ఇసుక ధరలకు రెక్కలు

ఇసుక ధరలు పెరుగుతున్నాయి. సన్న రకం ధర టన్నుకు రూ.రెండు వేలు దాటింది. దొడ్డు రకం ధర రూ.1,600 పైమాటే. రాష్ట్రంలోని ఇసుక రీచ్‌లు, స్టాక్‌ యార్డుల్లో కావాల్సినంత ఇసుక ఉంది.

Published : 12 Feb 2024 04:38 IST

సన్న రకం టన్ను రూ.రెండు వేల పైనే
లారీల యజమానులు, దళారుల దందా
యంత్రాంగం కఠిన చర్యలతో అడ్డదారులు

ఈనాడు, హైదరాబాద్‌: ఇసుక ధరలు పెరుగుతున్నాయి. సన్న రకం ధర టన్నుకు రూ.రెండు వేలు దాటింది. దొడ్డు రకం ధర రూ.1,600 పైమాటే. రాష్ట్రంలోని ఇసుక రీచ్‌లు, స్టాక్‌ యార్డుల్లో కావాల్సినంత ఇసుక ఉంది. వర్షాలు, రీచ్‌లకు దారితీసే రహదారులు దెబ్బతినడం వంటి సమస్యలు ఏమీ లేవు. ఇలాంటి పరిస్థితుల్లో మామూలుగా అయితే లారీల యజమానులు, దళారులు పోటీపడి ధర తగ్గిస్తుంటారు. కానీ ఇప్పుడు కృత్రిమంగా ధరలు పెంచేశారు. బుకింగ్‌ చేసిన పరిమాణం కంటే అదనంగా తీసుకువస్తున్న ఇసుకపై ప్రభుత్వ ఆదేశాలతో అధికార యంత్రాంగం కొద్దిరోజులుగా నిబంధనల కొరడా ఝళిపిస్తోంది. దీంతో ఇసుక లారీల యజమానులు, దళారులు ధర పెంచి అమ్ముతున్నారు. రెండు నెలల క్రితం సన్న రకం ఇసుక ధర టన్నుకు రూ.1,700 ఉండగా ఇప్పుడు రూ.2,100-రూ.2,150కు విక్రయిస్తున్నారు. 30 టన్నులకు పైగా ఉండే పెద్ద లారీ లోడ్‌ తీసుకుంటే మాత్రం టన్ను రూ.రెండు వేలకు విక్రయిస్తున్నారు.

సగమే బుకింగ్‌

తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎండీసీ) ఆన్‌లైన్‌లో ఇసుకను విక్రయిస్తోంది. కొత్తగూడెం, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, రంగారెడ్డి, ములుగు, మేడ్చల్‌ జిల్లాలలోని 21 రీచ్‌ల్లో ఇసుకను అమ్ముతోంది. గతంలో ఆన్‌లైన్‌లో పెట్టిన ఇసుక బుకింగ్‌ అంతా అరగంటలోపే అయిపోయేది. ఇప్పుడు 50-60శాతం మించి డిమాండ్‌ లేదు. ఆదివారం 1,24,000 టన్నుల ఇసుకను ఆన్‌లైన్‌లో పెడితే 51,147 టన్నులే అమ్ముడైంది. 9న 68,482, 10న 55,884 టన్నుల విక్రయాలు జరిగాయి.

రంగంలోకి విజిలెన్స్‌, మైనింగ్‌, రవాణా శాఖల అధికారులు

రాష్ట్ర ప్రభుత్వం ఇసుక అక్రమ రవాణాపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో విజిలెన్స్‌, మైనింగ్‌, రవాణా శాఖల అధికారులు రంగంలోకి దిగి తనిఖీలు చేస్తున్నారు. అక్రమంగా తెచ్చే ఇసుక ఆగిపోవడం, లాభాలు తగ్గడంతో లారీ యజమానులు, దళారులు ధరలు పెంచి ఇసుక విక్రయిస్తున్నారు. అక్రమాలు అరికట్టాల్సిందేనని ఇదే సమయంలో ఇసుక సరఫరాపై బతుకులీడిస్తున్న లారీ యజమానుల గురించి కూడా ఆలోచించి ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకురావాలని లారీ ఓనర్ల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్‌ సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని