టికెట్లు కొంటారు.. ప్రయాణం చేయరు

ఆ రైల్వేస్టేషన్‌లో కొందరు రోజూ 60కిపైగా టికెట్లు కొంటారు. కానీ వాటితో ఎక్కడికీ ప్రయాణం చేయరు. మరెందుకంటే.. తమ ఊరిలో ఓ రైలు హాల్టింగ్‌ రద్దు కాకూడదని. దీని కోసం వ్యాపారులు, దాతలు ముందుకొచ్చి విరాళాలు ఇస్తుండటం విశేషం.

Published : 12 Feb 2024 03:48 IST

రైలు హాల్టింగ్‌కు విరాళాలతో ప్రజల వినూత్న ప్రయత్నం

నెక్కొండ, న్యూస్‌టుడే: ఆ రైల్వేస్టేషన్‌లో కొందరు రోజూ 60కిపైగా టికెట్లు కొంటారు. కానీ వాటితో ఎక్కడికీ ప్రయాణం చేయరు. మరెందుకంటే.. తమ ఊరిలో ఓ రైలు హాల్టింగ్‌ రద్దు కాకూడదని. దీని కోసం వ్యాపారులు, దాతలు ముందుకొచ్చి విరాళాలు ఇస్తుండటం విశేషం. ఈ తంతు వరంగల్‌ జిల్లా నెక్కొండ రైల్వేస్టేషన్‌లో జరుగుతోంది. నర్సంపేట నియోజకవర్గం మొత్తానికి ఇదే ఏకైక రైల్వేస్టేషన్‌ కావడంతో ఆయా మండలాలకు చెందిన వారు ఇక్కడికే వస్తుంటారు. తిరుపతి, హైదరాబాద్‌, దిల్లీ, శిరిడీ తదితర ముఖ్య ప్రాంతాలకు వెళ్లే రైళ్లకు ఇక్కడ హాల్టింగ్‌ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు ఆదాయం తగ్గుతోందన్న సాకుతో రైల్వే అధికారులు పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ తిరుగు ప్రయాణంలో ఈ స్టేషన్‌లో హాల్టింగ్‌ను రద్దు చేశారు. ప్రయాణికులు పలుమార్లు విన్నవించడంతో ఇటీవల సికింద్రాబాద్‌ నుంచి గుంటూరుకు వెళ్లే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌కు తాత్కాలిక హాల్టింగ్‌ కల్పించారు. అయితే మూడు నెలలపాటు ఆదాయం వస్తేనే పూర్తిస్థాయిలో హాల్టింగ్‌ కల్పిస్తామని, లేకపోతే రద్దు చేస్తామని రైల్వే అధికారులు షరతు పెట్టారు. దీంతో హాల్టింగ్‌ కోల్పోకూడదనుకున్న గ్రామస్థులు సంఘటితమయ్యారు. ‘నెక్కొండ పట్టణ రైల్వే టికెట్స్‌ ఫోరం’ పేరుతో వాట్సప్‌ గ్రూపు ఏర్పాటు చేశారు. ఇందులో సుమారు 400 మంది సభ్యులుగా చేరారు. వీరంతా ఇప్పటి వరకు విరాళాల రూపంలో రూ.25 వేలు సేకరించారు. ఈ సొమ్ముతో రోజూ నెక్కొండ నుంచి ఖమ్మం, సికింద్రాబాద్‌ తదితర ప్రాంతాలకు రైలు టికెట్లు కొంటున్నారు. స్టేషన్‌కు ఆదాయం చూపించడం కోసమే ఇలా చేస్తున్నామని, మరిన్ని రైళ్ల హాల్టింగ్‌ కోసం కృషి చేస్తామని గ్రూపు అడ్మిన్లు రాంగోపాల్‌, వెంకన్న, మహిపాల్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌ తదితరులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని