గ్యారంటీలకు ఏటా రూ.70 వేల కోట్లు!

ఎన్నికల హామీగా కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలుకు ఏటా సుమారు రూ. 70 వేల కోట్లు అవసరమని అంచనా.

Updated : 07 Dec 2023 06:43 IST

 అధికారుల ప్రాథమిక అంచనా
విధివిధానాలు ఖరారయ్యాకే పూర్తి స్పష్టత

ఈనాడు, హైదరాబాద్‌: ఎన్నికల హామీగా కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలుకు ఏటా సుమారు రూ. 70 వేల కోట్లు అవసరమని అంచనా. వీటి ముసాయిదాపై తొలుత సీఎం సంతకం చేస్తారు. అనంతరం మంత్రివర్గం భేటీ అయి.. దానికి ఆమోదం తెలుపుతుంది. అర్హులకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేసిన తర్వాత వీటికి ఎంత వ్యయమవుతుందన్న విషయంలో మరింత స్పష్టత వస్తుంది. గ్యారంటీలకు చట్టరూపం కల్పిస్తే వాటి అమలును ప్రశ్నించే హక్కు ప్రజలకు లభిస్తుంది. కొత్త ప్రభుత్వం కొలువుదీరుతున్న వేళ.. ఆ గ్యారంటీల సింహావలోకనం..

1. మొదటిది.. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెలా రూ.2,500, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, ఆర్టీసీ బస్సుల్లో వారికి ఉచిత ప్రయాణం. లబ్ధిదారులకు ఉండాల్సిన అర్హతలేంటి, ఎంతమంది మహిళలకు ఇస్తారనేది నిర్ణయించాల్సి ఉంది. ఈ పథకానికి ఏటా సుమారు రూ.18 వేల కోట్ల వరకు వ్యయమవుతుందని అధికారుల ప్రాథమిక అంచనా. రాష్ట్రంలో 1.20 కోట్ల మంది గ్యాస్‌ వినియోగదారులున్నారు. అర్హతలు నిర్ణయించిన తర్వాత వారిలో రాయితీ ఎంతమందికి వర్తిస్తుందనే విషయం తెలుస్తుంది.

2. రెండో గ్యారంటీ.. రైతు భరోసా కింద ఏటా రైతులకు, కౌలు రైతులకు ఎకరాకు రూ.15 వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు, వరిపంటకు బోనస్‌గా క్వింటాలుకు రూ.500. రైతుబంధు కింద మొదటి విడత నిధులు గత ప్రభుత్వం పంపిణీ చేసినందున.. ఇప్పుడు రెండో విడత ఇవ్వాల్సి ఉంది. ఇచ్చిన హామీ ప్రకారం మొదట ఇచ్చిన రూ.5 వేలు కాకుండా మరో రూ.10 వేల చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది.
3. ‘ఇందిరమ్మ గృహ నిర్మాణం’ కింద ఇల్లు లేని కుటుంబాలకు ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు, తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం కేటాయింపు.
4. ‘గృహజ్యోతి’లో భాగంగా ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు
5.యువ వికాసం కింద విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఏర్పాటు
6.చేయూత కింద వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, కల్లుగీత, చేనేత కార్మికులు, హెచ్‌ఐవీ, బోదకాలు బాధితులు, డయాలసిస్‌ చేయించుకుంటున్న వారికి నెలవారీ పింఛను రూ.4 వేలు, పేదలకు రూ.10లక్షల రాజీవ్‌ ఆరోగ్యశ్రీ ఆరోగ్య బీమా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని