Hyderabad-Amaravati: ఎంప్లాయీస్‌ ట్రైన్‌కు ఏమైంది?

రాష్ట్ర విభజన తర్వాత.. నూతన ఆంధ్రప్రదేశ్‌ రాజధానిలో పనిచేసే ఉద్యోగులు, ప్రజల కోసం నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చొరవతో నాడు సికింద్రాబాద్‌ నుంచి (ప్రస్తుతం లింగంపల్లి నుంచి నడుస్తోంది) ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రైలు అది.

Updated : 12 Jan 2024 07:03 IST

నాడు మేటి రైలు.. నేడు అపరిశుభ్రతకు నెలవు
ప్రయాణికుల అవస్థలు పట్టని రైల్వేశాఖ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర విభజన తర్వాత.. నూతన ఆంధ్రప్రదేశ్‌ రాజధానిలో పనిచేసే ఉద్యోగులు, ప్రజల కోసం నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చొరవతో నాడు సికింద్రాబాద్‌ నుంచి (ప్రస్తుతం లింగంపల్లి నుంచి నడుస్తోంది) ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రైలు అది. నల్గొండ, గుంటూరు, మంగళగిరి స్టాప్‌లతో విజయవాడకు ప్రయాణించే ఈ రైలుకు.. అతి తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో గుంటూరు, విజయవాడలకు వెళ్లే రైలుగా మంచి ఆదరణ ఉంది. ఎల్‌హెచ్‌బీ బోగీలతో కూడిన ఈ రైలు గతంలో పరిశుభ్రత, నిర్వహణ పరంగానూ మేటిగా ఉండేది. అలాంటి రైలు ప్రస్తుతం నిర్వహణలో నాసిరకంగా ఉందని ప్రయాణికులు ఫిర్యాదులు చేస్తున్నారు. తిరిగి వచ్చే సమయంలో సమయ పాలనా ఉండడంలేదన్న విమర్శలు వస్తున్నాయి. ఈ రైలు నిత్యం వేకువజామున 4.40 గంటలకు లింగంపల్లిలో బయలుదేరి విజయవాడకు 10.30కు చేరుతుంది. తిరిగి విజయవాడలో సాయంత్రం 5.30కు బయలుదేరి రాత్రి 10.15 గంటలకు సికింద్రాబాద్‌, 11.20కి లింగంపల్లి చేరుతుంది. గత శుక్రవారం లింగంపల్లి నుంచి విజయవాడ వెళ్తున్న రైలులోని సి-2 బోగీలో సీటు నంబరు 26 దగ్గర చెత్త ఉందని ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయిందని ప్రయాణికులు తెలిపారు. అదే రోజు విజయవాడ నుంచి వచ్చే సమయంలో డి-5 బోగీలోకి నీళ్లు వచ్చాయని వాపోయారు. సాధారణ బోగీలతో పాటు.. ఏసీ బోగీలు కూడా అపరిశుభ్రంగా కనిపిస్తున్నాయని.. మరుగుదొడ్లకు వెళ్లలేని పరిస్థితి ఉందని అంటున్నారు.

నడుం నొప్పి తెస్తున్న సీట్లు..

ఈ రైలులోని సీట్ల నిర్వహణ కూడా సరిగా లేదని ప్రయాణికులు ఫిర్యాదు చేస్తున్నారు. వెనక్కు వాల్చినా.. ముందుకు ఒరిగిపోతుండడంతో నాలుగైదు గంటల ప్రయాణానికే నడుం నొప్పి వస్తోందని వాపోతున్నారు. దాదాపు 40 శాతం సీట్లకు ముందు.. కాళ్లు పెట్టుకునే ‘ఫుట్‌రెస్ట్‌’లు లేవని చెబుతున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని, 5 గంటల్లో గమ్యస్థానం చేరాల్సిన రైలు.. తిరుగు ప్రయాణంలో కొన్నిసార్లు ఆలస్యంగా నడుస్తోందని పేర్కొంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని