాదు... యంత్రాలు, పాడి ఇతర అనుబంధ రంగాలకు సంబంధించిన రుణాలను కూడా బ్యాంకులు సరిగా ఇవ్వడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.


ప్రభుత్వం నిర్దేశించినా...

రాష్ట్రంలో పంటల సాగు ఏటేటా పెరుగుతున్నందున ప్రభుత్వం రైతులను ప్రోత్సహించేందుకు పంట రుణాలను పెద్దఎత్తున ఇవ్వాలని బ్యాంకులను కోరుతోంది. మార్చి 21న జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి సమావేశంలో ఆర్థిక, వ్యవసాయ మంత్రులు ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ వానాకాలం సీజన్‌లో వందశాతం లక్ష్యాలను సాధించాలని కోరారు. ఆ తర్వాత మే 19న జరిగిన సమావేశంలోనూ దీనిపై చర్చ జరిగింది. రైతులకు రుణాలను సరిగా ఇవ్వడం లేదని మంత్రులు అసంతృప్తి వ్యక్తంచేశారు. బ్యాంకర్లు ఉదారంగా వ్యవహరించాలని సూచించారు. అయినా బ్యాంకుల వైఖరిలో మార్పు రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ సంపూర్ణం చేసే ప్రక్రియను ప్రారంభించింది. ఖాతాల్లో ఆ సొమ్ము జమ అయిన తర్వాత రైతులు బ్యాంకుల వద్దకు వెళ్లినా... వడ్డీతో సహా మొత్తాన్ని చెల్లిస్తేనే రుణం ఇస్తామని చెప్పడంతో వారు నిరాశగా వెనుదిరుగుతున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు