7 గంటల నుంచి పోలింగ్‌

రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలింగ్‌ ప్రక్రియకు రంగం సిద్ధమైంది. గురువారం ఉదయం ఏడు గంటలకు ఓటింగ్‌ ప్రారంభం కానుంది. సిబ్బంది బుధవారం సాయంత్రానికి ఆయా పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు.

Published : 30 Nov 2023 05:32 IST

2,290 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్న 3.26 కోట్ల మంది ఓటర్లు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలింగ్‌ ప్రక్రియకు రంగం సిద్ధమైంది. గురువారం ఉదయం ఏడు గంటలకు ఓటింగ్‌ ప్రారంభం కానుంది. సిబ్బంది బుధవారం సాయంత్రానికి ఆయా పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. బరిలో నిలిచిన 2,290 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 3.26 కోట్ల మంది ఓటర్లు తేల్చనున్నారు. రాష్ట్రంలో పురుష ఓటర్ల కన్నా మహిళలు ఎక్కువగా ఉన్నారు. సుమారు 68 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అభ్యర్థుల గెలుపు, ఓటములను నిర్ణయించనున్నారు. ఈ నెల 3 నుంచి ప్రారంభమైన ఎన్నికల క్రతువులోని కీలక ప్రక్రియ గురువారం సాయంత్రం అయిదు గంటలకు పూర్తవుతుంది. ఇప్పటికే పోలింగ్‌ పూర్తయిన నాలుగు రాష్ట్రాలతోపాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబరు 3న చేపట్టనున్నారు. అదే రోజు సాయంత్రానికి పూర్తిస్థాయిలో ఫలితాలు వస్తాయి. ప్రస్తుత ఎన్నికల్లో రికార్డు స్థాయిలో నవతరం ఓటు హక్కు వినియోగించుకోనుంది. 18-19 సంవత్సరాల మధ్య ఓటర్లు ఇంత పెద్ద సంఖ్యలో మునుపెన్నడూ లేరు. ఈ వయసులో ఉన్న 9,99,667 మందికి ఓటు హక్కు లభించింది. ప్రవాస (ఎన్‌ఆర్‌ఐ) ఓటర్లు అత్యధికంగా 2,944 మంది నమోదయ్యారు.

బందోబస్తుకు 75 వేల మంది

పోలింగ్‌ నిర్వహణకు సుమారు 75 వేల మంది పోలీసు బలగాలను వినియోగిస్తున్నారు. రాష్ట్రంలోని 40 వేల మంది, సరిహద్దు రాష్ట్రాల నుంచి 15 వేల మంది, 375 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను మోహరించారు. తీవ్రవాద ప్రభావితమైన 13 అసెంబ్లీ నియోజకవర్గాలను, 12,311 పోలింగ్‌ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా ఎన్నికల సంఘం గుర్తించి ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసింది. ఇలా గుర్తించినవాటిల్లో సిర్పూరు, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాలు ఉన్నాయి. అక్కడ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్‌ జరుగుతుంది.  రాష్ట్రంలోని 35,655 పోలింగ్‌ కేంద్రాలకుగాను 27,051 చోట్ల ఓటింగ్‌ ప్రక్రియను వెబ్‌కాస్టింగ్‌ ద్వారా ఎన్నికల సంఘం పర్యవేక్షిస్తుంది. ఒకటికి మించి పోలింగ్‌ కేంద్రాలున్న ప్రాంతాల్లో కూడా వీడియో కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. పోలింగ్‌ ప్రక్రియలో 2 లక్షల మందికి పైగా సిబ్బందిని వినియోగిస్తున్నారు. పర్యవేక్షణకు 3,800 మంది సెక్టార్‌ ఆఫీసర్లను, 22 వేల మంది సూక్ష్మ పరిశీలకులను ఎన్నికల సంఘం నియమించింది.

అత్యధికంగా....

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అత్యధికంగా 7,32,560 మంది.. అతి తక్కువగా భద్రాచలంలో 1,48,713 మంది ఓటర్లు ఉన్నారు. ఎల్బీనగర్‌లో అత్యధికంగా 48 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అతి తక్కువగా బాన్సువాడ, నారాయణపేట నియోజకవర్గాల్లో ఏడుగురు చొప్పున పోటీ చేస్తున్నారు. ఓటర్లు అధికంగా ఉండటంతో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అత్యధికంగా 638 పోలింగ్‌ కేంద్రాలు పెట్టాల్సి వచ్చింది.  అతితక్కువగా భద్రాచలంలో 176 ఏర్పాటు చేశారు. పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య ఆధారంగా 55 నియోజకవర్గాల్లో ఒక్కో బ్యాలెట్‌ యూనిట్‌, 54 స్థానాల్లో రెండు, పది నియోజకవర్గాల్లో మూడు చొప్పున వినియోగిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని