కానిస్టేబుళ్ల శిక్షణకు 30 శాతం మంది గైర్హాజరు..!

రాష్ట్రంలో బుధవారం ప్రారంభమైన పోలీస్‌ కానిస్టేబుళ్ల శిక్షణకు భారీగా శిక్షణార్థులు గైర్హాజరవడం పోలీస్‌ శాఖలో చర్చనీయాంశమైంది.

Updated : 22 Feb 2024 06:58 IST

 ఇతర ఉద్యోగాలు సాధించడం వల్లనా? కేసుల కారణంగానా?
కారణాల అన్వేషణలో పోలీస్‌శాఖ నిమగ్నం
నెలాఖరు వరకు గడువు ఇవ్వాలని నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో బుధవారం ప్రారంభమైన పోలీస్‌ కానిస్టేబుళ్ల శిక్షణకు భారీగా శిక్షణార్థులు గైర్హాజరవడం పోలీస్‌ శాఖలో చర్చనీయాంశమైంది. తొలిరోజు సుమారు 2833 మంది హాజరుకాకపోవడంతో కారణాల అన్వేషణలో ఉన్నతాధికారులు నిమగ్నమయ్యారు.

శిక్షణకు రాష్ట్రవ్యాప్తంగా 13,953 మంది ఎంపికయ్యారు. తొలి దశలో 9,333 మందికి శిక్షణ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా బెటాలియన్లు, పీటీసీలు, సీటీసీలు..తదితర 28 కేంద్రాల్లో శిక్షణను ప్రారంభించారు.  శిక్షణ తొలిరోజు దాదాపు 6,500 మంది మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ అంబర్‌పేట పోలీస్‌ శిక్షణ కళాశాల(పీటీసీ)లో 650 మందికిగానూ 482 మంది, మేడ్చల్‌ పీటీసీలో 509కి 422 మంది, కరీంనగర్‌ పీటీసీలో 1000కి  675 మంది, వరంగల్‌ నగర శిక్షణ కేంద్రం(సీటీసీ)లో 250కి 201 మంది హాజరయ్యారు. దాదాపు అన్ని కేంద్రాల్లో ఇదే పరిస్థితి. మొత్తంగా సుమారు 30 శాతం మంది హాజరుకాకపోవడంతో..కారణాలను అన్వేషించడంపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు.  ఎంపికైన వారిలో పలువురు ఇతర ఉద్యోగాలు సాధించడం ఇందుకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ‘ఇటీవల వెలువడిన గురుకుల ఉపాధ్యాయులు, స్టాఫ్‌నర్స్‌ల పోస్టులను దక్కించుకున్నందునే పలువురు శిక్షణకు గైర్హాజరైనట్లు అంచనా వేస్తున్నాం. హాజరుకాని వారిలో మహిళా కానిస్టేబుల్‌ శిక్షణార్థులే ఎక్కువగా ఉండటం ఆ వాదనకు బలాన్నిస్తోంది. మరోవైపు కేసులు ఉన్న కారణంగా కొందరు శిక్షణకు రాలేదని సమాచారం. దీనిపై ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై ఉన్నతాధికారులు పరిశీలన చేస్తున్నారని’ పోలీస్‌ నియామక మండలి వర్గాల సమాచారం.

భారీగా బ్యాక్‌లాగ్‌లకు అవకాశం

వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ నియామక మండలి(టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ఆధ్వర్యంలో 4,965 సివిల్‌, 4,423 ఏఆర్‌, 100 ఎస్‌ఏఆర్‌ సీపీఎల్‌, 5,010 టీఎస్‌ఎస్‌పీ, 262 ఐటీ అండ్‌ సీ, 121 పీటీవో కానిస్టేబుళ్ల భర్తీకి 2022లో నోటిఫికేషన్‌ జారీ అయింది. ఈ లెక్కన అన్ని విభాగాల్లో కలిపి 14,881 మందిని ఎంపిక చేయాలి. ఎంపిక ప్రక్రియ పూర్తయిన సమయంలో తగినంత మంది అర్హులు లేకపోవడంతో 13,953 మందినే ఎంపిక చేశారు. ఈ క్రమంలో శిక్షణ ప్రారంభానికి ముందే 928 పోస్టులు బ్యాక్‌లాగ్‌ కింద మిగిలిపోయాయి. ఇప్పుడు శిక్షణకూ పెద్ద సంఖ్యలో గైర్హాజరవడంతో బ్యాక్‌లాగ్‌ల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది.‘శిక్షణలో చేరేందుకు ఈ నెలాఖరు వరకు గడువు ఇవ్వాలని శిక్షణ విభాగం నిర్ణయించింది. ఆ లోపు ఎంతమంది శిక్షణకు హాజరవుతారనేది తేలితే బ్యాక్‌లాగ్‌లపై స్పష్టత వస్తుంది’ అని ఉన్నతాధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని