అప్పుడు ఎంత ఇబ్బంది పడ్డారో తెలుస్తోంది

రాష్ట్రంలో నియంతపాలన నుంచి బయట పడ్డామని పేర్కొంటూ సచివాలయ ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు.

Updated : 07 Dec 2023 05:03 IST

సచివాలయ సిబ్బందితో ప్రొ.కోదండరాం
నృత్యాలు చేస్తూ... ఉద్యోగుల సంబరాలు

ఖైరతాబాద్‌ , న్యూస్‌టుడే: రాష్ట్రంలో నియంతపాలన నుంచి బయట పడ్డామని పేర్కొంటూ సచివాలయ ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. బుధవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో  సచివాలయం బయటకు చేరుకుని బాణసంచా కాల్చి,  మిఠాయిలు పంచుకుటూ నృత్యాలు చేశారు. తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొ.కోదండరాం వారికి మద్దతుగా అక్కడికి చేరుకోవడంతో ఉద్యోగులు ఆయన్ను పైకెత్తి జై తెలంగాణ అంటూ నినదించారు. కోదండరాం మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చిన రోజు ఉన్న ఆనందం మళ్లీ ఈ రోజు చూస్తున్నామన్నారు. ఉద్యోగుల్లోని సంతోషమే ఇప్పటి దాకా ఎంత ఇబ్బందిని అనుభవించారో తెలుస్తోందన్నారు. పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ.. కేసీఆర్‌ ఉద్యోగ విరమణ వయసు పెంచి ఓ మంచి పనిచేసినా, ఆ వయసులో బ్యాంకు, క్యాంటీన్‌లకు సచివాలయం బయటకు వెళ్లే పరిస్థితి తేవడం నియంత పాలనకు నిదర్శనమన్నారు. విశాలమైన గదులతో ఉన్న సచివాలయ భవనాలను కూల్చేసి ఇరుకైన క్యాబిన్లు కట్టారని విమర్శించారు. ఒకరిద్దరు తప్ప ఏ సంఘం నాయకులూ ప్రభుత్వ పెద్దలను కలిసే పరిస్థితి లేకుండా చేశారని పేర్కొన్నారు. త్వరలో తామంతా అసలైన నాయకత్వాన్ని ఎన్నుకోబోతున్నామని, అక్రమార్కులపై కొత్త ప్రభుత్వం విచారణ జరపాలని విజ్ఞప్తిచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని