TS Police: ఏబీవీపీ మహిళా నేతపై పోలీసుల అనుచిత ప్రవర్తన

వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాల స్థలాలను హైకోర్టు నిర్మాణానికి కేటాయించ వద్దని కొన్ని రోజులుగా ధర్నా చేస్తున్న విద్యార్థులకు బుధవారం ఏబీవీపీ నాయకులు మద్దతు ప్రకటించారు.

Updated : 25 Jan 2024 12:06 IST

 జుట్టు పట్టుకొని లాగిన వైనం

రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాల స్థలాలను హైకోర్టు నిర్మాణానికి కేటాయించ వద్దని కొన్ని రోజులుగా ధర్నా చేస్తున్న విద్యార్థులకు బుధవారం ఏబీవీపీ నాయకులు మద్దతు ప్రకటించారు. రాజేంద్రనగర్‌లోని వర్సిటీకి భారీగా తరలివచ్చిన పరిషత్‌ కార్యకర్తలు విద్యార్థులతో కలిసి కొద్దిసేపు ధర్నా నిర్వహించారు. అనంతరం పోలీసులు ఏబీవీపీ కార్యకర్తలను అరెస్టు చేసి డీసీఎంలో రాజేంద్రనగర్‌ ఠాణాకు తరలించారు. ఈ క్రమంలో సంస్థ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ పోలీసులను తప్పించుకొని పరుగెత్తే ప్రయత్నం చేయగా ద్విచక్రవాహనంపై వెంబడించిన ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు (TS Police) జుట్టుపట్టుకొని లాగడంతో ఆమె కింద పడిపోయారు. ఇద్దరు మహిళా కానిస్టేబుళ్ల ప్రవర్తనపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అవినాశ్‌ మహంతి తెలిపారు.

ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్‌?: భారాస ఎమ్మెల్సీ కవిత విమర్శ

శాంతియుతంగా నిరసన చెబుతున్న విద్యార్థినిపై పోలీసుల దాడి అమానుషమని భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి సంఘటనలు ఆమోదయోగ్యం కాదని, ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అంటే అని ఆమె ‘ఎక్స్‌’ వేదికగా  ప్రశ్నించారు.

విద్యార్థుల ధర్నాకు సీపీఎం మద్దతు

హైకోర్టు నిర్మాణానికి మరోచోట స్థలం కేటాయించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. విద్యార్థుల ధర్నాకు బుధవారం ఆయన మద్దతు ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని