ఓట్ల వేటపై కాసుల ఆట

శాసనసభ పోరులో ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపోటములపై కాసుల వేట కొనసాగుతోంది. బెట్టింగ్‌లో రూ.కోట్ల మొత్తంలో చేతులు మారుతున్నాయి.

Updated : 30 Nov 2023 03:31 IST

గెలుపోటములపై రూ.కోట్లలో బెట్టింగ్‌
 యాప్‌లు, వెబ్‌సైట్ల ద్వారానిర్వహణ
ఫలితాలపై పొరుగు రాష్ట్రాల్లోనూ ఆసక్తి

ఈనాడు, హైదరాబాద్‌: శాసనసభ పోరులో ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపోటములపై కాసుల వేట కొనసాగుతోంది. బెట్టింగ్‌లో రూ.కోట్ల మొత్తంలో చేతులు మారుతున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ప్రధాన పార్టీల రాష్ట్రస్థాయి నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాలెవరు? జిల్లాలు, నియోజకవర్గాలవారీగా పార్టీల విజయాలు, కీలక నేతలకు దక్కే మెజారిటీ ఎంత? అనే అంశాలపై భారీగా పందెం కాస్తున్నారు. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లలో రూ.500 కోట్ల బెట్టింగ్‌ జరుగుతున్నట్లు పోలీసుల అంచనా. తెలంగాణతో పాటు రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, మిజోరం రాష్ట్రాల్లోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికల బెట్టింగ్‌ విలువ రూ.వెయ్యి కోట్లకు మించి ఉంటుందని సమాచారం. పోలింగ్‌ వేర్వేరు తేదీల్లో జరిగినా అన్ని రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడేది డిసెంబరు 3నే కావడంతో.. బెట్టింగ్‌ విలువ మరింత పెరిగే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు.

రూ.లక్షకు లక్ష

రాష్ట్రస్థాయిలో విజయావకాశాలతో పాటు ప్రధాన పార్టీల ముఖ్య నేతలపైనే ఈసారి ఎక్కువగా బెట్టింగ్‌ జరుగుతోంది. సీఎం కేసీఆర్‌, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, భాజపా నేత ఈటల రాజేందర్‌ తదితర ముఖ్య నేతల విజయాలు, మెజారిటీలపై పంటర్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. రాష్ట్రంలో 119 శాసనసభ స్థానాల్లో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సీట్లు ఏ పార్టీ సాధిస్తుందన్నది ప్రధాన అంశమే అయినా.. అభ్యర్థుల విజయావకాశాలపైనే ఎక్కువ చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో కొన్ని బెట్టింగ్‌ యాప్‌లు, వెబ్‌సైట్లలో రూ.లక్షకు రూ.లక్ష చొప్పున పందెం నడుస్తోంది. కొందరు బుకీలు 1:10 చొప్పున ఇచ్చేలా ఆశపెడుతున్నారు.

రంగంలోకి దిల్లీ, ముంబయి ముఠాలు

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ముంబయి, దిల్లీ సహా కొన్ని రాష్ట్రాలకు చెందిన ముఠాలు రంగంలోకి దిగి బెట్టింగ్‌ నిర్వహిస్తున్నట్లు సమాచారం. కొత్త కొత్త పేర్లతో యాప్‌లు, వెబ్‌సైట్లు అందుబాటులోకి తెస్తున్నాయి. తెలంగాణలో ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్‌, బెట్టింగ్‌పై నిషేధం ఉన్నా.. దొడ్డిదారిలో పదుల సంఖ్యలో యాప్‌లు, వెబ్‌సైట్లను నిర్వహిస్తున్నాయి. వాటిని పోలీసులు నిర్వీర్యం చేస్తున్నా, ఎప్పటికప్పుడు కొత్త పేర్లతో పుట్టుకొస్తున్నాయి. రూ.5 వేలిస్తే కొత్త యాప్‌ అందుబాటులోకి వస్తోంది. సాధారణంగా బుకీలు ఎక్కువగా క్రికెట్‌పై పందెం కాస్తుంటారు. తాజాగా ఎన్నికలపై బెట్టింగ్‌లు నిర్వహిస్తూ రూ.కోట్లు కూడబెడుతున్నారని సమాచారం.

పొరుగు రాష్ట్రాల్లోనూ జోరు

తెలంగాణ ఎన్నికలపై ఇతర రాష్ట్రాల్లోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ చర్చ జరుగుతోంది. ఫలానా పార్టీ గెలుస్తుందంటూ రూ.కోట్లలో పందేలు కాస్తున్నారు. ఇప్పటికే రంగంలోకి దిగిన దళారులు వాట్సప్‌ గ్రూపులు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో రూ.కోట్లలో బెట్టింగ్‌ జరుగుతోందని పోలీసు అధికారులు చెబుతున్నారు. నెల్లూరు, విశాఖ, విజయవాడ తదితర ప్రాంతాల్లోనూ బెట్టింగ్‌ నిర్వహిస్తున్నారని సమాచారం. హైదరాబాద్‌ సహా వివిధ జిల్లాల్లో ఉండే తమ ప్రాంతాలవారీతో మాట్లాడుతూ.. రాజకీయ పరిస్థితులు, వివిధ పార్టీల బలాబలాలను బేరీజు వేసుకుంటూ పందేలు కాస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని