Congress: కొత్త మంత్రులెవరు?

కొత్త ప్రభుత్వంలో మంత్రులెవరన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. శాసనసభ ఎన్నికల్లో మెజార్టీ సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ త్వరలోనే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనుంది.

Updated : 05 Dec 2023 23:02 IST

కూర్పుపై ఆసక్తి
సీనియార్టీ, సామాజిక సమీకరణాలే ప్రాతిపదిక

ఈనాడు, హైదరాబాద్‌: కొత్త ప్రభుత్వంలో మంత్రులెవరన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. శాసనసభ ఎన్నికల్లో మెజార్టీ సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ త్వరలోనే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనుంది. సీఎం ఎంపికపై అధిష్ఠానం నుంచి ఇంకా నిర్ణయం రాకపోవడంతో ఆరు లేదా తొమ్మిదో తేదీన ప్రమాణస్వీకారం జరిగే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పూర్తిస్థాయి మంత్రివర్గం ఒకేసారి బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రితో కలిపి 18 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకొనే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి పదవికి రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పోటీ పడుతున్నా.. రేవంత్‌, భట్టి మధ్యనే ప్రధాన పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కాకుండా మరో 16 మందికి అవకాశం ఉంటుంది. సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకొని మంత్రివర్గ కూర్పు చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

👉 Follow EENADU WhatsApp Channel

ఉమ్మడి జిల్లాల వారీగా పరిశీలిస్తే ప్రత్యేకించి మహబూబ్‌నగర్‌, నల్గొండ, ఖమ్మం, వరంగల్‌, ఖమ్మం జిల్లాల నుంచి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. గతంలో మంత్రులుగా పనిచేసిన అనుభవంతోపాటు రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వారు, గతంలో ఎంపీలుగా చేసి ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన వారిని మంత్రి పదవులకు పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. మొదటిసారి శాసనసభలోకి అడుగుపెట్టిన వారికి అవకాశం ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఆదిలాబాద్‌ నుంచి వివేక్‌, ప్రేమసాగర్‌రావు, నిజామాబాద్‌ నుంచి సుదర్శన్‌రెడ్డి, కరీంనగర్‌ నుంచి శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ పేర్లను పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సీనియర్‌ నాయకుడు జీవన్‌రెడ్డి జగిత్యాల నుంచి ఓడిపోయినా ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. సీనియార్టీని పరిగణనలోకి తీసుకుని ఈయనకు అవకాశం ఇస్తారో లేదో చూడాల్సి ఉంది. మైనార్టీ వర్గం నుంచి పోటీ చేసిన వారంతా ఓడిపోయారు. ఈ నేపథ్యంలో షబ్బీర్‌అలీని మంత్రివర్గంలోకి తీసుకొని మండలికి పంపుతారనే ప్రచారం కూడా ఉంది.  మెదక్‌ జిల్లా నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా పేరు ఖరారైనట్లే. ఈ జిల్లా నుంచి మరొకరికి అవకాశం తక్కువే.

మహబూబ్‌నగర్‌ నుంచి రేవంత్‌రెడ్డిని మినహాయిస్తే.. జూపల్లి కృష్ణారావు, వంశీకృష్ణ పేర్లతోపాటు షాద్‌నగర్‌ నుంచి గెలుపొందిన శంకర్‌ పేరును కూడా పరిశీలించవచ్చని తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లాలో గడ్డం ప్రసాద్‌, మల్‌రెడ్డి రంగారెడ్డి, రామమోహన్‌రెడ్డిల నుంచి ఎంపిక చేసే వీలుంది. నల్గొండ జిల్లాలో సీనియర్‌ నాయకులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఉన్నారు. ఉత్తమ్‌ ఆసక్తి చూపకపోతే ఆయన భార్య పద్మావతికి అవకాశం ఇవ్వవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వరంగల్‌ నుంచి సీతక్క, కొండా సురేఖ ఉన్నారు. ఖమ్మం జిల్లా నుంచి భట్టి విక్రమార్కతోపాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. స్పీకర్‌ ఎవరన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. ఖమ్మం జిల్లాలో ఉన్న పోటీని పరిగణనలోకి తీసుకొని తుమ్మల పేరును స్పీకర్‌ స్థానానికి పరిశీలించే అవకాశం లేకపోలేదని కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని